కొత్త స్పెషల్ కమిషనర్‌కు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని సమాచార్ భవన్‌లో కొత్త స్పెషల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి సిహెచ్. ప్రియాంకను ఫెడరేషన్ బృందం కలిసి అభినందించింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్యతో పాటు ఇతర ప్రతినిధులు జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు, రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ పథకం, ప్రత్యేక రక్షణ చట్టం, వేజ్ బోర్డు అమలు, మహిళా జర్నలిస్టుల రవాణా, మీడియా అకాడమీ శిక్షణలో వివక్ష తదితర అంశాలను స్పెషల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అక్రిడిటేషన్లకు నాలుగోసారి స్టిక్కర్లు వేయడం సరికాదని, కొత్త ఆరోగ్య పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.