- బిట్ చాట్ యాప్ తో సర్కారుకు తలనొప్పి
- ఢిల్లీ విద్యార్థుల పోరాటంలో విరివిగా వాడకం
- దేశ భద్రతకు ముప్పుగా భావించి ఉక్కుపాదం
సహనం వందే, హైదరాబాద్:
ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్ అవసరం లేకుండా కేవలం బ్లూటూత్ సాయంతోనే మెసేజ్‌లు పంపుకునేలా వచ్చిన ఒక సరికొత్త యాప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నిఘా కళ్లకు చిక్కకుండా, ఎలాంటి రికార్డులు లేదా ట్రాకింగ్ లేకుండా రహస్యంగా సమాచారాన్ని మార్చుకోవడానికి అడ్డాగా మారుతున్న ఈ టెక్నాలజీపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
ఇంటర్నెట్ లేని కొత్త దారి
ఈ డిజిటల్ యుగంలో వాట్సాప్ లేదా టెలిగ్రామ్ వంటి యాప్‌లు పనిచేయాలంటే కచ్చితంగా మొబైల్ డేటా లేదా వైఫై ఉండాల్సిందే. కానీ ఏలాంటి ఇంటర్నెట్ లేదా సెల్యులార్ నెట్వర్క్ అవసరం లేకుండా కేవలం బ్లూటూత్ సాయంతోనే మెసేజ్‌లు పంపుకునేలా ఒక సరికొత్త టెక్నాలజీ మార్కెట్లోకి వచ్చింది. అదే బిట్ చాట్ యాప్. టెక్నాలజీ పరంగా ఇది చాలా అడ్వాన్స్డ్ అనిపించినా దీని వెనుక ఉన్న అసలు ప్రమాదం మాత్రం ఎవరికీ తొలుత అర్థం కాలేదు. ఇంటర్నెట్ లేకపోతే ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయని భయపడే ఈ రోజుల్లో, ఇంటర్నెట్ లేకపోయినా నేరాలకి పాల్పడే కొత్త దారులు వెతుకుతున్నారంటే టెక్నాలజీ ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు.
పీర్ టు పీర్ విధానం
సాధారణంగా మనం వాడే చాటింగ్ యాప్‌లన్నింటికీ ఒక సర్వర్ ఉంటుంది. మనం పంపే మెసేజ్ ఆ సర్వర్ ద్వారా అవతలి వారికి చేరుతుంది. కానీ ఈ బ్లూటూత్ ఆధారిత యాప్ పూర్తిగా పీర్-టు-పీర్ విధానంలో పనిచేస్తుంది. అంటే మధ్యలో ఏ సర్వర్ లేదా టవర్ సంబంధం లేకుండా మన ఫోన్లోని బ్లూటూత్ పరిధిలో ఉన్న మరో ఫోన్‌తో నేరుగా కనెక్ట్ అవుతుంది. ఒకరి నుంచి మరొకరికి చైన్ సిస్టమ్ లాగా ఈ మెసేజ్‌లు ముందుకు పాస్ అవుతాయి. చూడటానికి ఇది చాలా సింపుల్ టెక్నాలజీలా అనిపించినా దీనివల్ల జరిగే అనర్థాలు చాలా పెద్దవిగా ఉంటాయి.
భద్రతా దళాలకు తలనొప్పి
ఇలాంటి యాప్‌లు సాధారణ ప్రజల వాడకం కోసం కాకుండా అత్యవసర సమయాల్లో లేదా విపత్తులు వచ్చినప్పుడు కమ్యూనికేషన్ కోసం తయారు చేస్తుంటారు. కానీ కొందరు దీనిని వ్యూహాత్మకంగా తప్పుడు మార్గాలకు వాడుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ప్రభుత్వాల నిఘా కళ్లకు చిక్కకుండా, ఎలాంటి రికార్డులు లేదా ట్రాకింగ్ లేకుండా రహస్యంగా సమాచారాన్ని మార్చుకోవడానికి ఇవి అడ్డాగా మారుతున్నాయి. ఏజెన్సీల కంటికి కూడా చిక్కకుండా ఈ మెసేజ్‌లు ప్రయాణిస్తుండటంతో భద్రతా దళాలకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది.
గిట్‌హబ్ నుంచి తొలగింపు
ఢిల్లీలో జరిగిన విద్యార్థుల పోరాటాల సందర్భంగా ఈ యాప్ ను ఉపయోగించినట్లు కేంద్రం గుర్తించింది. దేశ భద్రతకు, శాంతిభద్రతలకు ఇది ముప్పుగా మారుతుందని నిపుణులు హెచ్చరించడంతో సంబంధిత టెక్ సంస్థలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ముఖ్యంగా డెవలపర్లు కోడింగ్ షేర్ చేసుకునే ప్రముఖ ప్లాట్‌ఫారమ్ అయిన గిట్‌హబ్ నుంచి ఈ యాప్‌ను తక్షణమే తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తూ గిట్‌హబ్ అధికారులు వెంటనే ఆ యాప్‌కు సంబంధించిన డేటాను, ఫైళ్లను తమ ప్లాట్‌ఫారమ్ నుంచి పూర్తిగా డిలీట్ చేశారు.