- గద్వాల్‌లో రైతుల చేతికి సంకెళ్లు
- అన్నదాత ఆక్రోశం… ఆగని అగ్నిజ్వాలలు
- గతంలో లగచర్ల… ఖమ్మంలోనూ ఇదే పరిస్థితి
- పోలీసు యంత్రాంగం తీరుపై విమర్శలు
సహనం వందే, హైదరాబాద్:
రైతుల పట్ల పోలీసుల వ్యవహార శైలి తీవ్ర ఆక్షేపణీయంగా ఉంది. అనేక సందర్భాల్లో చిన్న చిన్న సంఘటనలకే అన్నదాతలకు సంకెళ్లు వేసి వారిని ఈడ్చుకొని వెళ్లడం దాష్టీకానికి పరాకాష్ట. తాజాగా జోగులాంబ గద్వాల్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతుల చేతులకు సంకెళ్లు వేసి, నేరస్తుల్లా కోర్టుకు తరలించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా విమర్శలకు కారణమైంది. ఈ సంఘటనపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తీవ్రస్థాయిలో స్పందిస్తూ… జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావును నిలదీశారు. బేడీలు వేసిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తెలిపినప్పటికీ, రైతులపై జరుగుతున్న ఈ దాష్టీకం ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఖమ్మంలో మిర్చి రైతుల పోరాటంలో, లగచర్లలో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా నిరసనల సందర్భంగా కూడా రైతులను సంకెళ్లతో బంధించిన ఘటనలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.
గద్వాల్ లో ఏం జరిగిందంటే?
జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానిక రైతులు నెలల తరబడి పోరాటం సాగిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల పర్యావరణ కాలుష్యం, వ్యవసాయ భూములకు నష్టం జరుగుతుందని 12 గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 4న ఈ నిరసన తీవ్రరూపం దాల్చగా, రైతులు ఫ్యాక్టరీ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు 41 మందిపై కేసులు నమోదు చేసి, 12 మంది రైతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 18న 12 మంది రైతులకు బెయిల్ మంజూరైంది. మహబూబ్‌నగర్ జైలు నుంచి అలంపూర్ కోర్టుకు తరలించే క్రమంలో వారి చేతులకు బేడీలు వేయడం సంచలనం రేపింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఈ ఘటన రైతుల పట్ల పోలీసు క్రూరత్వాన్ని బహిర్గతం చేసింది. రైతులకు బేడీలు వేస్తే ప్రభుత్వానికి చివరి ఘడియలేనని కొందరు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఖమ్మం మిర్చి సంక్షోభం...
గతంలో ఖమ్మం మార్కెట్ యార్డ్‌లో మిర్చి ధరలు పడిపోవడం, కొనుగోలు కేంద్రాల్లో జాప్యం, అవినీతి ఆరోపణలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 2017-18లో జరిగిన మిర్చి సంక్షోభ సమయంలో, తమ పంటకు గిట్టుబాటు ధర కోరుతూ రైతులు రోడ్డెక్కారు. ఖమ్మం మార్కెట్ యార్డ్ వద్ద జరిగిన ఈ నిరసనలను అణచివేయడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు బలాన్ని ఉపయోగించింది. ఈ క్రమంలో పలువురు రైతులను అరెస్టు చేసి, సంకెళ్లు వేసి కోర్టుకు తరలించారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. తమ పంటకు న్యాయమైన ధర కోరిన రైతులను నేరస్తులుగా చిత్రీకరించడం, సంకెళ్లతో బంధించడం సమాజంలో తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ సంఘటనలు రైతుల పట్ల అప్పటి ప్రభుత్వం చూపిన నిర్లక్ష్య వైఖరిని బట్టబయలు చేశాయి.
లగచర్ల… ఆసుపత్రిలోనూ సంకెళ్ల సవ్వడి
జోగులాంబ గద్వాల, ఖమ్మం ఘటనలతో పాటు, వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గిరిజన రైతులు చేపట్టిన నిరసన కూడా రైతులపై పోలీసు దౌర్జన్యానికి బహిర్గతం చేసింది. ఈ నిరసనల సందర్భంలో అరెస్టైన రైతుల్లో ఒకరు జైలులో రిమాండ్‌లో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గుండెపోటు లక్షణాలతో ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా ఆయన చేతులకు బేడీలు, కాళ్లకు గొలుసులు వేయడం గతేడాది డిసెంబర్‌లో తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లు తప్పుబట్టినప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. రైతు ఆరోగ్యం క్షీణించినప్పటికీ మానవీయ దృక్పథం లేకుండా పోలీసులు వ్యవహరించడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన రైతుల పట్ల ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది.