- బనకచర్ల ప్రాజెక్టుపై జలయుద్ధం
- తెలంగాణ ప్రయోజనాలపై రాజీ పడబోం
- రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- రెండు రాష్ట్రాల్లో బనకచర్ల వివాదం
సహనం వందే, హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన దావరి-బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదంగా మారింది. ఈ ప్రాజెక్టు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో పలుకుబడి ఉందని అన్ని ప్రాజెక్టులకూ అనుమతులు వస్తాయని అనుకోవద్దని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించి తీరుతామని కుండబద్దలు కొట్టిన నేపథ్యంలో, దీనిని అడ్డుకోకపోతే తమ రాజకీయ భవిష్యత్తు ఉండదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యి, అనంతరం మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మోడీ-చంద్రబాబు బంధంపై రేవంత్ విమర్శలు…
‘మోడీకి చంద్రబాబు.. చంద్రబాబుకు మోడీ అవసరం ఉంది. అధికారం మీకు, నీళ్లు మాకు అన్నట్లుగా వ్యవహరిస్తున్నార’ని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ‘మోడీ మీరు చెబితే వినొచ్చు.. కానీ మా ప్రయోజనాలు వదులుకోం. మా హక్కులు హరిస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామ’ని చంద్రబాబుకు స్పష్టం చేశారు. గోదావరిలో తెలంగాణకు హక్కుగా ఉన్న 968 టీఎంసీల వినియోగానికి అనుమతించాలని, కృష్ణా బేసిన్ లోని 555 టీఎంసీలలో తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకుంటామని, ఇందుకు ఎన్ఓసీ ఇవ్వాలని సూచించారు. ఆ తర్వాత సముద్రంలోకి పోయే మిగులు జలాలను ఏపీ తీసుకోవడానికి అభ్యంతరం ఏమీ లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పైనా రేవంత్ ధ్వజం…
ఈ వివాదంపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ‘ఏ అంశం వచ్చినా, ఏ విషయం ప్రస్తావనకు వచ్చినా బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలను ప్రచారం చేస్తున్నార’ని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు, ఇప్పుడు అధికారం కోల్పోయాక ఎలా మాట్లాడుతున్నారో ప్రజలు గమనించాలని సూచించారు. ‘వాళ్లు సెంటిమెంట్ తో మళ్లీ పార్టీని బ్రతికించుకునే ప్రయత్నం చేస్తున్నార’ని విమర్శించారు. రైతాంగాన్ని కష్టాల నుంచి బయట పడేసేందుకు కాంగ్రెస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించామని… కేసీఆర్, హరీష్ సంపూర్ణ అవగాహనతో సహకరించినా, సూచనలు చేసినా స్వీకరిస్తామని అన్నారు.