- జైపూర్ పరీక్షా కేంద్రం నిర్లక్ష్యానికి పరాకాష్ట
- పదిసార్లు రీ లాగిన్ అయిన వైద్య విద్యార్థులు
- పరీక్ష రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
- ఎఫెక్ట్ అయిన విద్యార్థులకు 5న మళ్లీ పరీక్ష
- విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారా?
సహనం వందే, రాజస్థాన్:
దేశంలోని ప్రతిష్టాత్మకమైన మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలో తీవ్ర గందరగోళం చెలరేగింది. జైపూర్ కేంద్రంలో పదేపదే పవర్ కట్ కావడంతో కంప్యూటర్ సిస్టమ్స్ హ్యాంగ్ అయ్యాయి. లక్షలాది మంది భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడంతో అభ్యర్థులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. ఎన్బీఈఎంఎస్ వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నీట్ పీజీ పరీక్షలో సాంకేతిక వైఫల్యాలు…
నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశాన్ని కుదిపేసిన సంఘటన మరువకముందే… ఇప్పుడు నీట్ పీజీ పరీక్ష గందరగోళం నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా నీట్-పీజీ-2026 పరీక్ష ఆదివారం అనేక ప్రాంతాల్లో ప్రారంభమైంది. కానీ రాజస్థాన్‌లోని జైపూర్ నగరంలో ఒక పరీక్షా కేంద్రంలో మాత్రం పరిస్థితి పూర్తిగా అన్ కంట్రోల్ అయిపోయింది. పరీక్ష రాద్దామని సెంటర్‌కు వెళ్లిన అభ్యర్థులకు అక్కడ ఎదురైన అనుభవం పీడకలలా మారింది. పరీక్ష మొదలైన క్షణం నుంచే సాంకేతిక లోపాలు అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేయడం మొదలుపెట్టాయి.

విద్యుత్ సరఫరాలో అంతరాయాలు…
పరీక్ష జరుగుతున్న సమయంలోనే ఆ కేంద్రంలో విద్యుత్ సరఫరా అనేకసార్లు నిలిచిపోయింది. ఒకసారి పోయి వస్తే ఏదో అనుకోవచ్చు. కానీ ప్రతీ 10-15 నిమిషాలకు ఒకసారి కరెంటు పోతూనే ఉంది. దీంతో కంప్యూటర్ సిస్టమ్స్ అన్నీ ఒక్కసారిగా షట్ డౌన్ అయిపోవడం విద్యార్థులను టెన్షన్ కు గురిచేసింది. ప్రశ్నలు చదువుకుంటున్న సమయంలో సిస్టమ్ హ్యాంగ్ అవ్వడం లాంటి సమస్యలు రిపీట్ అయ్యాయి.
పదేపదే రీ-లాగిన్ సమస్యలు…
పరీక్షా కేంద్రంలో ఉన్న సిబ్బందిని సాయం కోరితే వారి నుంచి సరైన స్పందన లభించలేదని విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన నిపుణులు అక్కడ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారట. ఒకే పరీక్షను దాదాపు 10 సార్లు రీ-లాగిన్ చేయాల్సి వచ్చిందని, దీనివల్ల తమ అమూల్యమైన సమయం అంతా వృథా అయిపోయిందని అభ్యర్థులు వాపోయారు. సిస్టమ్స్ లాగిన్ అవ్వడానికి పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రతిసారీ ఐడీ పాస్‌వర్డ్ కొట్టి లాగిన్ అయ్యేసరికి పదే పదే సర్వర్ ఎర్రర్లు రావడం ప్రారంభమయ్యాయి.
పరీక్షా కేంద్రం వద్ద నిరసనలు…
ఇంత పెద్ద జాతీయ స్థాయి పరీక్షకు కనీసం జనరేటర్ సౌకర్యాలు కూడా లేకపోవడం చూస్తుంటే వ్యవస్థ ఎంత దారుణంగా విఫలమైందో అర్థమవుతుంది. గంటల తరబడి ఈ హైడ్రామా కొనసాగడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సహనం కోల్పోయారు. పరీక్ష హాల్ నుంచి బయటకు వచ్చి సెంటర్ గేట్ల ఎదుట బైఠాయించి పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
విద్యార్థుల ఆవేదన…
విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఇలాంటి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. తమ భవిష్యత్తును అగమ్యగోచరం చేస్తున్న అధికారుల తీరుపై సోషల్ మీడియా వేదికగా కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. లక్షల రూపాయలు ఫీజులు కట్టి, ఏళ్ల తరబడి కష్టపడితే చివరికి ఇలాంటి గందరగోళమే మిగులుతుందా అంటూ విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో ఆ కేంద్రంలో పరీక్ష రాసిన వారందరికీ మళ్లీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
సెప్టెంబర్ 5న రీ-ఎగ్జామ్…
ఎఫెక్ట్ అయిన అభ్యర్థులందరికీ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 5వ తేదీన రీ-ఎగ్జామ్ ఉంటుందని మెడికల్ పరీక్షల బోర్డు స్పష్టం చేసింది. అయితే మళ్లీ చదువుకుని పరీక్ష రాయడం అనేది విద్యార్థులకు అదనపు భారంగా మారుతోంది. ఈ లోపాలకు బాధ్యులైన వారిపై ఇప్పటికైనా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి. ఇలాంటి సాంకేతిక లోపాలు, నిర్లక్ష్యం వల్ల యువత ప్రతిభ అణగారిపోతోంది. డిజిటల్ ఇండియా అని గొప్పలు చెప్పుకుంటున్న కాలంలో కనీసం కరెంట్ సరఫరాను కూడా మేనేజ్ చేయలేకపోవడం మన వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతోంది.