- వామపక్ష యువతకు రాహుల్ గాలం
- ఢిల్లీ వీధుల్లో యువ నాయకత్వం
- భావజాలాల నడుమ భిన్న నాయకత్వం
సహనం వందే, న్యూఢిల్లీ:
ఢిల్లీలో జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రియాంక గాంధీతో కలిసి నడిచిన నేహా బోరా ఉదంతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల్లోని నేతలు ఆమెను చూసి ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. గతంలో జేఎన్ యూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఐసా తరఫున ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన షెహ్లా రషీద్ ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత ఆమె కమ్యూనిస్ట్ భావజాలానికి దూరమై మోదీ ప్రభుత్వంపై సానుకూల ధోరణి ప్రదర్శించడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కన్హయ్య కుమార్ నుంచి నేహా వరకు…
ఢిల్లీ నిరసనల్లో రాహుల్, ప్రియాంక గాంధీలతో కలిసి నడిచిన యువ నేత నేహా బోరా వైరల్గా మారారు. కన్హయ్య కుమార్ నుంచి నేహా వరకు కమ్యూనిస్ట్ నేపథ్యం ఉన్న నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారనేది చర్చ. కాంగ్రెస్ సొంతంగా ఉద్యమ నాయకులను ఎందుకు తయారుచేసుకోలేకపోతోందనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతోంది. సీపీఐ(ఎంఎల్) నాయకులు మాత్రం నేహా బోరాను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న నేతగా పేర్కొంటూ… తమ పార్టీ విజయంగా భావిస్తున్నారు.

కాంగ్రెస్లో కొరవడిన ఉద్యమస్ఫూర్తి…
సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం వల్ల కాంగ్రెస్కు ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించే అలవాటు తప్పిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆరేడు దశాబ్దాల పాటు పాలనకే పరిమితమవ్వడం వల్ల నిత్యం ప్రజాసమస్యలపై పోరాడి నాయకులను తయారుచేసే మేధోపరమైన శక్తి తగ్గింది. కాంగ్రెస్ను పూర్తిస్థాయి పోరాటాల బాట పట్టించేందుకు రాహుల్ గాంధీకి దాదాపు పద్నాలుగేళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. కేవలం అధికారం కోసం కాకుండా పోరాటమే అసలైన మార్గమని పార్టీ శ్రేణులకు నమ్మకం కలిగించాల్సి వచ్చింది.
కమ్యూనిస్ట్ నేతల భావజాల పరివర్తన
వామపక్ష ఉద్యమాల ద్వారా ఎదిగిన కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, నేహా బోరా వంటి నేతలు ప్రజా క్షేత్రంలో గుర్తింపు పొందారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీలను వీడి సంప్రదాయ కాంగ్రెస్ పార్టీలో చేరాక కన్హయ్య శైలి, మాట్లాడే విధానంలో మార్పు వచ్చిందని విమర్శలు ఉన్నాయి. ప్రధాన స్రవంతి ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి వచ్చినప్పుడు విస్తృత ప్రజామోదం పొందేందుకు భాష, శైలి మారడం సహజమైనప్పటికీ, ఆయనకు ఉన్న ప్రత్యేక పోరాట గుర్తింపు కొంతవరకు బలహీనపడిందనే భావన ఉంది.
పరిమిత వర్గ పోరాటాల పరిమితులు…
కమ్యూనిస్ట్ పార్టీలు కేవలం నిర్దిష్ట వర్గాల సమస్యలపైనే దృష్టి సారిస్తాయని, అయితే ప్రజాస్వామ్య రాజకీయాల్లో అందరినీ కలుపుపోయే ఏకాభిప్రాయం అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సామాజిక న్యాయం కోసం పోరాడే ఇతర ప్రాంతీయ పార్టీలలోనూ ఈ పరిమితి స్పష్టంగా కనిపిస్తోంది. సంప్రదాయ పార్టీల వలయంలో చిక్కుకున్నప్పుడు ఉద్యమ నేపథ్యం ఉన్న నేతలకు తగినంత రాజకీయ స్వేచ్ఛ లభించకపోవడం వల్ల వారి స్వరం మారుతోందనేది చారిత్రక నైజం.
అధికార రాజకీయాల్లో సిద్ధాంతాలకు సవాల్…
వామపక్ష విద్యార్థి సంఘాల నుండి వచ్చి కాంగ్రెస్ అగ్రనేతల సరసన నిలిచిన నేహా బోరా ప్రయాణం ఆసక్తికరమైన రాజకీయ పరిణామం. ఉద్యమాల గర్భంలో నుండి పుట్టుకొచ్చిన యువ గొంతుకలు అధికార రాజకీయాల నీడలో తమ మూల సిద్ధాంతాలను ఎంతవరకు నిలబెట్టుకోగలరనేది కాలమే నిర్ణయిస్తుంది. ప్రజాస్వామ్య రాజకీయాల వలయంలో చిక్కుకున్నప్పుడు వారి అసలైన పోరాట స్ఫూర్తి ఏమవుతుందనే ప్రశ్న మిగిలే ఉంది.