- విద్యార్థుల గోడు… నాయకుల నాటకాలు
- పదవుల కోసం పాకులాట… ఉద్యమం హైజాక్
- వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆగ్రహం
- ప్రధాని ఇంటి వద్ద రాహుల్ నిరసనపై విమర్శ
- ఉద్యమానికి రాజకీయ పార్టీల మద్దతు తప్పా
సహనం వందే, న్యూఢిల్లీ:
నీట్ పేపర్ లీక్ కుంభకోణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంటే ఢిల్లీ వీధుల్లో మాత్రం రాజకీయ పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థుల ఉద్యటాన్ని హైజాక్ చేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. బాధితుల గొంతును నొక్కుతూ తమ పబ్బం గడుపుకుంటున్న తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి సంధించిన ప్రశ్నలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
నీట్ పేపర్ లీక్ ఉదంతం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను రోడ్డున పడేసింది. ఈ నేపథ్యంలో న్యాయం చేయాలని కోరుతూ ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఆమరణ దీక్షకు శ్రీకారం చుట్టారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడి నుంచే తన దీక్షను కొనసాగిస్తూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

కాంగ్రెస్ నిరసనల వెనుక డ్రామా
ఇలాంటి సున్నితమైన సమయంలో రాజకీయ పార్టీలు రంగప్రవేశం చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రధాని నివాసం ముట్టడికి యత్నించడం పెద్ద దుమారమే రేపింది. పార్లమెంటు వైపు వెళ్తున్న విద్యార్థుల మార్చ్‌ను కేంద్రం అడ్డుకుందనే పేరుతో కాంగ్రెస్ చేసిన ఈ హడావుడిపై సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నిరసనల్లో అసలు చిత్తశుద్ధే లోపించిందని ఆమె కుండబద్దలు కొట్టారు.
తెరవెనుక అవకాశవాదం
విద్యార్థులు నిజంగా జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన తొలి రోజుల్లో కాంగ్రెస్ నాయకులు వచ్చి ఎందుకు మద్దతు తెలపలేదని గీతాంజలి నిలదీశారు. కేవలం తమ రాజకీయ లబ్ధి కోసం మీడియా కెమెరాల ముందు హైలైట్ అవ్వడం కోసమే ఇప్పుడు ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆమె విమర్శించారు. ఉద్యమం ప్రారంభమైనప్పుడు కనిపించని ప్రతిపక్షాలు ఇప్పుడు తెరపైకి రావడం కేవలం అవకాశవాద రాజకీయమేనని స్పష్టమవుతోంది. సోనమ్ వాంగ్‌చుక్ పేరుప్రఖ్యాతులను రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నాయని ఆమె ఆరోపించారు.
యువతకు హెచ్చరిక
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూసే పార్టీలకు గీతాంజలి మాటలు చెంపపెట్టు లాంటివి. సామాన్య ప్రజలను నేటి యువతను ఇకపై మభ్యపెట్టడం ఎవరివల్ల కూడా సాధ్యం కాదని ఆమె హెచ్చరించారు. ఉద్యమంలో ఏ వ్యక్తికి లేదా ఏ పార్టీకి చిత్తశుద్ధి ఉందో లేదో ఇట్టే పసిగట్టే శక్తి యువతకు ఉందని ఆమె స్పష్టం చేశారు. స్వార్థ ఎజెండాలతో వచ్చే రాజకీయ నాయకులను యువతే తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని ఆమె పేర్కొన్నారు.
పార్లమెంటు వేదికగా చట్టాలు చేయాలి
ఈ నిరసనల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు యువత గట్టి సందేశం పంపిందని గీతాంజలి అభిప్రాయపడ్డారు. తమ దృష్టిలో దేశ అత్యున్నత వ్యవస్థ పార్లమెంటేనని… తమకు ఇప్పుడు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ప్రత్యేకంగా లేవని ఆమె స్పష్టం చేశారు. పేపర్ లీక్ లాంటి జాతీయ సమస్యపై కేవలం పార్లమెంటు మాత్రమే దృష్టి సారించి సరైన చట్టాలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎలాంటి రాజకీయ లక్ష్యాలు లేకుండా కేవలం విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేసే స్వచ్ఛమైన మనసులు మాత్రమే తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఉద్యమానికి మద్దతిస్తే తప్పా?
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ శ్రేణులు ప్రధాని నివాసం ముట్టడికి యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంటు వైపు వెళ్తున్న విద్యార్థుల మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి తరలించాల్సి వచ్చింది. కాగా వాంగ్ చుక్ భార్య గీతాంజలి చేసిన వ్యాఖ్యలపై కూడా పలువురు విమర్శలు చేస్తున్నారు. విద్యార్థుల ఉద్యమానికి ప్రతిపక్షాలు మద్దతు ఇస్తే తప్పేంటని ఆమెను నిలదీస్తున్నారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన చేస్తే ఆమెకు వచ్చిన నష్టం ఏంటని అంటున్నారు.