రొమాన్స్ రోదన… శృంగార వేదన – ప్రపంచవ్యాప్తంగా లైంగిక సంక్షోభం

  • ప్రేమకు బ్రేక్‌.. పడకకు ప్యాక్‌!
  • భాగస్వామి లేక ఆగిపోతున్న జీవితం
  • చదువు, ఉద్యోగం.. ప్రేమకు గ్రహణమా?
  • పెళ్లిపై ఆసక్తి ఎందుకు చచ్చిపోతోంది?
  • యువతలో పెరుగుతున్న ఒంటరితనం
  • అమెరికా, బ్రిటన్‌, యూరప్ లోనూ ఇదే పరిస్థితి

సహనం వందే, హైదరాబాద్:

ఒకప్పుడు ప్రేమించుకోవడం.. డేటింగ్‌.. పెళ్లి.. ఆ తర్వాత రొమాన్స్‌.. ఇవన్నీ జీవితంలో సహజమైన భాగాలు. కానీ ఇప్పుడు సంపన్న దేశాల్లో సీన్‌ మారిపోతోంది. ప్రేమించుకోవడానికి సమయం లేదు.. డేటింగ్‌కు ఆసక్తి లేదు.. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా చాలామందికి రావడం లేదు. చివరకు శృంగార జీవితంలోనూ ఆసక్తి తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఫోన్‌లో గంటల తరబడి గడపడానికి సమయం ఉంది.. సోషల్‌ మీడియాలో వందల మందితో పరిచయాలు ఉన్నాయి.. కానీ నిజ జీవితంలో ఒక్కరితో బంధం ఏర్పరచుకోవడానికి మాత్రం ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? అమెరికా.. బ్రిటన్‌ నుంచి యూరప్‌ వరకు యువతలో ఈ మార్పు ఎందుకు కనిపిస్తోంది? అసలు ఇది కోరికలు తగ్గిపోవడమా? లేక జీవితమే ఇంత బిజీ అయిపోయిందా? ఈ శృంగార సంక్షోభం వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం.

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితి
అమెరికా, జపాన్‌, బ్రిటన్‌, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో గతంతో పోలిస్తే ప్రజలు తక్కువగా శృంగారంలో పాల్గొంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. శృంగార అనుభవం లేని వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రేమ, డేటింగ్‌, పెళ్లి వంటి దశలు ఆలస్యమవుతున్నాయి. అందుకే పరిశోధకులు దీన్ని శృంగార మందగమనంగా అభివర్ణిస్తున్నారు. బ్రిటన్‌ సర్వే గణాంకాలు ఈ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి. 1990లో అక్కడి ప్రజలు నెలకు సగటున నాలుగు సార్లు శృంగారంలో పాల్గొనేవారు. 2010 నాటికి అది మూడుకు తగ్గింది. 2022–2024 మధ్య నెలకు రెండింటికి పడిపోయింది. మూడు దశాబ్దాల్లో ఈ సంఖ్య సగానికి తగ్గింది. ఇది పెద్దవారిలోనే కాదు, యువతలోనూ కనిపిస్తోంది. ఒకప్పుడు సాధారణమైన శృంగార జీవితం ఇప్పుడు అరుదుగా మారుతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది. చాలామంది యువత చదువులు, ఉద్యోగాలు, వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి పెడుతున్నారు. మరికొందరికి ఆసక్తి ఉన్నా అవకాశం, పరిస్థితులు కలిసి రావడం లేదు.

ప్రేమించడానికి మనుషులు లేరా?
యువతకు శృంగారంపై ఆసక్తి పూర్తిగా తగ్గిపోయిందా? పరిశోధకులు అలా చెప్పడం లేదు. కోరిక ఉన్నా సంబంధాలు ఏర్పరచుకునే అవకాశాలు తగ్గుతున్నాయి. ఒంటరిగా ఉంటున్న యువత సంఖ్య పెరిగింది. అమెరికాలో 18–29 ఏళ్ల వారిలో భాగస్వామితో కలిసి జీవిస్తున్న వారి శాతం దశాబ్దంలో పది నుంచి 32 శాతానికి చేరింది. భాగస్వామి లేకపోతే కోరికకు ఆచరణలో అవకాశం ఉండదు. అందుకే కోరిక తగ్గడం, సంబంధాలు తగ్గడం రెండింటినీ ఒకటిగా చూడకూడదు.

ఫోన్‌ చేతిలో.. మనిషి దూరంలో!
ఇప్పటి యువత ఎక్కువ సమయం ఫోన్‌, సోషల్ మీడియా, ఆటలు, సినిమాల మధ్య గడుపుతోంది. ఒకప్పుడు స్నేహితులతో బయటకు వెళ్లడం, ప్రత్యక్షంగా మాట్లాడటం ద్వారా సంబంధాలు ఏర్పడేవి. ఇప్పుడు చాలా పరిచయాలు తెరపైనే మొదలవుతున్నాయి. మెసేజెస్ పంపుతున్నా, నిజ జీవితంలో కలిసే సమయం తగ్గుతోంది. ఫోన్‌ వాడకం, ఒంటరితనం మధ్య సంబంధం ఉందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ఫోన్‌ వల్లే శృంగారం తగ్గిపోయిందని ఖచ్చితంగా చెప్పడానికి తగిన ఆధారాలు లేవు.

డేటింగ్‌ యాప్‌లు.. అవకాశమా? అడ్డంకా?
డేటింగ్‌ యాప్‌లు వచ్చాక పరిచయాలు పెరుగుతాయని భావించారు. కానీ కొన్ని సందర్భాల్లో అవే కొత్త సమస్యలకు కారణమవుతున్నాయి. కలిసే ముందే రూపం, ఉద్యోగం, ఆదాయం, ఎత్తు, జీవనశైలి పరిశీలించే అవకాశం ఉంది. ఒకరిని ఇష్టపడేలోపే మరొకరు కనిపించవచ్చు. సరైన వ్యక్తి కోసం వెతుకుతూనే సంబంధం ప్రారంభించకుండా ఉండిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఎక్కువ సెలక్షన్స్ నిర్ణయం తీసుకోవడాన్ని కష్టతరం చేస్తాయి. అందుకే డేటింగ్‌ యాప్‌ల పాత్రపై చర్చ కొనసాగుతోంది.

ఒత్తిడి.. పని.. బాధ్యతలు
ఉద్యోగ ఒత్తిడి, ఎక్కువ పని గంటలు, ఆర్థిక సమస్యలు, భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పుడు దంపతులకు ఒకరితో ఒకరు గడిపే సమయం తగ్గుతోంది. పిల్లల పెంపకం, ఇంటి పనులు, ఉద్యోగం కలిసి అలసటను పెంచుతున్నాయి. పని చేసి ఇంటికి వచ్చాక విశ్రాంతి తీసుకోవాలనుకోవడం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో శారీరక సాన్నిహిత్యానికి సమయం, మానసిక ప్రశాంతత రెండూ తగ్గిపోవచ్చు. ప్రేమ ఉన్నా ఒత్తిడి ఎక్కువైతే సంబంధంపై ప్రభావం పడుతుంది.

తెరపై వినోదం.. నిజ జీవితంలో దూరం?
శృంగారం తగ్గడానికి అశ్లీల వీడియోలు, స్వీయ సంతృప్తి కారణమని కొందరు భావిస్తున్నారు. వీటి వల్ల నిజ జీవిత సంబంధాలపై ఆసక్తి తగ్గుతుందనే వాదన ఉంది. కానీ ఈ వాదనకు బలమైన ఆధారాలు లేవు. ఇవి చూసేవారు, పొందేవారు ఇతరులతో తక్కువగా పాల్గొంటారని నిరూపించే ఆధారాలు లేవు. కొన్ని అధ్యయనాల్లో విరుద్ధమైన సంబంధాలూ కనిపించాయి. ఒకే అంశాన్ని కారణంగా చూపడం సరైంది కాదు. జీవనశైలి, మానసిక పరిస్థితి, సంబంధాల స్థితి, వ్యక్తిగత అభిరుచులు కలిసి ప్రభావం చూపుతాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *