డబ్బులిస్తే సృజ’నో’త్మకత – రేటు కడితే రాత మారుతుందా?

Money
  • క్రియేటివిటీకి డబ్బులివ్వొద్దు
  • కేవలం మంచి జీతాలతో ఐడియాలు రావు
  • ఒత్తిడితో మెదడు బ్లాక్… నాణ్యత గల్లంతు
  • కార్పొరేట్ కంపెనీల్లో పాత పద్ధతులకు చెక్
  • ఫెయిల్యూర్ ని సెలబ్రేట్ చేసుకునే కల్చర్
  • హార్వర్డ్ బిజినెస్ పరిశోధన నివేదిక వెల్లడి

సహనం వందే, హైదరాబాద్:

ఉద్యోగుల సృజనాత్మకతను డబ్బులతో కొనలేమని హార్వర్డ్ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. భారీ నజరానాలు ప్రకటిస్తే నాణ్యమైన ఆలోచనలు రాకపోగా, కేవలం పాత ఐడియాల రాశులు మాత్రమే మిగులుతాయని తాజా అధ్యయనాలు నిరూపిస్తున్నాయి.

డబ్బుల ఆశ
ఆఫీసుల్లో ఉద్యోగుల క్రియేటివిటీని పెంచడానికి మేనేజ్మెంట్లు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. ఎవరైతే కొత్త ప్రాజెక్ట్ మీద అద్భుతమైన ఐడియా ఇస్తారో వాళ్లకు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ఇస్తామని లేదంటే వేతనాలు భారీగా పెంచుతామని నూనె రాస్తుంటారు. బయటి ప్రపంచానికి ఇది చూసేందుకు చాలా అద్భుతంగా అనిపించవచ్చు. కానీ లోపల జరిగే డ్రామా వేరేలా ఉంటుంది. ఎందుకంటే మనుషుల మెదడు డబ్బిచ్చినంత మాత్రాన ట్రిగ్గర్ అయిపోదు. ఎప్పుడైతే మీరు మీ సృజనాత్మకతను డబ్బుతో కొనుగోలు చేయాలని ఎప్పుడు చూస్తారో అప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఉద్యోగుల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది.

Money Vs Creativity

సైకాలజీ దెబ్బ
హార్వర్డ్ బిజినెస్ రివ్యూ పరిశోధనల ప్రకారం మనుషులకు క్రియేటివ్ వర్క్ కోసం రివార్డులు ప్రకటించినప్పుడు వాళ్ళు కేవలం డబ్బుల మీద మాత్రమే దృష్టి పెడతారు. అంటే ఎంత త్వరగా పని పూర్తి చేసి ఆ డబ్బులు కాజేద్దామా అని ఆలోచిస్తారు తప్ప ఆ పనిలో నాణ్యత ఎంత ఉంది అని పట్టించుకోరు. దీన్ని సైకాలజీలో ఎక్స్‌ట్రిన్సిక్ మోటివేషన్ అంటారు. అంటే మనసులో నుంచి వచ్చే ఇంట్రెస్ట్ పోయి కేవలం డబ్బుల కోసం మాత్రమే పనిచేసే యాంత్రిక పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఉద్యోగులు సృష్టించే కంటెంట్ లేదా ప్రొడక్ట్ నాణ్యత దెబ్బతింటుంది.

క్వాంటిటీ మోజు
ఇక్కడ మరొక ఆసక్తికరమైన కోణం ఏమిటంటే డబ్బులిచ్చినప్పుడు ఉద్యోగులు ఎంత క్రియేటివ్ ఐడియాలు ఇస్తున్నారనేదానికంటే ఎంత ఎక్కువ క్వాంటిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారనే దానిమీద ఎక్కువ ఫోకస్ పెడతారు. అంటే తక్కువ సమయంలో 10 పాత ఐడియాలనే కొద్దిగా మార్చి పదే పదే ఇస్తూ ఉంటారు. క్వాలిటీ ఐడియాల కన్నా నెంబర్స్ పెంచడమే వాళ్ళ ప్రధాన లక్ష్యంగా మారుతుంది. దీనివల్ల కంపెనీకి కొత్తదనం ఉన్న ఐడియాలు రాకపోగా కేవలం పాత చెత్త ఐడియాలు మాత్రమే మిగులుతాయి.

మానసిక ఒత్తిడి
అయితే దీనికి మరో మారురూపం కూడా ఉంది. కొన్నిసార్లు బోనస్‌లు లేదా రివార్డులు భారీగా ఉన్నప్పుడు ఉద్యోగులపై మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఆ డబ్బులు ఎలాగైనా గెలుచుకోవాలనే ఆరాటంలో మెదడు సరిగ్గా పనిచేయదు. ఒత్తిడి పెరిగినప్పుడు సృజనాత్మకత ఆటోమేటిక్‌గా అడుగంటిపోతుంది. సైంటిఫిక్ గా చెప్పాలంటే ప్రశాంతంగా ఉన్నప్పుడే మెదడు కొత్త ఆలోచనలను ఉత్పత్తి చేస్తుంది. కానీ టార్గెట్లు రివార్డుల ఒత్తిడిలో బ్రెయిన్ బ్లాక్ అయిపోయి రొటీన్ పనులకే పరిమితం అవుతుంది.

కొత్త పద్ధతులు
మరి అలాంటప్పుడు కంపెనీలు ఎలా ఆలోచించాలి? ఉద్యోగుల నుంచి క్రియేటివిటీని రాబట్టాలంటే డబ్బు ఒక్కటే మార్గమా? కాదని నిపుణులు చెబుతున్నారు. డబ్బు అనేది కేవలం బేసిక్ అవసరాలను తీరుస్తుంది కానీ అది ఎప్పుడూ నిజమైన సృజనాత్మకతను కొనలేదు. ఉద్యోగులకు తగినంత జీతం ఇచ్చి వాళ్ళ పనిని గుర్తించి ప్రశంసిస్తే వచ్చే ఫలితాలు వేరుగా ఉంటాయి. కేవలం ప్రతి పనికి ప్రైజులు పెడితే రాను రాను ఆ ప్రైజ్ లేకపోతే అసలు ఆ పనే చేయననే స్టేజ్ కి ఉద్యోగులు వచ్చేస్తారు. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి ఆధునిక కంపెనీలు ఇప్పుడు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నాయి. కేవలం రివార్డుల మీద ఆధారపడకుండా వర్క్ కల్చర్ మార్చడం మీద దృష్టి పెడుతున్నాయి.

స్వేచ్ఛే మార్గం
ఉద్యోగులకు స్వతంత్రత ఇవ్వడం… వాళ్ళ ఆలోచనలను గౌరవించడం… తప్పులు చేసినా నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వడం వంటివి చేయడం వల్ల క్రియేటివిటీ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. మనుషులకు ఎప్పుడైతే భయం పోయి స్వేచ్ఛ దొరుకుతుందో అప్పుడే అద్భుతమైన ఐడియాలు బయటికి వస్తాయి. అందుకే కార్పొరేట్ దిగ్గజాలు ఇప్పుడు పేమెంట్ స్ట్రక్చర్స్ ని రీడిజైన్ చేస్తున్నాయి. కేవలం అవుట్‌పుట్ మీద కాకుండా లెర్నింగ్ ప్రాసెస్ మీద కొత్త ప్రయోగాల మీద ఫోకస్ పెడుతున్నాయి. ఎవరైనా కొత్త ప్రయోగం చేసి ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూర్ ని కూడా సెలబ్రేట్ చేసుకునే వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *