రేవంత్ రెడ్డికి ట్రంప్ థాంక్స్ – హైదరాబాద్ వీధికి తన పేరు పెట్టడంపై హర్షం

Modi Street in Hyderabad
  • ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ వెల్లడి
  • హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు

సహనం వందే, హైదరాబాద్:

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును హైదరాబాద్ నగరంలోని ఒక రహదారికి ఖరారు చేయడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అమెరికా కాన్సులేట్ పక్కనే ఉన్న ఈ రోడ్డును డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా మార్చడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఈ నిర్ణయం పట్ల ట్రంప్ స్వయంగా హర్షం వ్యక్తం చేస్తూ భారత్ కు కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్‌ గడ్డపై అమెరికా అధ్యక్షుడు
హైదరాబాద్‌ గడ్డపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు మార్మోగుతోంది. తన పేరుతో ఒక రహదారిని నామకరణం చేయడంపై ట్రంప్ ఉప్పొంగిపోయారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన వారిలో భారత్ లో ఇలాంటి గౌరవం పొందిన మొదటి వ్యక్తిని తానేనని ఆయన సగర్వంగా ప్రకటించారు. ఈ గౌరవం పట్ల ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అమెరికా రాయబారి సెర్గియో గోర్ రహదారి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన దృశ్యాలను ట్రంప్ చూశారు. ఆ ఫోటోలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఈ గౌరవం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ట్రంప్ బహిరంగంగానే వెల్లడించారు.

హైదరాబాద్ నగరం దౌత్య కేంద్రం
ఈ రహదారి కేవలం పేరు మాత్రమే కాదు… ఒక దౌత్య కేంద్రం. హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న తరుణంలో ఈ మార్పు జరిగింది. అమెరికా కాన్సులేట్ కార్యాలయంతో పాటు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ అమెరికా సంస్థలు ఈ రోడ్డుకు దగ్గరలోనే ఉన్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతం వాణిజ్య పరంగా మరింత కీలకం కానుంది.

ప్రభుత్వ వ్యూహాత్మక అడుగు
తెలంగాణ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా, భారత్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇటువంటి కార్యక్రమాలు హైదరాబాద్ నగరంపై పాజిటివ్ ప్రభావాన్ని చూపుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమం జరిగిన కొద్ది రోజులకే ట్రంప్ స్పందించడం, ఈ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ నగరం ఇప్పుడు అమెరికా దృష్టిలో ఒక కీలక కేంద్రంగా నిలుస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *