- మౌలిక సదుపాయాలు లేక రోగుల విలవిల
- మొబైల్ లైట్ లో చికిత్స చేసినందుకు శిక్షా?
- జహీరాబాద్ సూపరింటెండెంట్ సస్పెన్షన్
- తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఖండన
సహనం వందే, హైదరాబాద్:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఆసుపత్రుల్లో కరెంటు కష్టాలు రోగుల పాలిట శాపంగా మారాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో కరెంటు కోతతో వైద్యులు సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ల సాయంతో రోగులకు చికిత్స అందించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వైద్య ఆరోగ్యశాఖ స్పందించి, ఆసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ శ్రీధర్ కుమార్‌ను సస్పెండ్ చేసింది. అయితే, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఈ సస్పెన్షన్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
తక్షణ విచారణ… సస్పెన్షన్
ఈ ఘటనపై సంగారెడ్డి కలెక్టర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్‌లు సంయుక్తంగా విచారణ చేపట్టారు. విచారణలో జనరేటర్ ఆపరేషన్‌లో జాప్యం జరిగిందని తేలడంతో ఆసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ శ్రీధర్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో బ్యాకప్ జనరేటర్లు ఎల్లవేళలా సిద్ధంగా ఉంచాలని ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
అసలేం జరిగింది?
ఇటీవల జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో ఆకస్మిక కరెంటు కోత ఏర్పడింది. ఆసుపత్రిలో బ్యాకప్ జనరేటర్ అందుబాటులో ఉన్నప్పటికీ, దానిని సకాలంలో ఆన్ చేయడంలో జాప్యం జరిగింది. దీంతో చీకట్లో రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు సెల్‌ఫోన్ ఫ్లాష్‌లైట్లను ఆశ్రయించక తప్పలేదు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఆసుపత్రి నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. గతంలోనూ భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి కరెంటు కోతల సమస్యలు ఎదురయ్యాయి.

నరహరి, లలూప్రసాద్ రాథోడ్ ఖండన
జహీరాబాద్ ఘటనపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మౌలిక వసతుల లోపాలను పరిష్కరించకుండా వైద్యులను తక్షణమే సస్పెండ్ చేయడం సరికాదని సంఘం స్పష్టం చేసింది. సంఘం అధ్యక్షుడు డాక్టర్ నరహరి, సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలు ప్రసాద్ రాథోడ్, ట్రెజరర్ డాక్టర్ ఎం.కె. రవూఫ్ ఈ అంశంపై ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ నిలిచిపోయిన సమయంలో వెలుతురు తక్కువగా ఉండటంతో వైద్యులు మొబైల్ ఫ్లాష్‌లైట్లతో సేవలు అందించారని, ఇది నిర్లక్ష్యం కాదని సంఘం స్పష్టం చేసింది. ప్రతి దురదృష్టకర సంఘటన తర్వాత పూర్తి విచారణ లేకుండానే డాక్టర్లను నిందించడం అన్యాయమని, ఇది వైద్యుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. జనరేటర్లు, అత్యవసర వెలుతురు వంటివి అందుబాటులో ఉంచటం మొత్తం ఆరోగ్య శాఖ బాధ్యత అని, వీటి పనితీరును నిరంతరం తనిఖీ చేసే వ్యవస్థ ఉండాలని సూచించారు. సాధారణంగా విభాగాధిపతి ప్రాథమిక నివేదిక సమర్పించాక విజిలెన్స్ సెల్ నిష్పక్షపాతంగా విచారణ జరుపుతుందని, అయితే వైద్య విధాన
పరిషత్ కమిషనర్ సరైన విచారణ చేయలేదని ఆరోపించారు. ఇటువంటి ఘటనలపై స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతుల ఆడిట్ చేయాలని, పూర్తి స్థాయి న్యాయమైన విచారణ తర్వాతే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. వైద్యులు భయంతో కాకుండా గౌరవంతో పనిచేసేలా ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలని వారు కోరారు.