- సీఎంలను లెక్కచేయని హీరోల దుస్సాహసం
- కోట్లకు పడగలెత్తడంతో నెత్తికెక్కిన కళ్లు?
- బాబును కలవకపోవడంపై పవన్ అసహనం
- దీంతో ఆయన సినిమా ప్రదర్శనకు అడ్డు
- గద్దర్ అవార్డ్ ఫంక్షన్ కు రాకుండా అవమానం
సహనం వందే, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై… సినీ హీరోల విలనిజం పోకడ రాష్ట్ర ప్రభుత్వాల పట్ల తెలుగు సినిమా పరిశ్రమలోని అగ్రశ్రేణి హీరోలు, నిర్మాతలు, దర్శకులు డోంట్ కేర్ అన్న ధోరణి ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాలతో తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ, అదే సమయంలో రాయితీలు, అనుమతులు పొందడంలో మాత్రం ప్రభుత్వాలపై ఆధారపడుతున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వందలు, వేల కోట్ల రూపాయలకు పడగలెత్తిన కొందరు సినీ ప్రముఖుల కళ్లు నెత్తికెక్కాయని, అందుకే ప్రభుత్వాలను లెక్క చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గద్దర్ అవార్డుల వేడుక… పవన్ కళ్యాణ్ ఆరోపణలే సాక్ష్యం
ఈ లెక్కలేనితనానికి ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన గద్దర్ ఫిలిం అవార్డు ఫంక్షన్‌కు సినీ ప్రముఖులు హాజరుకాకపోవడం వారి నిర్లక్ష్యానికి తాజా ఉదాహరణగా నిలిచింది. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో ఏర్పాటు చేసిన అవార్డుల వేడుకకు స్టార్ హీరోలు దూరంగా ఉండటం విమర్శలకు దారి తీసింది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవకపోవడంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు. అత్యంత మాస్ ఫాలోయింగ్ ఉన్న ప్రజాప్రతినిధి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కీలక వ్యక్తి. ఆయన సినిమా విడుదలను కూడా అడ్డుకునే విధంగా కొందరు నిర్మాతలు వ్యవహరించారంటే, ప్రభుత్వాలు తమకు అవసరం లేదన్న భావన సినీ వర్గాల్లో ఏ మేరకు పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
రాయితీలు పొందుతూ నిర్లక్ష్యమా?
సినిమాల విడుదల సమయంలో అధిక రేట్లు పెంచాలని ప్రభుత్వాల నుంచి ఉత్తర్వులు తీసుకునే సినీ వర్గాలు, ఆ తర్వాత సర్కారు పెద్దల పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వందలు, వేల కోట్ల రూపాయలకు పడగలెత్తడంతో కళ్లు నెత్తికెక్కినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాల నుంచి సినీ రంగానికి లభించే రాయితీలు, సబ్సిడీలు, వినోద పన్ను మినహాయింపులు, టికెట్ల ధరల పెంపు వంటి అనేక విధాలుగా లబ్ధి పొందుతూ, ప్రభుత్వాలకు కనీస గౌరవం ఇవ్వకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
నాగార్జున ఉదంతం… అయినా లెక్క లేదా?
గతంలో ప్రముఖ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఒక రకంగా సినీ పరిశ్రమకు గట్టి వార్నింగ్ ఇచ్చిందని భావించారు. అయితే ఆ తర్వాత కూడా హీరోలు దారిలోకి రావడం లేదని ఒక తెలంగాణ కీలక ప్రజాప్రతినిధి వ్యాఖ్యానించారు. ఈ ధిక్కార ధోరణి ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా మారడమే కాకుండా, సినీ పరిశ్రమపై ప్రజల్లోనూ వ్యతిరేకతకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయమై సీరియస్‌గా దృష్టి సారించి, సినీ పరిశ్రమలోని లెక్కలేనితనాన్ని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటాయా లేదా వేచి చూడాలి.