జేఎన్‌టీయూలో సెక్యూరి(పి)టీ? – ఇంజనీరింగ్ స్టూడెంట్ మృతితో ఉలిక్కిపడ్డ క్యాంపస్‌

JNTU Student Vikram Death Issue
  • విద్యార్థుల ఆగ్రహం… భద్రతపై విమర్శల వెల్లువ
  • సెక్యూరిటీ సంస్థలపై విచారణకు విద్యార్థి నాయకుల డిమాండ్
  • కొన్నేళ్లుగా ఒకే సంస్థకు సెక్యూరిటీ బాధ్యతలు ఇవ్వడంపై విమర్శలు
  • ఓ మాజీ కీలకాధికారి మద్దతుతోనే ఈ సంస్థకు అండదండలు
  • వారం రోజుల్లో తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల విజ్ఞప్తి

సహనం వందే, హైదరాబాద్:

హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్‌ విద్యార్థి విక్రమ్‌ మృతి క్యాంపస్‌లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ ఘటనతో విశ్వవిద్యాలయంలో విద్యార్థుల భద్రత, సంక్షేమం, అధికారుల పర్యవేక్షణపై చర్చ మొదలైంది. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా గట్టి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జి.వి. నరసింహ, వైస్‌ ప్రిన్సిపాల్‌ రఘురాంకు వినతిపత్రం అందించారు.

భవనాలపైకి వెళ్లకుండా చర్యలు
క్యాంపస్‌లో ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యార్థులు కోరారు. ఈ మేరకు పీహెచ్‌డీ పరిశోధకుడు చల్లా రామకృష్ణరెడ్డితో పాటు సన్నీ, దుర్గ, విమల్‌, నవదీప్‌, సాత్విక్‌ తదితర విద్యార్థులు ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జి.వి. నరసింహకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా హాస్టళ్లు, విద్యా భవనాల పైకప్పులపైకి వెళ్లే మార్గాలను నియంత్రించాలని సూచించారు. ఇందుకోసం అక్కడి తలుపులకు తాళాలు ఏర్పాటు చేసి, అనుమతి ఉన్నవారికే ప్రవేశం కల్పించాలని ప్రతిపాదించారు. భవనాల పైభాగాల్లో ఆరు అడుగుల ఎత్తులో రక్షణ కంచెలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. అలాగే క్యాంపస్‌లోని కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని కోరారు. హాస్టళ్ల ప్రధాన ద్వారాలు, కారిడార్లు, మెట్లు, లిఫ్టుల వద్ద నిఘా పెంచాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు.

JNTU Students

సెక్యూరిటీ సంస్థల పనితీరుపై విచారణ
క్యాంపస్‌లో భద్రతా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్‌కేఎస్‌ఎస్‌ సెక్యూరిటీ, శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్‌ పనితీరుపైనా విద్యార్థులు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ రెండు సంస్థల భద్రతా ఏర్పాట్లపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. సిబ్బంది విధులకు సక్రమంగా హాజరవుతున్నారా? వారికి అప్పగించిన బాధ్యతలను సరిగ్గా నిర్వహిస్తున్నారా? పర్యవేక్షణలో లోపాలున్నాయా? అనే అంశాలను పరిశీలించాలని సూచించారు. భద్రతా నిర్వహణలో నిర్లక్ష్యం ఉన్నట్లు విచారణలో తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఒకే సెక్యూరిటీ సంస్థకు బాధ్యతలు
కొన్నేళ్లుగా ఒకే సెక్యూరిటీ సంస్థకు భద్రతా బాధ్యతలు అప్పగించడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఓ కీలక అధికారి సదరు సంస్థకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థకు బాధ్యతలు ఎలా అప్పగించారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఇలాంటి అక్రమాలపైనా ప్రస్తుత అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తాజా ఘటనతో భద్రతా వ్యవస్థలోని లోపాలు వెలుగులోకి వచ్చాయని విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఆయనకు సంబంధించి పలు అంశాలపై సీబీఐకి ఫిర్యాదులు అందాయి. తాజాగా భద్రతా వ్యవహారంలోనూ ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి.

మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం
విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కూడా యాజమాన్యం ప్రధాన అంశంగా పరిగణించాలని వినతిపత్రంలో కోరారు. చదువు, పరీక్షలు, వ్యక్తిగత సమస్యలతో ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకు సరైన సహాయం అందించేందుకు అర్హులైన సైకాలజిస్టులు, కౌన్సెలర్లను నియమించాలని సూచించారు. విద్యార్థులు తమ సమస్యలను ఎలాంటి భయం, సంకోచం లేకుండా చెప్పుకునే వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చదువులో వెనుకబడుతున్న విద్యార్థులపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. పరీక్షల్లో ఫెయిలవుతున్న వారి సంఖ్య, బ్యాక్‌లాగ్స్‌ పరిస్థితిపై సమీక్ష నిర్వహించాలని ప్రతిపాదించారు. అవసరమైన వారికి ప్రత్యేక తరగతులు, మెంటరింగ్‌, సందేహాల నివృత్తి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఐదు కంటే ఎక్కువ బ్యాక్‌లాగ్స్‌ ఉన్న విద్యార్థులను గుర్తించి, వారి తల్లిదండ్రులకు సమాచారం అందించే విధానాన్ని తీసుకురావాలని కోరారు. అంతేకాకుండా విద్యార్థుల భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, అత్యవసర సమయాల్లో సంప్రదించేందుకు ఇరవై నాలుగు గంటల హెల్ప్‌లైన్‌ అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేశారు. ర్యాగింగ్‌, వేధింపులు, బెదిరింపులపై ఫిర్యాదు చేసే విద్యార్థులకు తగిన రక్షణ కల్పించాలని స్పష్టం చేశారు.

వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలి
విక్రమ్‌ మృతి నేపథ్యంలో విద్యార్థులకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని కూడా కోరారు. అతడి అంత్యక్రియలకు హాజరై కుటుంబానికి అండగా నిలిచేందుకు ఈ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మూడు రోజుల్లో పరీక్షలు నిర్వహించకూడదని, హాజరు విషయంలోనూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కల్పించకూడదని స్పష్టం చేశారు. తమ వినతిపత్రంపై యూనివర్సిటీ యాజమాన్యం సానుకూలంగా స్పందించినట్లు రామకృష్ణరెడ్డి వెల్లడించారు. అయితే హామీలు కేవలం మాటలకే పరిమితం కాకుండా అమలులో కనిపించాలని విద్యార్థులు కోరుతున్నారు. మూడు రోజుల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, ఐదు రోజుల్లో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏడు రోజుల్లో తీసుకున్న చర్యలపై పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు. విక్రమ్‌ మృతి తర్వాత విద్యార్థులు చేసిన ఈ డిమాండ్లు యూనివర్సిటీ యాజమాన్యానికి కీలక సవాలుగా మారాయి. క్యాంపస్‌లో భద్రత అంటే కేవలం గేట్ల వద్ద సిబ్బందిని నియమించడం, కెమెరాలు ఏర్పాటు చేయడం మాత్రమే కాదు. విద్యార్థులకు అవసరమైనప్పుడు వైద్యం, మానసిక సహాయం, చదువులో తోడ్పాటు అందించడం కూడా అంతే ముఖ్యం. విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నలకు యాజమాన్యం ఇచ్చే సమాధానం కంటే, క్షేత్రస్థాయిలో చేపట్టే చర్యలే ఇప్పుడు కీలకం కానున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *