- 30వ అంతస్తు నుండి పడిన భరత్
- ఇక సొంత ఫ్లాట్‌లో మరొకరి మృతి
- టెక్కీలపై ఒత్తిడి… మిస్టరీగా మరణాలు
సహనం వందే, హైదరాబాద్:
మన సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అసలు ఏమవుతోంది? రేపో మాపో మంచి భవిష్యత్తు ఉంటుందనుకున్న ప్రాణాలు ఇలా అర్ధాంతరంగా గాల్లో కలసిపోతుంటే ఏం అనాలి? నగరంలో ఒకేసారి ఇద్దరు ఐటీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఒకరు భవనం పైనుంచి పడి చనిపోతే, ఇంకొకరు మూసిన తలపుల వెనుక శవమై తేలారు.
గోల్ఫ్ ఎడ్జ్‌లో తీవ్ర విషాదం
నానక్‌రామ్‌గూడలోని గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్మెంట్స్ 30వ అంతస్తు నుండి కింద పడి ఉప్పల భరత్ అనే 29 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన భరత్ బెంగళూరులోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ ఘటన జరగడానికి కేవలం రెండు రోజుల ముందే అతను ఈ అపార్ట్మెంట్లోని ఒక అద్దె ఫ్లాట్‌లోకి మారడం గమనార్హం.
పార్కింగ్‌లో వాహనంపై పడి
సోమవారం ఈ దారుణం జరిగింది. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ పార్కింగ్ ప్రాంతంలో నిలిపి ఉంచిన ఒక వాహనంపై భరత్ పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది, వైద్యులు మరణించినట్లు చెప్పారు. భరత్ బంధువు ఉప్పల కిషోర్ ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి పంపారు.
కొండాపూర్‌లో ఇంకో ఘోరం
మరోవైపు కొండాపూర్‌లోని తన స్నేహితుడి ఫ్లాట్‌లో ఆదివారం 36 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని సౌరభ్ శేఖర్‌గా గుర్తించామని, అతను దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని పోలీసులు చెప్పారు. హర్యానాకు చెందిన సౌరభ్… రాయదుర్గంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఇనార్బిట్ మాల్ సమీపంలో తన తమ్ముడితో కలిసి నివసిస్తున్నాడు.
వాట్సాప్ మెసేజే చివరి మాట
శనివారం సాయంత్రం స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నట్లు తమ్ముడికి చెప్పి ఫ్లాట్ నుండి బయటకు వెళ్లాడు. కుటుంబ సభ్యుల వాట్సాప్ గ్రూప్‌లో స్నేహితుడి అపార్ట్మెంట్ చిరునామాను పంపడమే అందరితో జరిగిన చివరి సంభాషణ. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా తీయకపోవడంతో తమ్ముడు ఆ చిరునామాకు వెళ్లి చూశాడు. అక్కడ తలుపులు లోపలి నుంచి తాళం వేసి ఉన్నాయి.
తలుపులు బద్దలు కొట్టి చూస్తే…
సోదరుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని డోర్ బలవంతంగా ఓపెన్ చేశారు. లోపలికి వెళ్ళి చూడగా సౌరభ్ విగతజీవిగా పడి ఉన్నాడు. ఐటీ రంగంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడం, అనారోగ్య సమస్యలు సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాలను ఎంతగా దెబ్బతీస్తున్నాయో ఈ రెండు సంఘటనలు స్పష్టంగా చూపిస్తున్నాయి.