- ప్రపంచంలో పెరుగుతున్న సెక్యులరైజేషన్
- ఏ మతానికీ చెందనివారు 147 కోట్లు పైనే
- అభివృద్ధి చెందిన దేశాల్లో ఇదొక ఫ్యాషన్
- ప్రధానంగా క్రైస్తవ మతం నుంచి బయటకు
- క్రైస్తవం, ఇస్లాం తర్వాత సెక్యులరిస్టులే
- క్రిస్టియన్లు 230 కోట్లు, ముస్లింలు 200 కోట్లు
- హిందువులు 120 కోట్లు… పెరుగుదల స్థిరం
- శరవేగంగా పెరుగుతున్న ఇస్లాం మత జనాభా
- ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా నివేదిక వెల్లడి
సహనం వందే, ఢిల్లీ:
ప్రపంచంలో సెక్యులరిజం పెరుగుతుంది. వివిధ మతాల నుంచి కోట్ల మంది బయటకు వస్తున్నారు. అలాగే
అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలకు చెందిన అనేకమంది సెక్యులరిస్టులుగా మారిపోతున్నారు. ప్రపంచంలో క్రైస్తవుల జనాభా 230 కోట్లు, ఇస్లాం మతస్తుల జనాభా 200 కోట్లు… ఆ తర్వాత మూడో వర్గం ఏ మతానికీ చెందని వారు 147 కోట్ల మంది ఉన్నారు. ఆ తర్వాత 120 కోట్ల మంది హిందూ మతస్తులు ఉన్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది.
ఏ మతానికి చెందని వారు (సెక్యులరిజం) 24.2 శాతం…
ఏ మతానికి చెందని వారి సంఖ్య 2010లో 23.3 శాతం నుండి 2020 నాటికి 24.2 శాతానికి పెరిగింది. ఈ వర్గం ప్రధానంగా చైనా (130 కోట్లు), అమెరికా (10.1 కోట్లు), జపాన్ (7.3 కోట్లు)లో అత్యధికంగా ఉంది. క్రైస్తవ కుటుంబాలలో పుట్టి పెరిగిన చాలా మంది మతాన్ని వదిలేయడం వల్ల ఈ వర్గం వృద్ధి చెందింది. అభివృద్ధి చెందిన దేశాలలో సెక్యులరైజేషన్ పెరుగుతోంది. అంతేకాకుండా సబ్-సహారా ఆఫ్రికా, ఆసియా ఖండాలలో మత గుర్తింపు రోజువారీ జీవనంలోనూ, పాలనలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.
తగ్గిన క్రిస్టియన్ల జనాభా శాతం…
క్రైస్తవులు 2010లో 218 కోట్ల నుండి 2020 నాటికి 230 కోట్లకు చేరింది. అయినప్పటికీ ప్రపంచ జనాభాలో వారి వాటా 30.6 శాతం నుండి 28.8% శాతానికి తగ్గింది. దీనికి ప్రధాన కారణం మత మార్పిడులేనని నివేదిక స్పష్టం చేసింది. ‘ప్రపంచవ్యాప్తంగా యువకులలో ఒక వ్యక్తి క్రైస్తవంగా మారుతుంటే, క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన ముగ్గురు మతాన్ని వదిలేస్తున్నారని’ తెలిపారు. అధిక జనన రేటు ఉన్నప్పటికీ, మత మార్పిడుల వల్ల క్రైస్తవం వాటా కోల్పోయిందని నివేదించింది. 2010లో 124 దేశాల్లో క్రైస్తవులు అత్యధిక సంఖ్యలో ఉండగా, 2020 నాటికి ఈ సంఖ్య 120 దేశాలకు తగ్గింది. యునైటెడ్ కింగ్‌డమ్ (49%), ఆస్ట్రేలియా (47%), ఫ్రాన్స్ (46%), ఉరుగ్వే (44%) వంటి దేశాలలో క్రైస్తవులు జనాభాలో 50% కంటే తక్కువగా ఉన్నారు. సబ్-సహారా ఆఫ్రికాలో క్రైస్తవుల వాటా 24.8% నుండి 31%కి పెరిగింది, అయితే యూరప్‌లో మాత్రం గణనీయంగా తగ్గింది. మొజాంబిక్‌లో క్రైస్తవుల వాటా 5 శాతం పెరగడం గమనార్హం.
200 కోట్లకు చేరిన ముస్లిం జనాభా…
ఇస్లాం మతం అత్యంత వేగంగా వృద్ధి చెందిన మతంగా నిలిచింది. 2010-2020 మధ్య కాలంలో 34.7 కోట్ల మంది అదనంగా పెరిగి, మొత్తం సంఖ్య సుమారు 200 కోట్లకు చేరింది. ప్రపంచ జనాభాలో ఇస్లాం వాటా 1.8 శాతం పెరిగి 25.6 శాతానికి చేరుకుంది. ఇస్లాం వృద్ధికి ప్రధాన కారణాలు యువ జనాభా, అధిక జనన రేటు, తక్కువ మత మార్పిడి రేటు అని నివేదిక వెల్లడించింది.
స్థిరంగా హిందువుల వృద్ధిరేటు…
హిందూ మతం సంఖ్యాపరంగా 12.6 కోట్ల మంది పెరిగి 120 కోట్లకు చేరింది. ప్రపంచ జనాభాలో 14.9 శాతం వాటాను నిలబెట్టుకుంది. యూదు మతం 2010లో 1.38 కోట్ల నుండి 2020 నాటికి 1.48 కోట్లకు పెరిగింది. ఇది ప్రపంచ జనాభాలో 0.2% మాత్రమే. ఈ రెండు మతాలలో మత మార్పిడి రేటు చాలా తక్కువగా ఉండటం వల్ల అవి స్థిరంగా నిలిచాయి. అలాగే జైనం, సాంప్రదాయ మతాలు కూడా ప్రపంచ జనాభా వృద్ధికి అనుగుణంగా 2.2 శాతం వాటాను కలిగి ఉన్నాయి. బౌద్ధమతం 2010లో 34.3 కోట్ల నుండి 2020 నాటికి 32.4 కోట్లకు తగ్గింది. తక్కువ జనన రేటు, మత మార్పిడులు దీనికి కారణాలుగా నివేదిక తెలిపింది.
మూలం: Times of India.com, ప్యూ రీసెర్చ్ సెంటర్