- 1993 మెమొరాండమే అంతిమం అని పునరుద్ఘాటన
- ఓబీసీ హక్కులకు అత్యున్నత న్యాయస్థానం పెద్ద పీట
సహనం వందే,న్యూఢిల్లీ:
దేశంలో అత్యున్నత సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం కష్టపడే వేలాది మంది ఓబీసీ అభ్యర్థులకు సంబంధించి సుప్రీంకోర్టు అత్యంత కీలక ప్రకటన చేసింది. నాన్ క్రీమీలేయర్ పరిమితిపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పునఃపరిశీలన పిటిషన్‌పై ఈ నెల 6వ తేదీన సుదీర్ఘ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, తన మార్చి 11 నాటి తీర్పును మరోసారి పునరుద్ఘాటించింది. ఈ నిర్ణయంతో సివిల్స్ ఉద్యోగాల కేటాయింపులు, రిజర్వేషన్ల అర్హతలపై నెలకొన్న ఉత్కంఠకు స్పష్టత వచ్చింది.

మార్చి 11 నాటి నిర్ణయం
ఈ వివాదానికి ప్రధాన మూలం దాదాపు మూడు దశాబ్దాల క్రితం, అంటే 1993లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆఫీస్ మెమొరాండం. అసలు ఆ మెమొరాండం కథేంటో ఒకసారి పరిశీలిస్తే, మన దేశంలో ఓబీసీ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన కొత్తలోనే నాన్ క్రీమీలేయర్ పరిమితిని నిర్ణయించారు. సామాజికంగా, విద్యపరంగా వెనుకబడిన వారికి మాత్రమే ఈ రిజర్వేషన్ ఫలాలు దక్కాలనే ఉద్దేశంతో క్రీమీలేయర్ భావనను తీసుకువచ్చారు. అయితే గ్రామీణ నేపథ్యం ఉన్నవారికి, సాధారణ ఉద్యోగులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే నిబంధనల్లో తల్లిదండ్రుల జీతాలను, వ్యవసాయ భూముల ఆదాయాన్ని నాన్ క్రీమీలేయర్ పరిమితి లెక్కింపు నుండి మినహాయించారు. ఈ చారిత్రాత్మక నిర్ణయమే దశాబ్దాలుగా ఓబీసీ అభ్యర్థులకు పెద్ద కొండంత అండగా నిలుస్తూ వస్తోంది. ఆప్రకారమే ఏడాది మార్చి 11న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయం ఓబీసీ విద్యార్థులకు పెద్ద ఊరటనిచ్చినప్పటికీ, తదనంతర పరిణామాలతో అసలు సమస్యలు మొదలయ్యాయి.
ఎంపికలపై చట్టపరమైన చిక్కులు
కోర్టు తీర్పు ప్రభావం సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల తుది జాబితాలు, సర్వీసుల కేటాయింపులపై నేరుగా పడింది. ఇప్పటికే సివిల్స్‌కు ఎంపికై శిక్షణ పొందుతున్న లేదా పోస్టుల కేటాయింపు కోసం ఎదురుచూస్తున్న వారి విషయంలో ఈ నిబంధనను ఎలా అన్వయించాలనే దానిపై కేంద్రానికి చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. పాత పద్ధతిలో లెక్కించి ఎంపిక చేసిన వారి విషయంలో గందరగోళం తలెత్తడంతో మొత్తం ప్రక్రియపై తీవ్ర ప్రభావం పడింది. ఈ గందరగోళం, చట్టపరమైన సమస్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్వయంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తీర్పు వల్ల సివిల్స్ అభ్యర్థుల క్లెయిమ్‌లను పరిశీలించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఎంపికల్లో తలెత్తిన చిక్కులను పరిష్కరించి, అభ్యర్థులకు సర్వీసులను సక్రమంగా కేటాయించడానికి తగిన మార్గదర్శకాలను, తదుపరి ఆదేశాలను ఇవ్వాలని పిటిషన్‌లో కోరింది.
ఓబీసీ హక్కులకు పెద్ద పీట
కేంద్రం వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, 1993 నాటి మెమొరాండం ప్రకారమే ఆదాయ మినహాయింపుల మాటే అంతిమని స్పష్టం చేస్తూ ఓబీసీ వర్గాల హక్కులకు పెద్ద పీట వేసింది. అయితే సర్వీస్ కేటాయింపులలో ఎదురవుతున్న ఇబ్బందులపై తగిన మార్గదర్శకాల కోసం మరింత లోతైన పరిశీలన అవసరమని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఇచ్చే కోర్టు ఆదేశాలే ఈ సుదీర్ఘ పోరాటానికి పూర్తి స్థాయి ముగింపు పలకనున్నాయి.