మగాడి కంపు… మగువకు ఇంపు – అబ్బాయిల చెమటకు అమ్మాయిల ఫిదా

Men Sweating Smell
  • చెమట గబ్బులో చిగురుస్తున్న టీనేజ్ ప్రేమలు
  • మురికి సంస్కృతికి అలవాటుపడ్డ నేటితరం
  • స్నానం చేయట్లే… ముఖం కడగట్లే… హవ్వా!
  • మూత్రం తాగే వెర్రి వెంగళప్పలు ఎందరో

సహనం వందే, హైదరాబాద్:

స్నానం చేయకుండా, ఒళ్లంతా చెమట కంపు కొడుతుంటేనే అమ్మాయిలు ఫిదా అవుతారనే సరికొత్త పిచ్చి నేటి సోషల్ మీడియాలో కుర్రకారును ముంచెత్తుతోంది. వ్యక్తిగత పరిశుభ్రతను పూర్తిగా గాలికి వదిలేసి, సహజ వాసనల పేరుతో వికృత ప్రయోగాలు చేస్తున్న ఈ అనాగరిక పోకడలు ఇప్పుడు యావత్ సమాజాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. నేటి తరం యువత వికృత పోకడల బండారం ఇది.

చెమట వాసనే పెట్టుబడి…
టిక్‌టాక్ పుణ్యమా అని ఇప్పుడు నెట్టింట ఫెరోమోన్ మాక్సింగ్ అనే ఒక అసహ్యకరమైన ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది. అందంగా కనిపించడం కోసం లుక్స్ మాక్సింగ్ చేసే కుర్రకారు, ఇప్పుడు ఏకంగా తమ శరీర మురికి వాసనతోనే అమ్మాయిలను పడేయొచ్చని నమ్ముతున్నారు. స్నానం చేయడం మానేసి, రోజుల తరబడి పేరుకుపోయిన చెమట వాసనే తమకు గొప్ప ఆకర్షణను తెచ్చిపెడుతుందని గుడ్డిగా నమ్ముతున్నారు. ఈ పిచ్చి ఎంతవరకు వెళ్లిందంటే… కొందరు టీనేజర్లు అసలు మొహం కడుక్కోవడానికి కూడా ఇష్టపడటం లేదు. రోజులు తరబడి అవే చెమట పట్టిన బట్టలు వేసుకుని తిరుగుతున్నారు.

Men Sweat Smell

మూత్రం తాగే వెర్రి వెంగళప్పలు…
శరీరంలోని మాలిన్యాలన్నీ చెమట రూపంలో బయటకు పోవాలనే వెర్రి ఆలోచనతో కొందరైతే ఏకంగా తమ మూత్రాన్ని తామే తాగుతున్నట్లు ప్రముఖ వెబ్‌సైట్లు బట్టబయలు చేశాయి. చూడటానికి వినడానికి అసహ్యంగా ఉన్నా ఇదొక గొప్ప ఫ్యాషన్ అని వీరు సోషల్ మీడియాలో డబ్బాలు కొట్టుకుంటున్నారు. అసలు ఈ వికృత చేష్టల వెనుక ఉన్న శాస్త్రీయ మూలాలు ఏమిటో వెతికితే దిమ్మతిరిగిపోతుంది. జంతువులు, పురుగులు తమ సహజ పద్ధతుల ద్వారా ఒకదానికొకటి సంకేతాలు పంపుకుంటాయి. వీటినే ఫెరోమోన్స్ అంటారు. ప్రకృతిలో ఇవి కొన్ని జీవులకు వర్తించవచ్చు కానీ మనుషులలో కూడా ఇవే పద్ధతిలో శృంగార ఆకర్షణ పనిచేస్తుందా లేదా అనేదానిపై ఇప్పటికీ ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు.

పాత ప్రయోగాల భ్రమలు…
ఈ వాదన వెనుక కొందరు 1995 నాటి ఒక పాత స్వెటీ టీ షర్ట్ ప్రయోగాన్ని ఉదాహరణగా చూపుతుంటారు. పురుషులు రెండు రోజులు వేసుకున్న చెమట కొట్టే షర్టుల వాసనను మహిళలు పీల్చారని, ఆ మురికి వాసన వారికి నచ్చిందని ఆ రోజుల్లో చెప్పారు. కానీ ఆ ప్రయోగం కేవలం కొద్దిమందిపై మాత్రమే జరిగింది తప్పా మనుషులందరికీ అదే సూత్రం వర్తిస్తుందని ఏ శాస్త్రవేత్త కూడా ఎప్పుడూ అనలేదు. 2020లో జరిగిన మరో విశ్లేషణలో అయితే శరీర వాసన ఆధారంగా మనుషులు లవర్సును ఎంచుకుంటారనే నిజాన్ని ఏ పరిశోధన కూడా నిరూపించలేకపోయింది.

మురికి సంస్కృతికి విపరీతమైన ప్రచారం…
ఎలాంటి ఆధారాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ మురికి సంస్కృతికి విపరీతమైన ప్రచారం దక్కుతోంది. వ్యూస్ కోసం, లైకుల కోసం ఇన్‌ఫ్లుయెన్సర్లు చెబుతున్న ఈ మూర్ఖపు సలహాలను కుర్రకారు గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. శుభ్రతను పూర్తిగా గాలికి వదిలేసి, సమాజంలో నలుగురిలో తిరగడానికి కూడా సిగ్గుపడని స్థాయికి దిగజారిపోతున్నారు. స్నానం చేయడం, సబ్బు రాసుకోవడం, పళ్లు తోముకోవడం చేతకానివాళ్ళు ఇలాంటి చెత్త కబుర్లు చెబుతారంటూ ఎక్స్ వేదికగా నెటిజెన్లు దుమ్మెత్తిపోశారు.

వాంతి తెప్పించే కంపు
పక్కవాడు భరించలేని కంపుతో తిరిగితే ప్రేమ పుట్టడం దేవుడెరుగు వాంతి చేసుకోవడం ఖాయమని చాలా మంది ఘాటుగా విమర్శించారు. నిజానికి ఈ కాలపు యువత సోషల్ మీడియా మాయలో పడి తమ విచక్షణా జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోతున్నారు. ఇతరుల దృష్టిలో తాము విభిన్నంగా కనిపించాలనే ఆరాటంలో ఇలాంటి అసహ్యకరమైన పద్ధతులను ఎంచుకుంటున్నారు. ఇది కేవలం వారి వ్యక్తిగత ఆరోగ్యాన్నే కాకుండా వారి చుట్టూ ఉన్నవారికి కూడా చికాకు కలిగిస్తోంది.

దిగజారుతున్న నాగరికత
ఒంటి కంపుతో తిరిగితే ఆధునిక యువకుడు అయిపోతామనుకోవడం భ్రమే అవుతుంది. ఇది ఆకర్షణ కాదు, కేవలం సమాజంలో పరువు తీసే ఒక పిచ్చి ప్రయోగం మాత్రమే. సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి పనికిమాలిన ట్రెండ్స్ రోజుకో రూపంలో పుట్టుకొస్తూనే ఉంటాయి. కనీస శుభ్రత కూడా పాటించకుండా బతికే బతుకులకు ఎలాంటి విలువ ఉండదు. మనిషికి కావాల్సింది మంచి మనసు, పరిశుభ్రమైన వ్యక్తిత్వం అంతే కానీ ఇలాంటి మురికి వాసనలు కాదనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *