- అద్భుతమైన పర్షియన్ కావ్యం
- మొఘల్ చిత్రకళతో రామాయణం దృశ్యాలు
- చారిత్రక రజా గ్రంథాలయంలో గ్రంథం
- సాంస్కృతిక సమ్మేళనం అంటున్న మేధావులు
సహనం వందే, ఉత్తరప్రదేశ్: భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే రామాయణం శతాబ్దాల తరబడి ఎన్నో రూపాల్లో ప్రజల హృదయాల్లో కొలువై ఉంది. అయితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ నగరంలోని చారిత్రక రజా గ్రంథాలయంలో ఉన్న ఒక అద్భుతమైన పర్షియన్ రామాయణ కావ్యం, ఈ పుణ్య గ్రంథానికి సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఓంకారంతో కాకుండా, ఇస్లామిక్ పవిత్ర పదమైన బిస్మిల్లా అర్-రహమాన్ అర్-రహీమ్ (అల్లాహ్ పేరుతో, అత్యంత దయగలవాడు, అత్యంత కరుణామయుడు)తో ఈ రామాయణం ప్రారంభం అవుతుంది.

మొఘల్ చక్రవర్తి ఆదరణలో అద్భుత సృష్టి…
1713లో మొఘల్ చక్రవర్తి ఫరూఖ్ సియార్ ఆధ్వర్యంలో ఈ పర్షియన్ రామాయణం అనువాదం అయ్యింది. వాల్మీకి సంస్కృత శ్లోకాలను పర్షియన్ భాషలోకి అనువదించే మహత్తర కార్యాన్ని సుమేర్ చంద్ అనే పండితుడు చేపట్టారు. ఇది హిందూ, ఇస్లామిక్ సంస్కృతుల మధ్య వారధిగా నిలిచే ఒక అద్భుతమైన సాంస్కృతిక సమ్మేళనం. ఈ గ్రంథం కేవలం భాషా అనువాదం మాత్రమే కాదు, రెండు గొప్ప సంప్రదాయాల సమైక్యతకు ప్రతీక.
మొఘల్ చిత్రకళతో రామాయణ దృశ్యాలు:
ఈ రామాయణం ప్రత్యేకత కేవలం దాని ప్రారంభం మాత్రమే కాదు, దాని దృశ్య సౌందర్యం కూడా. ఇందులో ఉన్న 258 పేజీలు అద్భుతమైన మొఘల్ సూక్ష్మ చిత్రాలతో అలంకారం అయ్యాయి. శ్రీరాముడి వనవాసం, సీతాదేవి అపహరణ, హనుమంతుని సముద్ర లంఘనం వంటి ప్రతీ కీలక ఘట్టం నిశితమైన వివరాలతో, రంగులమయంగా చిత్రీకరణ అయ్యింది. రావణుని కిరీటంపై గాడిదను చిత్రించడం సీతను అపహరించిన అతని పాపానికి ప్రతీకగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక పుస్తకం కాదు… భక్తి, నాటకీయతలను కలిపి చూపించే ఒక చిత్రమాలిక.


వారసత్వానికి ప్రతీక…
రజా గ్రంథాలయ డైరెక్టర్ డాక్టర్ పుష్కర్ మిశ్రా ఈ గ్రంథాన్ని సాధారణ వారసత్వానికి స్మారక చిహ్నంగా అభివర్ణించారు. ఇది కేవలం భాషాపరంగానే కాదు, ఈ రామాయణం యొక్క స్ఫూర్తి విశ్వాసాల సమ్మేళనంలో ఉంది. ఇక్కడ భక్తి మతపరమైన హద్దులను అధిగమిస్తుందని ఆయన అన్నారు. ఈ సాంస్కృతిక ఆణిముత్యాన్ని విస్తృత ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురావడానికి ఇటీవల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రొఫెసర్ షా అబ్దుస్సల్మాన్, డాక్టర్ వకారుల్ హసన్ సిద్ధిఖీ దీనిని హిందీలోకి అనువదించారు. తద్వారా ఈ రామాయణం సారాంశం భాషా అడ్డంకులను దాటి సామాన్య ప్రజలకు చేరుకుంది. ఒకప్పుడు గూఢంగా ఉన్న ఈ గ్రంథాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చింది. రాంపూర్ లోని ఈ ప్రత్యేక రామాయణం, మత సామరస్యానికి, సాంస్కృతిక ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుంది.