- ఒక సంపన్న మహిళ సూత్రధారి
- వ్యభిచారం, దోపిడీ రహస్యాలు వెలుగులోకి!
- నాటి లండన్ హత్య నిజాలు తాజాగా వెల్లడి
సహనం వందే, లండన్:
సుమారు 688 సంవత్సరాల క్రితం… సరిగ్గా 1337 మే సాయంత్రం... లండన్‌లోని ఓల్డ్ సెయింట్ పాల్స్ కేథడ్రల్ సమీపంలో జాన్ ఫోర్డ్ అనే పూజారి దారుణ హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు అతడిని చుట్టుముట్టి, గొంతు, కడుపులో పొడిచి ప్రాణాలు తీశారు. ఈ హత్య వెనుక ఎలా ఫిట్జ్‌పేన్ అనే ధనిక కుటుంబానికి చెందిన శక్తివంతమైన మహిళ హస్తం ఉందని చారిత్రక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత ఈ కేసులో వ్యభిచారం, దోపిడీ, హత్యకు సంబంధించిన అనేక దిగ్భ్రాంతికరమైన రహస్యాలు వెలుగులోకి రావడంతో మధ్యయుగ నాటి ఇంగ్లాండ్ సమాజంపై అనేక చారిత్రక అంశాలు చర్చలోకి వచ్చాయి.
ఆమె జీవితం… అక్రమ సంబంధాలు
ఎలా ఫిట్జ్‌పేన్... ఆ కాలంలో అపారమైన ధనంతో, పలుకుబడితో సమాజంలో శక్తివంతమైన స్త్రీగా గుర్తింపు పొందింది. ఈ పూజారి హత్యకు ప్రధాన కారకురాలిగా ఆమెనే చరిత్రకారులు భావిస్తున్నారు. 1332లో ఆర్చ్‌బిషప్ ఆఫ్ క్యాంటర్‌బరీ రాసిన ఒక లేఖలో ఆమెపై తీవ్ర వ్యభిచార ఆరోపణలు, అనేక మంది రాజకీయ, మతాధికారులతో అక్రమ సంబంధాలు ఉన్నాయని నిర్ధారించారు. ఈ ఆరోపణలలో హత్యకు గురైన జాన్ ఫోర్డ్ కూడా ఒకరు కావడం గమనార్హం. ఆమెకు ఆస్తులున్న ఒక గ్రామంలో ఫోర్డ్ పూజారిగా పనిచేసేవాడు. ఈ ఆరోపణల తర్వాత ఎలా ఫిట్జ్‌పేన్‌కు అవమానకరమైన శిక్షలు విధించినప్పటికీ, ఆమె వాటిని బేఖాతరు చేసిందని తెలుస్తోంది.
దోపిడీ, రాజకీయ కుట్రలు...
తాజాగా లభ్యమైన 1322 రాయల్ కమిషన్ నివేదిక ప్రకారం… ఫిట్జ్‌పేన్ తన భర్త సర్ రాబర్ట్, జాన్ ఫోర్డ్‌తో కలిసి ఒక ఫ్రెంచ్ బెనెడిక్టైన్ ప్రైరీపై దాడి చేసి 200 గొర్రెలు, 30 పందులు, 18 ఎడ్లను దొంగిలించినట్లు వెల్లడైంది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయిలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ సంఘటనలో ఫోర్డ్ మొదట ఫిట్జ్‌పేన్ బృందంలో భాగమై ఉండవచ్చని, అయితే తర్వాత ఆమె రహస్యాలను మతాధికారులకు వెల్లడించి ఉండవచ్చని పరిశోధకులు అనుమానిస్తున్నారు. ఇదే వారి మధ్య వైరుధ్యానికి దారితీసిందని భావిస్తున్నారు.