- జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ నోటీసులు
- ఉద్యాన డైరెక్టర్, ఆయిల్ ఫెడ్ ఎండీలకు కూడా
- ముగ్గురు ఉన్నతాధికారులకు నోటీసులు ఇవ్వడంపై సంచలనం
- రేపు హైదరాబాద్ దిల్ కుషా అతిథి గృహంలో విచారణ
- దర్యాప్తుకు హాజరుకావాలని ఆదేశం… ఆయిల్ పామ్ రైతుల్లో ఉత్కంఠ
సహనం వందే, హైదరాబాద్: నాసిరకం ఆయిల్ పామ్ మొక్కలపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజన రైతు నుంచి వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఉద్యానశాఖ డైరెక్టర్, ఆయిల్ ఫెడ్ ఎండీలకు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. ఈ విషయంపై సోమవారం హైదరాబాదులో విచారణ చేపట్టామని, దానికి ఆ ముగ్గురు కీలక అధికారులు హాజరుకావాలని ఆదేశించింది. నాసిరకం మొక్కలకు సంబంధించిన అన్ని రికార్డులు, పత్రాలతో హాజరు కావాలని విజ్ఞప్తి చేసింది. సమావేశానికి రాకపోతే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338ఏలోని క్లాజు (8) ప్రకారం సివిల్ కోర్టు అధికారాలను వినియోగించుకోవడానికి కమిషన్‌కు స్వేచ్ఛ ఉంటుందని నోటీసులో స్పష్టం చేసింది. ఈ నోటీసులతో వ్యవసాయశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

గిరిజన రైతు శ్రీరాములు ఫిర్యాదు…
తాను నాటిన పామాయిల్ మొక్కలు ఏడేళ్లు అయినప్పటికీ కాయలు రాలేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగ్గారానికి చెందిన కె.శ్రీరాములు అనే గిరిజన పామాయిల్ రైతు జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. నాణ్యత లేని పామాయిల్ విత్తనాలను సరఫరా చేయడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని కమిషన్ కు వివరించారు.

ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా
అదేవిధంగా రాష్ట్రంలో ఆయిల్ పామ్ మొక్కల విషయంలో ఆయిల్ ఫెడ్ పై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఆఫ్ టైప్ మొక్కలు ఇచ్చారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆయిల్ ఫెడ్ అధికారులు కొందరు అక్రమాలు చేయడం వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ రాజభవన్ పక్కన ఉన్న దిల్ కుషా అతిథి గృహంలో ఈ విచారణ జరగనుంది. ఆ రైతుతోపాటు ఉన్నతాధికారులు హాజరుకావాలని కమిషన్ ఆదేశించింది.

ఆయిల్ ఫెడ్ డైరెక్టర్ శంకరయ్య
కమిషన్ ఆదేశాలతో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, ఆయిల్ ఫెడ్ డైరెక్టర్ శంకరయ్య హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సమావేశానికి ఢిల్లీ నుంచి కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం రానుంది.
దాదాపు సగం మంది గిరిజన రైతులే…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతుల్లో దాదాపు సగం మంది గిరిజనులే ఉండటం గమనార్హం. ఆ తర్వాత ఎస్సీ, బీసీలకు చెందిన రైతులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 90 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. అందులో 6 వేల మంది గిరిజన రైతుల చేతుల్లోనే 40 వేల ఎకరాల ఆయిల్ పామ్ తోటలు ఉన్నాయి. అటువంటి గిరిజన రైతులను ఆయిల్ ఫెడ్ అధికారులు అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో గిరిజన రైతులు ఉన్నందున ఈ విషయాన్ని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఈ విచారణ ద్వారానైనా ఆయిల్ పామ్ రైతులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు అశ్వారావుపేట ఆయిల్ పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమామహేశ్వర్ రెడ్డి అంటున్నారు.