జేఎన్‌టీయూలో 52 కోట్లు గల్లంతు – సీబీఐకి అందిన ఫిర్యాదులో సంచలన విషయాలు

JNTU Rs.52 Crores Scam
  • కోట్లాది రూపాయల ప్రజాధనం ఎవరి జేబుల్లోకి వెళ్లింది?
  • తెలంగాణ ఆడిట్ తనిఖీల్లో లెక్క తేలని కోట్ల నిధులు
  • రికార్డులు లేకుండానే జవాబు పత్రాల రవాణా
  • గత ప్రభుత్వంలో అధికారుల పాత్రపై అనుమానాలు

సహనం వందే, హైదరాబాద్:

హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో అసలేం జరుగుతోంది? దాదాపు 52 కోట్ల రూపాయల లెక్కలు ఎందుకు తేలడం లేదు? ఈ నిధుల ఖర్చుపై అనుమానాలకు కారణమేంటి? ఇటీవల సీబీఐకి అందిన ఫిర్యాదులో ఆర్థిక లావాదేవీల నుంచి నియామకాలు, పదోన్నతుల వరకు పలు అంశాలపై కె.పి. భాగ్య వెంకట కుమార్ ఆరోపణలు చేశారు. మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర ఆడిట్ శాఖ నిర్వహించిన తనిఖీల్లోనూ కోట్ల రూపాయల ఖర్చులకు సరైన ఆధారాలు లేవని వెల్లడైంది. పదేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారాల్లో ఏం జరిగింది? ఆడిట్ నివేదికలు ఏం చెబుతున్నాయి? సీబీఐకి అందిన ఫిర్యాదులోని ఇతర అంశాలేంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

రూ. 52 కోట్లు ఎక్కడ?
జేఎన్‌టీయూలో ఆర్థిక నిర్వహణపై రాష్ట్ర ఆడిట్ శాఖ నివేదికలతో తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కేవలం మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రూ. 52 కోట్ల మేర ఆడిట్ అభ్యంతరాలు పరిష్కారం కాలేదు. సీబీఐకి అందిన ఫిర్యాదులోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఖర్చు చేసినట్లు చూపిన నిధులకు సంబంధించిన ఓచర్లు, ఇతర రికార్డులు అందుబాటులో లేవని ఆరోపించారు. ఆ నిధులను ఎక్కడ, ఎందుకు ఖర్చు చేశారో నిర్ధారించే ఆధారాలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ.46.56 కోట్ల మేర అభ్యంతరాలు పెండింగ్‌లో ఉండగా, 2022–23లో మరో రూ.46.33 కోట్ల అభ్యంతరాలు పరిష్కారం కాలేదు. అదేవిధంగా, 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.52 కోట్లకు సంబంధించిన పెండింగ్ అభ్యంతరాలను కూడా ఆడిట్ తనిఖీల్లో గుర్తించింది. ఇలా వరుసగా మూడేళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో భారీ మొత్తాలకు సరైన లెక్కలు, ఆధారాలు చూపించాల్సి ఉందని ఆడిట్ నివేదిక స్పష్టం చేసింది. అంటే మొత్తం రూ. 52 కోట్లపై లెక్కలు తేలాల్సి ఉంది. ఇంత భారీ మొత్తానికి ఆధారాలు చూపించకపోవడానికి కారణమేంటి? ఈ నిధులు అభివృద్ధి పనులకే ఖర్చయ్యాయా, లేక దుర్వినియోగం జరిగిందా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది. ఖర్చుల వివరాలు సమర్పించి, ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించాల్సిన బాధ్యత అప్పటి ఉన్నతాధికారులపై ఉంది.

JNTU Scam of Rs.52 Crores
JNTUlo Rs.52 Crores Scam

రాబడుల కంటే అభ్యంతరాల మొత్తం అధికం
2019–20 ఆర్థిక సంవత్సరంలో పరీక్షల విభాగం ద్వారా వచ్చిన ఆదాయం రూ.23 కోట్లు. 2022–23లోనూ ఇదే స్థాయిలో ఆదాయం నమోదైంది. అదేవిధంగా, 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 30 కోట్ల ఆదాయం నమోదైంది. ఇలా వరుసగా మూడేళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో భారీ మొత్తాలకు సరైన లెక్కలు, ఆధారాలు చూపించాల్సి ఉందని ఆడిట్ నివేదిక స్పష్టం చేసింది. అంటే ఈ మూడు సంవత్సరాల్లో కలిపి వచ్చిన మొత్తం ఆదాయం రూ. 76 కోట్లు. అయితే ఆడిట్‌లో పరిష్కారం కాని అభ్యంతరాల మొత్తం రూ. 52 కోట్లు. అయితే ఈ అభ్యంతరాలన్నీ ఆ మూడేళ్లలో జరిగిన లావాదేవీలకే సంబంధించినవి మాత్రమే కావు. గత సంవత్సరాల నుంచి పరిష్కారం కాని అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఖర్చులకు బిల్లులు లేకపోవడం, పూర్తి రికార్డులు సమర్పించకపోవడం, కొనుగోళ్లకు ఆధారాలు చూపకపోవడం వంటి అభ్యంతరాలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ప్రతి ఏడాది కొత్త అభ్యంతరాలు చేరడంతో ఈ మొత్తం పెరుగుతూ వచ్చింది. ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ఇంత పెద్ద మొత్తంలో అభ్యంతరాలు పరిష్కారం కాకపోవడంపై అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది.

రికార్డుల్లేకుండానే జవాబు పత్రాల రవాణా!
ఆర్థిక అభ్యంతరాలతోపాటు రోజువారీ ఖర్చుల్లోనూ నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు ఆడిట్‌ గుర్తించింది. పరీక్షలకు సంబంధించిన 4,515 జవాబు పత్రాల సంచులను గోడౌన్‌కు తరలించేందుకు రూ.6.49 లక్షలు ఖర్చు చేశారు. ఒక్కో సంచికి రూ.125 నుంచి రూ.130 వరకు చెల్లింపులు జరిపారు. అయితే ఈ రవాణాకు ముందస్తు అనుమతి తీసుకోలేదని, సంబంధిత విభాగాధికారుల ఆమోదం కూడా లేదని ఆడిట్‌ పేర్కొంది. అంతేకాదు, రవాణాకు సంబంధించిన డిస్పాచ్ రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్ల నమోదు వివరాలు, డిస్పాచ్ మెమోలు కూడా అందుబాటులో లేవు. దీంతో ఎన్ని సంచులు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారు? వాటిని ఎవరు స్వీకరించారు? అన్నది నిర్ధారించే రికార్డులు లేవనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరీక్షల జవాబు పత్రాల వంటి కీలకమైన పత్రాల తరలింపునకు సంబంధించిన వివరాలే నమోదు కాకపోవడం విశ్వవిద్యాలయ పర్యవేక్షణ వ్యవస్థపై ఆందోళన కలిగిస్తోంది.

JNTU Audit  Report

విచారణతోనే నిజాలు వెలుగులోకి
విద్యార్థులు చెల్లించే ఫీజులు, ప్రజాధనంతో నడిచే విశ్వవిద్యాలయంలో ప్రతి ఖర్చుకూ ఆధారాలు ఉండాలి. కానీ రూ. 52 కోట్ల ఆడిట్ అభ్యంతరాలు పరిష్కారం కాకపోవడం, రూ.6.49 లక్షల రవాణా ఖర్చుకు సంబంధించిన కీలక రికార్డులు అందుబాటులో లేకపోవడం ఆర్థిక నిర్వహణపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నిధులు ఎక్కడ ఖర్చయ్యాయి? వాటికి సంబంధించిన పత్రాలు ఎందుకు లేవు? ఆడిట్ అభ్యంతరాలకు ఇంతకాలం సమాధానాలు ఎందుకు ఇవ్వలేదు? ఈ అంశాలపై సమగ్ర విచారణ జరగాలి. సీబీఐ విచారణలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతోపాటు, నష్టం జరిగిన ప్రజాధనాన్ని రాబట్టాలి.

తెరవెనుక ఏం జరిగింది?
ఆడిట్ అభ్యంతరాలు.. నిధుల పక్కదారి పట్టినట్లు ఆరోపణలు.. రికార్డుల్లేని ఆర్థిక లావాదేవీలు.. ఇవన్నీ చూస్తుంటే జేఎన్‌టీయూలో తెరవెనుక ఏం జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఈ అక్రమ వ్యవహారాలు జరిగిన సమయంలో కీలక బాధ్యతల్లో ఉన్నదెవరు? నిర్ణయాలు తీసుకున్నది ఎవరు? నిధుల ఖర్చుకు ఆమోదం తెలిపిందెవరు? ఆడిట్ అభ్యంతరాలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోనిదెవరు? ఈ ప్రశ్నలన్నింటి వెనుక అప్పటి కొందరు ఉన్నతాధికారుల పాత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ వ్యవహారాల్లో తెరవెనుక ఉన్నది ఎవరు? కీలక స్థానాల్లో ఉన్న ఆ అధికారులెవరు? వారి పాత్ర ఏంటి? పూర్తి వివరాలు తదుపరి కథనంలో చూద్దాం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *