- ఖమ్మం మీదుగా కొత్త హైవే
- 56 కిలోమీటర్లు తగ్గనున్న దూరం
- వచ్చే ఆగస్టు నాటికి అందుబాటులోకి
సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాదు నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు మరో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే సిద్ధం అవుతుంది. వచ్చే ఆగస్టు నాటికి ఇది అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు. అంటే రాబోయే కీలకమైన సంక్రాంతి పండుగకు రయ్ రయ్ మంటూ విశాఖపట్నం దూసుకుపోవచ్చు. మధ్యలో ఉండే రాజమండ్రి ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా ఇది అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. హైదరాబాద్-వైజాగ్ మధ్య ఏకంగా 56 కిలోమీటర్లు తగ్గటం విశేషం. ఇప్పటివరకు ఈ మార్గంలో ప్రయాణం చేయడం అత్యంత నరకప్రాయంగా ఉండేది. కొత్త రహదారి అందుబాటులోకి వస్తే ప్రయాణీకుల కష్టాలన్నీ తీరుతాయి.
ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ సాగే నూతన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు తుది దశకు చేరుకున్నాయి. ఖమ్మం నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి వరకు సుమారు 162 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ నాలుగు లేన్ల రహదారి, హైదరాబాద్ -విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయాన్ని, దూరాన్ని గణనీయంగా తగ్గించనుంది. సుమారు 2,200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2022 సెప్టెంబర్‌లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. వాస్తవానికి 2024 నాటికే నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, భూసేకరణకు సంబంధించిన జాప్యం కారణంగా పనులు ఆలస్యం అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లాలంటే విజయవాడ మీదుగా సుమారు 619
కిలోమీటర్ల ప్రయాణానికి 12 గంటల సమయం పడుతుంది. ఈ కొత్త రహదారి అందుబాటులోకి వచ్చిన తర్వాత, విజయవాడకు వెళ్లకుండానే సూర్యాపేట నుంచి నేరుగా ఖమ్మం, ఆపై తూర్పుగోదావరి జిల్లాల మీదుగా విశాఖపట్నం చేరుకోవచ్చు. ఇది ప్రయాణ దూరాన్ని తగ్గించి, సమయాన్ని గణనీయంగా ఆదా చేస్తుంది.
హైవేపై 9 భారీ వంతెనలు…
ఈ రహదారి తెలంగాణ పరిధిలో 89 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్ హైవేపై 9 భారీ వంతెనలు, 124 చిన్న వంతెనలు, 117 అండర్‌పాస్‌లను నిర్మించారు. తెలంగాణలోని ఖమ్మం, వైరా, కల్లూరు, సత్తుపల్లితోపాటు, ఆంధ్రప్రదేశ్‌లో తిరువూరు, జంగారెడ్డిగూడెం, గురవాయిగూడెం, దేవరపల్లి వద్ద ఈ రహదారిపైకి చేరుకునే మార్గాలున్నాయి.