- మావోయిస్టు ముసుగులో రాజకీయ కుట్రలు?
- తెలంగాణ పోలీసుల ప్రతిష్టకు మచ్చ
- వేల ఫోన్ల ట్యాపింగ్.. అప్రజాస్వామిక పాలన
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ పోలీసులు గత ప్రభుత్వ హయాంలో ఫోన్ల ట్యాపింగ్ స్కాండల్‌లో కూరుకుపోయారు. ప్రతినెల దాదాపు నాలుగు వేల ఫోన్లను ట్యాప్ చేశారు. ముఖ్యంగా 2023 సాధారణ ఎన్నికల సమయంలో ఒక్క నవంబర్ నెలలోనే 600కు పైగా ఫోన్లను ఏకకాలంలో ట్యాప్ చేసినట్లు తేలింది. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వ్యాపారవేత్తలను, హవాలా ద్వారా డబ్బు తరలిస్తున్న వారిని ట్యాపింగ్ ద్వారా గుర్తించి వారిని పట్టుకునేవారు. ఈ దాడులను హవాలా డబ్బుగా చిత్రీకరించి మీడియాకు చూపించే బాధ్యతను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్‌కు అప్పగించినట్లు సిట్ విచారణలో బయటపడింది.
మావోయిస్టు ముసుగులో అక్రమ నిఘా…
మావోయిస్టులపై ఆపరేషన్లు, ఎన్‌కౌంటర్లలో తెలంగాణ పోలీసులకున్న తిరుగులేని పట్టును, వారి కోవర్ట్ ఆపరేషన్ల నైపుణ్యాన్ని దుర్వినియోగం చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేలాది ఫోన్‌లను ట్యాప్ చేయించింది. మావోయిస్టుల సమాచారం తెలుసుకోవడం, వారి సానుభూతిపరులను పట్టుకోవడం వంటి పేరుతో ప్రతిపక్ష పార్టీల నాయకులు, వారి అనుచరులు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు, చివరికి ఎన్నికల్లో ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలను తెలుసుకోవడానికి ఈ ఫోన్ ట్యాపింగ్‌ను ఆయుధంగా ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు.
కీలక సూత్రధారులు… వారి పాత్ర
ఈ మొత్తం వ్యవహారం వెనక ఒక వ్యాపారవేత్త కీలక సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది. అతను ప్రతి నియోజకవర్గంలోనూ సర్వే పేరుతో కార్యాలయాలు తెరిచి, స్థానికంగా పట్టున్న నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, సమాజాన్ని ప్రభావితం చేసే వారి డేటాను సేకరించాడు. ఈ డేటా మొత్తాన్ని ఒక మాజీ మంత్రికి అందించగా, ఆ మాజీ మంత్రి నేరుగా ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు చేతిలో పెట్టినట్లు సమాచారం. ఈ సమయంలోనే వ్యాపారవేత్త, ప్రభాకర్ రావుల మధ్య మాజీ మంత్రి పరిచయాలు పెంచి, రాజకీయ ఎత్తుగడలు వేసి తిరిగి అధికారంలోకి రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ఆదేశాలతో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తన దగ్గర పనిచేస్తున్న డీఎస్పీ ప్రణీతరావుతో ఆ వ్యాపారవేత్తకు పరిచయం ఏర్పరిచారు. అప్పటికే సేకరించిన అన్ని ఫోన్ నెంబర్లను తమ డేటాబేస్‌లో చేర్చి, వీటి కోసం ప్రత్యేకంగా 50 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు కేవలం ప్రతిపక్ష నాయకులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరులు, కీలక నాయకుల ఫోన్‌లను ఎప్పటికప్పుడు ట్యాప్ చేసేవారు.
నిఘా పరిధిలో ఎవరున్నారు?
కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష నాయకులు, జర్నలిస్టులు, మీడియా అధిపతులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, హైదరాబాద్ నగరంలోని హవాలా ఆపరేటర్లపై నిఘా పెట్టారు. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీకి జట్కా ఇచ్చి ఇతర పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే, ఆ సమాచారాన్ని ప్రణీతరావు తెలుసుకొని అదనపు ఎస్‌పీ భుజంగరావుకు చేరవేసేవారు. భుజంగరావు నేరుగా సదరు నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా బీఆర్ఎస్ ముఖ్య నాయకుడికి ఫోన్ చేసి పరిస్థితిని చక్కదిద్దుకోమని చెప్పేవారు.
అంతర్రాష్ట్ర ఫోన్ ట్యాపింగ్?
తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్‌లకు సన్నిహితంగా ఉండే మరో ముగ్గురు ఫోన్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ రావు ఈ ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. సాధారణ ఫోన్‌లే కాకుండా వాట్సాప్ ఆడియోలు, చాటింగ్ కూడా ట్యాప్ చేసినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ప్రముఖులు ఎవరికి కాల్ చేస్తున్నారు, ఎవరితో టచ్ లో ఉన్నారు అనే వివరాలతో పాటు, వారి కుటుంబ సభ్యుల ఫోన్‌లను కూడా ట్యాప్ చేసినట్లు గుర్తించారు.
సిట్ విచారణ, భవిష్యత్ పరిణామాలు:
ప్రస్తుతం సిట్ అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచారు. మావోయిస్టుల పేరు చెప్పి ప్రభాకర్ రావు ట్యాపింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు. సాధారణ ఎన్నికల సమయంలో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావుల ఫోన్‌లను కూడా ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించారు. 2023 నవంబర్ 15 నుంచి ఈ ముగ్గురి ఫోన్‌లు ట్యాప్ అయినట్లు పోలీసులు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు తేలగా, ఆయనను కూడా సిట్ విచారణకు పిలిచింది. ఈ కేసు విచారణ కొనసాగుతుండగా మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.