- కన్నడ ఆత్మగౌరవంపై దాడి
- ఆగని కన్నడిగుల ఆగ్రహం
సహనం వందే, చెన్నై:
చెన్నైలో ఇటీవల జరిగిన థగ్ లైఫ్ అనే కార్యక్రమం ఒక భారీ వివాదానికి కేంద్రమైంది. ఈ వేడుకలో పాల్గొన్న కమల్ హాసన్, కన్నడ భాష కూడా తమిళం నుంచే ఉద్భవించిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య తీవ్ర వివాదాస్పదమైంది. తమిళులు, కన్నడిగుల మధ్య సంబంధాలు అంత గొప్పగా ఉండవన్న విషయం తెలిసిందే. జల వివాదాలు, సరిహద్దు తగాదాలు వంటి అంశాలు ఎప్పుడూ రగులుకుంటూనే ఉంటాయి. ఇలాంటి సున్నితమైన సమయంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా భావోద్వేగాలను రెచ్చగొట్టడానికే తప్ప ఇంకేం ప్రయోజనం ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎవరైనా ప్రముఖుడు ఏదైనా మాట్లాడితే దానికి స్పందన ఒక స్థాయి వరకు వచ్చి ఆగేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎవరూ విషయాన్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. ఇలాంటి తరుణంలో ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చాలా పెద్ద తప్పిదం.
క్షమాపణకు నిరాకరణ…
తన వ్యాఖ్యలు పెను వివాదంగా మారిన నేపథ్యంలో కమల్ హాసన్ మళ్లీ స్పందించారు. భాషా చరిత్ర గురించి ఎంతోమంది చరిత్రకారులు తనకు చెప్పారని, తన వ్యాఖ్యల్లో వేరే ఉద్దేశం లేదని ఆయన చెప్పుకొచ్చారు. “భాష గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదు. ఇది నాకు కూడా వర్తిస్తుంది. ప్రేమతోనే అలా చెప్పాను. ఎంతోమంది చరిత్రకారులు భాషా చరిత్ర గురించి నాకు నేర్పించారు. నేను చేసిన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశం లేదు” అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రత్యేకత గురించి ప్రస్తావించారు. ఈ అంశాన్ని ‘చరిత్రకారులకు.. పురావస్తు శాస్త్రవేత్తలు.. భాషా నిపుణులకు వదిలేద్దాం’ అని వివరించారు. తన మాటల వల్ల రేగిన వివాదానికి, మనోభావాలు దెబ్బ తిని ఉంటే క్షమించండి అన్న మాట చెప్పి ఉంటే బాగుండేది. కానీ ఆయన మాత్రం, తాను సారీ చెప్పలేనని స్పష్టం చేయడం గమనార్హం.