- మాజీ ముఖ్యమంత్రి నీడలో సామంత రాజ్యం
- ప్రజారోగ్య సంచాలకుడిగా ఇష్టారాజ్యం
- తన పేరు ప్రతిబింబించేలా తండ్రి పేరుతో ట్రస్ట్
- జీఎస్ఆర్ ట్రస్ట్ తో వసూళ్లు… కార్యక్రమాలు
- డీఎంహెచ్ఓ స్థాయి కాని వ్యక్తి వాళ్లకే బాస్
- కమిషనర్ ను పక్కన పెట్టి కరోనా బాధ్యతలు
- రాజకీయ ప్రవేశం కోసం పొర్లు దండాలు
- తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి
సహనం వందే, హైదరాబాద్:
గడల శ్రీనివాసరావు… తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులుగా ఉన్న కాలంలో మొత్తం వ్యవస్థను తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఆ విభాగాన్ని గడల సామంత రాజ్యం (జీఎస్ఆర్)గా మలుచుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అండ చూసుకొని మరీ పెచ్చుమీరిపోయారు. ఎందుకో ఏమో కానీ గడలను ఒకానొక సందర్భంలో పక్కన పెట్టాలని అనుకున్న కేసీఆర్... కరోనా కాలంలో అందలం ఎక్కించారు. దీంతో గడలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆయన ఒక సెలబ్రిటీగా మారిపోయారు. రాష్ట్రంలో ఏ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు దక్కని ప్రాధాన్యం ఈయనకు లభించింది. కరోనా ప్రారంభ కాలంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు. ఆయనను వార్తల్లోకి రానీయకుండా చేసేందుకు కేసీఆర్… కరోనా అప్డేట్ లన్నింటినీ గడలతో ఇప్పించారు. అంతేకాదు ఏపీ సహా అనేక రాష్ట్రాల్లో ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్లపైనే కరోనా నియంత్రణ బాధ్యతలు పెట్టగా… తెలంగాణలో మాత్రం ఇంచార్జ్ ప్రజారోగ్య సంచాలకుడి మీద పెట్టడం విశేషం. ఈ పరిస్థితులను తన వసూళ్లకు కేంద్రంగా గడల ఏర్పాటు చేసుకున్నారు. విచిత్రం ఏంటంటే డీఎంహెచ్ఓ స్థాయి కూడా లేని గడలను డీహెచ్ గా పెట్టడమే అసలైన ట్విస్ట్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆయనను మహబూబాబాద్ జిల్లాకు డీఎంహెచ్ఓ తర్వాత స్థాయి పోస్టుకి బదిలీ చేశారు.
రాజకీయాలపైనే ఫోకస్ పెట్టి…
తన పేరు తన తండ్రి పేరు ప్రతిబింబించేలా జీఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ పేరు మీద కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రముఖుల నుంచి భారీగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2023 ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేయాలని ఆయన ప్లాన్ చేశారు. అందుకోసం కరోనా కాలం నుంచే ఆ నియోజకవర్గంపై దృష్టి సారించారు. ట్రస్ట్ పేరుతో కార్యకలాపాలు నిర్వహించారు.

లక్షల రూపాయలు ఖర్చు చేసి జాబ్ మేళ, వైద్య శిబిరాలు నిర్వహించారు. స్థానిక అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేపైనే ఏకంగా రాజకీయ విమర్శలు చేశారు. ఒక అధికారిగా రాజకీయ విమర్శలు చేయడంపై వివాదాలు తలెత్తినా పట్టించుకోలేదు. నాటి ముఖ్యమంత్రి అండదండలు చూసుకుని చెలరేగిపోయారు. హైదరాబాద్ కోఠిలోని డీహెచ్ కార్యాలయం ‘మినీ కొత్తగూడెం నియోజకవర్గ రాజకీయ కేంద్రం’గా మారిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. తన వద్ద అధికారులుగా పని చేసే కొందరిని కొత్తగూడెంలో నిర్వహించే పలు కార్యకమాలకు వాడుకున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. సీటు కోసం కేసీఆర్ కాళ్లు పట్టుకోవడం తీవ్రమైన విమర్శలకు దారి తీసినా లెక్క చేయలేదు. చివరకు ఎన్నికల సమయంలో ఆయనకు టిక్కెట్ దక్కలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తనపై బీఆర్ఎస్ ముద్ర ఉందన్న భయంతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి ఆయన ఆశీర్వాదం పొందాలని చూశారు. ఆ పార్టీలో చేరుతున్నట్లు బిల్డప్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఖమ్మం లోక్ సభ సీటుకు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు నటించడం ద్వారా ఇక్కడ తన పోస్టుకు డోకా లేకుండా చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. మరోవైపు తన అక్రమాలు బయటకు వస్తాయని భయపడి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయనపై విజిలెన్స్ ఎంక్వయిరీ ఉన్నప్పటికీ వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వడం పైన కూడా విమర్శలు ఉన్నాయి.
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో..
అప్పట్లో డాక్టర్ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు తరచూ వివాదాస్పదం అవుతుండేవి. రంజాన్ ఇఫ్తార్ పార్టీలో ‘చిన్నతనంలో నాకు దెబ్బ తగిలి రక్తస్రావమైంది. మా తాత దగ్గరిలోని ఒక మసీ దుకు తీసుకెళ్లి మౌలాసాబ్తో ఒక తాయత్తు కట్టించారు. ఆ తాయత్తు మహిమతో ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా..” అని శ్రీనివాసరావు పేర్కొనడం వివాదాస్పదమైంది. వైద్యాధికారిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటన్న విమర్శలు వచ్చాయి. శ్రీనివాసరావు ఓ సందర్భంలో.. “నా పెరుగుదల అంతా అన్నల అడుగు జాడల్లో జరిగింది. గన్ పట్టుకొనే వాడిని, దారి తప్పి స్టెతస్కోప్ పట్టుకున్నా..” అనడంపైనా విమర్శలు వచ్చాయి. అలాగే కొత్తగూడెం జిల్లాలో ఒక మహిళ తనకు తానే దేవతగా ప్రకటించుకోవడం, క్షుద్రపూజల తరహాలో పూజలు చేయడం, ఆమె వద్దకు వచ్చిన వారి కోరికలు నెరవేరుతాయనే ప్రచారం జరిగింది. డాక్టర్ శ్రీనివాసరావు అక్కడికి వెళ్లి ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేసి, నమస్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శ్రీనివాసరావుకు రాజకీయంగా అవకాశం కల్పిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని… ఈ క్రమంలోనే ఆయన రాజకీయ కార్యకలాపాలపై బీఆర్ఎస్ పార్టీ, అప్పటి ప్రభుత్వం చూసీ చూడనట్టు ఉందని ఆ పార్టీ వర్గాలు చెప్తుండేవి.
_________________________________________________________________________________________________________
తదుపరి ఎడిషన్ లో సంచలన కథనం…
కరోనా కాలంలో అనేకమంది మహిళా ఉద్యోగులను తాత్కాలిక పద్ధతిలో నియమించుకున్నారు. ఆ సమయంలో కొందరిని వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితులు ప్రభుత్వ పెద్దల వద్ద గోడు వెళ్ళబోసుకున్నారు. దీంతో ఆ పెద్ద మనిషికి చివాట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో బాధితుల గోడు, లైంగిక వేధింపులపై వారి ఆరోపణలతో కూడిన సంచలనాలతో కూడిన ప్రత్యేక కథనం…