- ఆర్‌ఎస్‌ఎస్ ఆఫీసును ముట్టడించిన కాంగ్రెస్
- మల్లికార్జున ఖర్గేపై కుల వివక్షకు నిరసన
- రాహుల్‌పై కక్ష సాధింపు చర్యలకు ఖండన
సహనం వందే, న్యూఢిల్లీ:
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన తర్వాత జరిగిన శుద్ధి కార్యక్రమంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గళం విప్పారు. దీంతో బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంతో దేశ రాజధాని ఒక్కసారిగా భగ్గుమంది. ఈ అణచివేతకు వ్యతిరేకంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్… ఢిల్లీలోని కేశవ్ కుంజ్ వద్ద ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం వెలుపల నిరసన చేపట్టారు.
మనుధర్మ ప్రతుల దహనం…
కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ నేరుగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ముందే ఈ సాహసోపేతమైన ఆందోళనకు దిగి కేవలం నిరసన తెలపడానికే పరిమితం కాకుండా సమాజంలో వేళ్లూనుకుని ఉన్న కుల వివక్షకు మూలమైన మనుధర్మ శాస్త్రాన్ని మంటల్లో కలిపారు. మనుస్మృతి గ్రంథాన్ని దహనం చేశారు. దళిత అగ్రనేతను అవమానించి దానికి అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఉల్టా బాధితుల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ అనుసరిస్తున్న మనువాద సిద్ధాంతాలే దేశంలో ఈ రకమైన కుల అహంకారానికి ఆజ్యం పోస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పోలీసుల మోహరింపు… ఉదిత్ రాజ్ అరెస్ట్
ఢిల్లీలోని ఆర్‌ఎస్‌ఎస్ హెడ్‌క్వార్టర్స్ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అప్రమత్తమయ్యారు. మనుధర్మ ప్రతులు, ఆర్‌ఎస్‌ఎస్ యూనిఫామ్‌లను దహనం చేస్తూ ప్రభుత్వ వైఖరిని నిలదీస్తున్న ఉదిత్ రాజ్‌ను శాంతిభద్రతల పేరుతో పోలీసులు వెంటనే బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిరసన గళాన్ని అణచివేయడానికి పోలీసులు ఎన్ని అరెస్టులు చేసినా మనువాద సిద్ధాంతాలపై తమ పోరాటం ఆగదని కాంగ్రెస్ శ్రేణులు తేల్చిచెప్పాయి.
హల్ద్వానీ శుద్ధి వివాదం… అక్రమ కేసులు
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఖర్గే పర్యటించిన పవిత్ర వేదిక మలినం అయిందంటూ శుద్ధి పేరుతో అవమానించిన వైనం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ చర్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించి బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కఠిన ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయితే దోషులను శిక్షించాల్సిన ప్రభుత్వాలు, అసలు నిందితులను వదిలేసి ఆ అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపైనే రివర్స్ కేసులు బనాయించడం అత్యంత సిగ్గుచేటైన విషయమని విమర్శలు వెల్లువెత్తాయి.
కాంగ్రెస్ నిరసనల హోరు
ఈ దళిత వ్యతిరేక, కుల వివక్షా పూరిత ఘటనపై కాంగ్రెస్ పార్టీ దూకుడుగా స్పందించింది. ప్రియాంకా గాంధీ వాద్రా, అశోక్ గెహ్లాట్, పవన్ ఖేరా, కమల్ నాథ్ సహా దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ నేతలందరూ రాహుల్ గాంధీకి పూర్తి మద్దతుగా నిలిచి బీజేపీ సర్కార్ తీరును ఎండగట్టారు. రాజ్యాంగాన్ని, చట్టాలను తమ స్వార్థ రాజకీయాల కోసం
వక్రీకరిస్తున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కి నిరసనల హోరును పెంచాయి.