కేసీఆర్ గుండెల్లో కవిత కల్లోలం – కూతురు కొత్త పార్టీతో గులాబీ బాస్ టెన్షన్

Kavitha KCR
  • ఆమెతో రాయబారానికి అధినేత ప్రయత్నాలు
  • కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీ గల్లంతేనా?
  • ఆమె పక్కన జనం కదిలితే ‘కారు’కు పంక్చరే
  • ఎలాగైనా ఆమెను వెనక్కి రప్పించేలా కృషి
  • కానీ ఇప్పటికే ఆలస్యమైందంటున్న నేతలు
  • నేడు జగిత్యాల మీటింగు… కవిత పైనే చర్చ

సహనం వందే, హైదరాబాద్:

రక్తం పంచుకు పుట్టిన బిడ్డ.. రాజకీయ కురువృద్ధుడికి సవాలు విసురుతోంది. గెలుపు గుర్రాలను అదిలించిన చేతులు ఇప్పుడు సొంత గూటికే ఎసరు పెడుతున్నాయి. గులాబీ తోటలో ముళ్ళ కంచె వెలుస్తోంది. నమ్మిన బంటులు నడిరోడ్డుపై నిలుస్తుంటే కేసీఆర్ కళ్ళలో కల్లోలం కనిపిస్తోంది. ఇది కేవలం రాజకీయం కాదు… ఒక తండ్రికి, కూతురికి మధ్య మొదలైన యుద్ధం.

జాగృతి జ్వాల… బీఆర్ఎస్ నిరాశ
తెలంగాణ జాగృతి ద్వారా కవిత నిర్మించిన బలమైన కేడర్ ఇప్పుడు బీఆర్ఎస్ పునాదులను కదిలిస్తోంది. పార్టీలో అసంతృప్త నేతలంతా కవిత నీడలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. గతం నుంచి ఆమె వెన్నంటి ఉన్న కీలక నాయకులు కొత్త పార్టీలో పదవుల కోసం వేచి చూస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి భారీగా వలసలు ఉంటాయన్న అంచనాలు కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలే అధికారం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న కారుకు.. కవిత పార్టీ ప్రకటన పెద్ద పంక్చర్‌లా మారింది.

Kavitha New Party

తండ్రి తపన… రాయబారానికి ఏర్పాట్లు
కేసీఆర్ ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇన్నాళ్లూ కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన సాధారణంగానే తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవడంతో ఆయనలో టెన్షన్ మొదలైంది. సొంత కూతురే తిరుగుబాటు చేయడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు చూశాక ఆయనలో ఆందోళన పెరిగింది. ఎలాగైనా ఆమెను వెనక్కి రప్పించాలని తన సన్నిహితులతో రాయబారాలు నడిపిస్తున్నారు. కొత్త పార్టీ పెడితే తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పని అయిపోయిందనే ముద్ర పడుతుందని ఆయన భయపడుతున్నారు. అధికార పార్టీకి ఇది అనవసరమైన బలాన్ని ఇస్తుందని గులాబీ అధినేత ఆవేదన చెందుతున్నారు.

కేటీఆర్‌ సీఎం… కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్
కవితను బుజ్జగించేందుకు కేసీఆర్ ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి.. కవితకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తామనే ప్రతిపాదన తెచ్చారు. ప్రభుత్వంలో హరీష్ రావు, కవిత ఇద్దరూ అత్యంత కీలకమైన మంత్రులుగా ఉండేలా హామీ ఇస్తానని ఆశ చూపుతున్నారు. ఒకే వేదికపైకి అందరినీ తీసుకొచ్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

మూడు ముక్కలాట.. పట్టుకోసం వేట
అయితే కేసీఆర్ వేస్తున్న లెక్కలు ఆచరణలో సాధ్యం కావని కవిత అనుచరులు నమ్ముతున్నారు. పార్టీలో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ మధ్య ఇప్పటికే ఆధిపత్య పోరు నడుస్తోంది. పట్టు కోసం ఈ ముగ్గురి మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం కవితకు ఆటంకంగా మారింది. కేటీఆర్ తర్వాత కవితకు ప్రాధాన్యం ఇస్తే హరీష్ రావు నుంచి సమస్యలు వస్తాయని ఆమె వర్గం భావిస్తోంది. ఈ మూడు ముక్కలాటలో తమ నాయకురాలికి న్యాయం జరగదని వారు వాదిస్తున్నారు.

అగమ్యగోచరం – అధినేత సంకటం
కేసీఆర్ ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కుటుంబంలో ఎవరినీ వదులుకోలేరు.. అలాగని కవితకు పూర్తిస్థాయి ప్రాధాన్యం ఇచ్చి అందరినీ మెప్పించలేరు. ఎవరిని నొప్పించాలో.. ఎవరిని బుజ్జగించాలో తెలియక ఆయన అయోమయంలో ఉన్నారు. అటు కూతురు మొండితనం.. ఇటు వారసుల మధ్య పోరు ఆయనను అగమ్యగోచర స్థితిలోకి నెట్టాయి. ఈ కుటుంబ కలహం చివరకు బీఆర్ఎస్ ఉనికినే ప్రమాదంలో పడేసేలా కనిపిస్తోంది.

జగిత్యాల వేదిక… చర్చల హోరు
నేడు జగిత్యాలలో కేసీఆర్ హాజరయ్యే మీటింగ్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సభకు వచ్చేవారంతా పరస్పరం కవిత పార్టీ పైనే చర్చించుకునే వేదికగా మారుతుంది. ఆమె గురించి తండ్రి పరోక్షంగా ఏమైనా మాట్లాడుతారా లేదా అన్న చర్చలు కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ సంక్షోభానికి పరిష్కారం దొరుకుతుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా ఇప్పటికే సమయం మించిపోయిందని నేతలు అంటున్నారు. కవిత పార్టీతో గులాబీ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందోనన్న భయం మాత్రం తండ్రి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *