జేఎన్టీయూ రీసెర్చ్ స్కామ్? – సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో షాకింగ్ నిజాలు

JNTU Research Scam
  • కేంద్ర ప్రభుత్వ నిధులపై ఆడిట్ అభ్యంతరాలు
  • పరిశోధన నిధుల నిబంధనలకు తూట్లు… ఆడిట్ రట్టు
  • టెండర్లు లేకుండానే భారీ కొనుగోళ్లు… పత్రాలు గల్లంతు
  • ప్రభుత్వ ఆడిటర్ ఉండగా ప్రైవేట్ ఆడిటర్లు ఎందుకు?
  • యూనివర్సిటీ అధ్యాపకుల ఖర్చులపై ఆడిట్ కొరడా
  • గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సర్కార్ ఆరా

సహనం వందే, హైదరాబాద్:

పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వాలంటే విశ్వవిద్యాలయాలకు నిధులు అవసరం. కొత్త పరికరాలు కొనాలి. ప్రయోగాలు నిర్వహించాలి. విద్యార్థులు, అధ్యాపకులు కొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నాయి. అయితే ఆ నిధుల ఖర్చుకు సంబంధించిన లెక్కలు మాత్రం పక్కాగా ఉండాలి. ప్రతి కొనుగోలుకు ఆధారాలు ఉండాలి. కానీ జేఎన్టీయూలో పరిశోధన నిధుల వినియోగంపై రాష్ట్ర ఆడిట్ శాఖ లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

సీబీఐ ఫిర్యాదుతో వెలుగులోకి నిధుల దుర్వినియోగం…
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) 2020 మార్చి 13న రీసెర్చ్ ప్రమోషన్ స్కీమ్ కింద జేఎన్టీయూకు తొలి విడతగా 22 లక్షల రూపాయలు విడుదల చేసింది. ఇందులో పరికరాల కొనుగోలుకు 19 లక్షలు, మిగిలిన మొత్తాన్ని ఇతర ప్రాజెక్టు అవసరాలకు వాడుకోవాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. అయితే, కె.పి. భాగ్య వెంకట కుమార్ సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నిధుల వినియోగంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. దీనిపై 2024 అక్టోబర్ 30న రాష్ట్ర ఆడిట్ శాఖ యూనివర్సిటీ అధికారులకు లేఖ రాస్తూ, నిధుల ఖర్చుకు సంబంధించి పక్కా ఆధారాలు లేవని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Audit Report on  JNTU Research Scam

టెండర్లు లేకుండానే పరికరాల కొనుగోలు
ఈ వ్యవహారంలో ప్రధానంగా 19 లక్షల రూపాయలతో చేపట్టిన ల్యాబ్ పరికరాల కొనుగోలుపై ఆడిట్ అధికారులు తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. 2020 ఆగస్టు 27 నాటి ఉత్తర్వుల కాపీలతో పాటు టెండర్ నోటిఫికేషన్ ప్రతులు, కొటేషన్ల వివరాలు సమర్పించాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం టెండర్లు పిలవకుండానే ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు జరిపారనే ఆరోపణలు ఉన్నాయి. అసలు కొనుగోలు చేసిన పరికరాలు వర్సిటీలో ఉన్నాయో లేదో కూడా స్పష్టత లేకపోవడంతో, ప్రధాన పరిశోధకుడు, విభాగాధిపతి, ప్రిన్సిపాల్ సంతకాలతో కూడిన స్టాక్ రిజిస్టర్ ఆధారాలను చూపించాలని ఆడిట్ శాఖ తేల్చిచెప్పింది.

పన్నుల చెల్లింపుల్లో తేడాలు…
పరికరాలకు సంబంధించిన 19 లక్షల రూపాయల ఇన్‌వాయిస్‌పై ఐదు శాతం జీఎస్టీ చెల్లించినట్లు చూపిన అధికారులు, నిబంధనల ప్రకారం మినహాయించాల్సిన రెండు శాతం టీడీఎస్‌ను ఎందుకు కట్ చేయలేదో వివరించలేకపోయారు. మరోవైపు, మహాదేవ్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి 86 వేల రూపాయల విలువైన కెమికల్స్ కొనుగోలులోనూ అవకతవకలు బయటపడ్డాయి. సదరు సంస్థ టీడీఎస్ చెల్లించినట్లు లేఖ ఇచ్చినప్పటికీ, ఆ మొత్తం ప్రభుత్వ ఖాతాలో జమ అయినట్లు చలాన్లు సమర్పించలేదు. పైగా ఆ రసాయనాలను స్టాక్ రిజిస్టర్‌లో నమోదు చేయకపోవడంతో పాటు, 8 వేల రూపాయల ప్రాసెసింగ్, ఈఎండీ ఫీజులకు సంబంధించిన అనుమతి ఉత్తర్వులను కూడా అధికారులు చూపించలేకపోయారు.

ప్రభుత్వ ఆడిటర్ ఉండగా ప్రైవేట్ ఆడిటర్లు ఎందుకు?
ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం పరిశోధన నిధులను సాధారణ ఖాతాలతో కలపకుండా ప్రత్యేకంగా నిర్వహించాలి. కొనుగోలు చేసిన ఆస్తులను రిజిస్టర్‌లో నమోదు చేస్తూ జీఎఫ్‌ఆర్‌-19 విధానాన్ని పాటించాలి. ఆర్థిక సంవత్సరం ముగిసిన నెల రోజుల్లోగా యుటిలైజేషన్ సర్టిఫికెట్లు, ప్రాజెక్టు పూర్తయిన రెండు నెలల్లోగా తుది నివేదికలు ఇవ్వాలనే నిబంధనలను పూర్తిగా విస్మరించారు. క్యాంపస్‌లోనే ప్రభుత్వ ఆడిటర్ అందుబాటులో ఉన్నప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ చార్టర్డ్ అకౌంటెంట్లతో లెక్కలను ధ్రువీకరించి పంపడంపై ఆడిట్ శాఖ మండిపడింది. అంతేకాదు, 2020-24 మధ్య నిధులు పొందిన పలువురు అధ్యాపకులు గడువు ముగిసినా ఇప్పటికీ ఖర్చుల వివరాలు సమర్పించలేదని నివేదిక స్పష్టం చేసింది.

అధ్యాపకులపై సమీక్షకు ఆదేశం..
ఖర్చుల వివరాలు ఇవ్వని అధ్యాపకులందరినీ అప్రమత్తం చేసి తక్షణమే పత్రాలు సేకరించాలని, అన్ని పరిశోధన ప్రాజెక్టులపై అంతర్గత సమీక్ష నిర్వహించాలని ఆడిట్ శాఖ సూచించింది. ఆడిట్ అడిగిన ప్రతి పత్రాన్ని, చెల్లింపు ఆధారాలను సమర్పించాల్సిన బాధ్యత పూర్తిగా జేఎన్టీయూ అధికారులపైనే ఉంది. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ నిధుల గోల్‌మాల్ విద్యార్థి లోకాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గల్లంతైన పత్రాలను సేకరించి అధికారులు లెక్కలను సరిచేస్తారా, లేక దోషులను రక్షించే ప్రయత్నం చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.

గత ప్రభుత్వ అక్రమాలపై సర్కార్ ఆరా
గత ప్రభుత్వ హయాంలో జేఎన్‌టీయూలో చోటుచేసుకున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై ఏకంగా సీబీఐకి ఫిర్యాదు అందడంతో రాష్ట్ర విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిధిలోనే ఉండటంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వం మరింత లోతుగా విచారణ జరిపించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *