- తెలుగు రాష్ట్రాల తోటలపై దొంగ ప్రచారాలు
- ఫైటోఫ్తోరా ఫంగస్ ఉందంటూ దుష్ప్రచారం
- నకిలీ మందులు అమ్ముతున్న వ్యాపారులు
సహనం వందే, అశ్వారావుపేట:
కష్టపడి పంట పండించే రైతును ఆదుకోవడానికి వాన దేవుడు కరుణిస్తాడో లేదో తెలియదు గానీ, వాళ్ల భయాన్ని ఆసరాగా చేసుకుని జేబులు గుల్ల చేసే కేటుగాళ్లు మాత్రం ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఆయిల్ పామ్ తోటలకు అదిగో తెగులు వచ్చేసింది, ఇదిగో చెట్లు ఎండిపోతాయి అని వీడియోలు చూసి కంగారు పడుతున్నారా? అసలు మీ తోటల్లో నిజంగానే తెగులు ఉందా లేక అదంతా మిమ్మల్ని బురిడీ కొట్టించే డ్రామానా? అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం.
లక్షలాది ఎకరాల్లో సాగు…
తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం వేలాది ఎకరాల్లో వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 92,525 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 49,993 ఎకరాల్లో ఈ పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఆయిల్ పామ్ తోటల ద్వారా రైతులకు ఎకరాకు సగటున లక్ష రూపాయల నుండి లక్షా పాతిక వేల రూపాయల వరకు మంచి ఆదాయం లభిస్తోంది. ఎంతో పెట్టుబడి పెట్టి పెంచుకుంటున్న ఈ తోటలకు ఏదైనా తెగులు సోకితే ఎక్కడ నష్టం వస్తుందో అన్న భయం ప్రతీ రైతులోనూ సహజంగానే ఉంటుంది.

ఫైటోఫ్తోరా పాల్మివోరా ఫంగస్ పేరు చెప్పి…
రైతుల్లో ఉన్న ఇదే భయాన్ని, ఆందోళనను కొంతమంది కేటుగాళ్లు తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. ఫైటోఫ్తోరా పాల్మివోరా అనే ఫంగస్ తెగులు ఆయిల్ పామ్ తోటలను నాశనం చేస్తోందని పెద్ద ఎత్తున అసత్య ప్రచారాలు మొదలుపెట్టారు. ఈ ఫంగస్ సోకితే తోటలు మొత్తం పూర్తిగా ఎండిపోతాయని రైతులను తీవ్రంగా భయపెడుతున్నారు. ఇలా భయపెట్టిన వెంటనే తమ కంపెనీలకు చెందిన ఆర్గానిక్ ఉత్పత్తులు, మందులు వాడితేనే తోటలు కాపాడుకోగలరని ప్రచారం చేస్తున్నారు.
మోసపోతున్న రైతులు…
అసలు తోటల్లో నిజంగానే ఫంగస్ ఉందా లేదా అని నిర్ధారించుకోకుండానే ఈ వ్యాపారులు నకిలీ, అనవసరమైన మందులను రైతులకు అంటగడుతున్నారు. అమాయక రైతులు వారి మాటలు నిజమేనని నమ్మి వేలకు వేలు తగలేసి ఆ మందులను కొనుగోలు చేస్తూ మోసపోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ఆయిల్ పామ్ రైతులను లక్ష్యంగా చేసుకుని ఈ కేటుగాళ్లు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ఆన్ లైన్ లో కనిపించే ప్రచారాల వెనుక ఉన్న వ్యాపార స్వార్థాన్ని రైతులు గమనించలేకపోతున్నారు.
శాస్త్రవేత్తలను కలిసిన రైతులు…
ఈ ప్రచారాలపై అనుమానం వచ్చిన కొందరు ఖమ్మం జిల్లా రైతులు నేరుగా రంగంలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ ఏలూరు సమీపంలో ఉన్న అశ్వారావుపేట, పెదవేగిలోని భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలను కలసి పరిస్థితిని వివరించారు. తమ తోటల్లో నిజంగానే ఈ ఫంగస్ ఉందా లేదా అని స్వయంగా తనిఖీ చేసి నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు. అశ్వారావుపేట జోనల్ సొసైటీ ప్రతినిధులు కూడా ఈ విషయంపై పరిశోధనా సంస్థకు అధికారికంగా వినతిపత్రం సమర్పించారు.
మధుసూదన్ భరోసా…
రైతుల విజ్ఞప్తిపై స్పందించిన జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి ఎం.వి. మధుసూదన్… రైతులకు భరోసా ఇచ్చారు. తెలంగాణలో ఇప్పటివరకు ఎక్కడా ఈ ఫంగస్ తెగులు నమోదవలేదని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలను, పుకార్లను నమ్మి రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. రైతులు లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేసేందుకు త్వరలోనే శాస్త్రవేత్తల బృందం తోటలను సందర్శించి తనిఖీలు చేస్తుందని వెల్లడించారు.
అనవసర భయాలు వద్దు…
ఒకవేళ మీ ప్రాంతంలో ఎవరైనా వ్యక్తులు లేదా కంపెనీల ప్రతినిధులు వచ్చి లేని తెగుళ్ల పేరు చెప్పి మందులు అమ్మడానికి ప్రయత్నిస్తే జాగ్రత్తపడండి. వారి లైసెన్సులు, ప్రభుత్వం గుర్తించిన పత్రాలను సరిచూసుకోవడం చాలా ముఖ్యం. ఒక్కరి అప్రమత్తత ఊరందరి పంటను, డబ్బును కాపాడుతుంది.
ఆయిల్ పామ్ సాగు అనేది దీర్ఘకాలిక పంట, దీని ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. అలాంటి పంటపై అనవసర భయాలు పెంచుకుని రసాయనాలు వాడితే తోటల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఏదైనా సమస్య వస్తే అధికారిక వర్గాల ద్వారా సమాచారం తెలుసుకోవడమే సురక్షితమైన మార్గం.