- ప్రత్యేక భేటీతో గతంలో ఓడిన బిల్లు మళ్లీ తెరపైకి!
- డీలిమిటేషన్.. రాజకీయ భూకంపం
- సౌత్‌కు గడ్డు కాలం… సీట్లతో ఆధిపత్యం
- సమాఖ్య వ్యవస్థకు ఎదురయ్యే సవాలు
- ఎన్సీపీ శరద్ పవార్ వర్గం యూటర్న్
- దక్షిణాది పార్టీలది అవకాశవాద రాజకీయమా?
సహనం వందే, హైదరాబాద్:
పార్లమెంటులో ఏప్రిల్‌లో ఓటమి ఎదురైన డీలిమిటేషన్ అంశం ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తోంది. వచ్చే వారం ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో సవరించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోక్‌సభ సమావేశాలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుండగా, రాజ్యసభ సమావేశాలు డిసెంబర్ 2 నుంచి మొదలవుతాయి. రెండు సభల సమావేశాలు 3తో ముగియనున్నాయి. ఒకసారి ఓటమి ఎదురైన ప్రతిపాదనను వదిలిపెట్టకుండా మళ్లీ ముందుకు తీసుకొస్తున్న కేంద్రం.. ఈసారి అవసరమైన రాజకీయ సంఖ్యాబలాన్ని కూడగట్టి బిల్లును ఆమోదింపజేసుకోవాలన్న లక్ష్యంతో కసరత్తు చేస్తోంది.
సీట్ల పెంపు.. రాజకీయ లెక్కలు!
డీలిమిటేషన్ అంటే జనాభా, ప్రాంతాల ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల సరిహద్దులు, స్థానాల సంఖ్యను నిర్ణయించే ప్రక్రియ. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదన ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. సీట్లు పెరగడం వల్ల అన్ని రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, వాటి పంపిణీ ఎలా జరుగుతుందన్నదే కీలకం. జనాభా ఆధారంగా ఎక్కువ స్థానాలు కేటాయిస్తే జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలకు రాజకీయ బలం పెరుగుతుంది. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాల మొత్తం ప్రాతినిధ్య వాటా మాత్రం తగ్గే ప్రమాదం ఉంది. సంఖ్య పెరగడం ఒకటి.. దేశ మొత్తం సీట్లలో వాటా పెరగడం మరొకటి. ఈ రెండింటి మధ్య తేడానే దక్షిణాది రాష్ట్రాల ఆందోళనకు కారణం.

తమిళనాడు షరతులు.. డీఎంకే పోరాటం!
డీలిమిటేషన్‌పై దక్షిణాదిలో అత్యంత స్పష్టమైన వ్యతిరేక స్వరం తమిళనాడు నుంచి వినిపిస్తోంది. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రానికి రాజకీయంగా నష్టం కలిగించే విధంగా సీట్ల పంపిణీ జరగకూడదన్నది డీఎంకే ప్రధాన వాదన. కేంద్రం 50 శాతం సీట్ల పెంపు హామీ ఇచ్చినా అది మాటల్లో కాకుండా చట్టంలో స్పష్టంగా ఉండాలని తమిళనాడు కోరుతోంది. రాష్ట్రాల ప్రస్తుత ప్రాతినిధ్యానికి రక్షణ కల్పించాలి, జనాభా ఆధారంగా దక్షిణాది వాటా తగ్గకూడదు, బిల్లులో స్పష్టమైన భరోసా ఉండాలి అన్న డిమాండ్లు ముందుకు వస్తున్నాయి. ముసాయిదా బిల్లు చూసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని డీఎంకే చెబుతోంది.
ఏపీలో మూడు పార్టీలు.. ఒకే వైఖరి!
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి మాత్రం తమిళనాడుకు భిన్నంగా కనిపిస్తోంది. తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్సీపీ.. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు డీలిమిటేషన్ ప్రతిపాదనకు మద్దతు పలుకుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఈ మూడు పార్టీలు ఒకే అంశంపై ఒకే వైపు నిలబడటం ఆసక్తికర పరిణామం. అయితే డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల మొత్తం రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం పడే అవకాశం ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ప్రయోజనాలు మాత్రమే కాకుండా దక్షిణాది మొత్తం ప్రయోజనాలను కూడా ఈ పార్టీలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర రాజకీయాలు, కేంద్రంతో సంబంధాలు ఒకవైపు.. దీర్ఘకాలిక ప్రాంతీయ ప్రయోజనాలు మరోవైపు. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడం పార్టీలకు పరీక్షగా మారుతోంది.
సంఖ్యాబలం.. దక్షిణాది ఐక్యత!
ఏప్రిల్‌లో ప్రతిపక్షాలు ఏకమై బిల్లును అడ్డుకున్నాయి. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన కొంతమంది ఎంపీలు విడిపోయి మరో వర్గంలో చేరడం, శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన ఎంపీలు షిండే వర్గంలోకి వెళ్లడం వంటి పరిణామాలు రాజకీయ లెక్కలను మార్చాయి. శిరోమణి అకాలీదళ్‌తో బీజేపీ కూటమి కుదుర్చుకోవడం కూడా ప్రభుత్వానికి మద్దతు పెరిగే అవకాశంగా కనిపిస్తోంది. మరోవైపు డీఎంకే, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం వంటి పార్టీల వైఖరి కీలకంగా మారింది. ఈ పరిస్థితుల్లో తమిళనాడు వ్యతిరేక స్వరం, ఆంధ్రప్రదేశ్ మూడు పార్టీల మద్దతు మధ్య దక్షిణాది రాజకీయాల్లో భిన్నమైన ధోరణి కనిపిస్తోంది. తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కూడా తమ ప్రాతినిధ్యానికి స్పష్టమైన రక్షణ కోరాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్రానికి సీట్లు పెరగడం మాత్రమే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల మొత్తం వాటా పార్లమెంటులో నిలబడటం ముఖ్యం. విడివిడిగా రాజకీయ లెక్కలు వేసుకుంటే ప్రాంతీయ ప్రయోజనాలు బలహీనపడవచ్చు. అందుకే డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఒకే గొంతుతో మాట్లాడాల్సిన సమయం వచ్చింది.