- రాజకీయాల వైపు యువత సమర శంఖం
- వీధి పోరాటాల స్థానే డిజిటల్ వరల్డ్ స్ట్రగుల్
- డిజిటల్ నైపుణ్యంతో మారుతున్న పాలిటిక్స్
సహనం వందే, హైదరాబాద్:
2029 సార్వత్రిక ఎన్నికల నాటికి జెన్ జెడ్ జనాభా దేశంలోనే అతిపెద్ద ఓటు బ్యాంకుగా మారుతోంది. గతంలో రాజకీయాలపై ఆసక్తి లేదనే విమర్శలు ఎదుర్కొన్న ఈ కుర్రకారు మిలీనియల్స్ జనాభాను వెనక్కి నెట్టి దూసుకెళ్లింది. ఇంత భారీ ఓటర్ల సంఖ్యతో ఇది దేశంలోనే తిరుగులేని అతిపెద్ద వయోజన జనాజాగా అవతరించనుంది. ప్రస్తుతానికి మన దేశంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న మిలీనియల్స్ జనాభాను ఈ జెన్ జెడ్ సులభంగా వెనక్కి నెట్టేయనుంది.
భారీ ఓటర్లతో మారుతున్న రాజకీయం
సరిగ్గా ఇక్కడే అసలు నంబర్స్ గేమ్ మొదలవుతుంది. 2029లో మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే నాటికి ఈ జెన్ జెడ్ జనాభా దేశంలోనే అతిపెద్ద ఓటు వేసే తరంగా మారుతుంది. అంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ఓటు బ్యాంకును నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి వస్తుంది. రాబోయే 3 ఏళ్లలో 18 నుంచి 32 సంవత్సరాల వయస్సు గల ఈ జనరేషన్ సంఖ్య దాదాపు 38 కోట్ల మందికి చేరుకుంటుంది. మిలీనియల్స్ జనాభా దాదాపు 35.7 కోట్ల మంది వద్ద ఉంటే జెన్ జెడ్ ఆ లెక్కలను తలకిందులు చేస్తోంది.
మంత్రులకూ తప్పని సోషల్ మీడియా బాట
ఈ మార్పు ఎంత తీవ్రంగా ఉందంటే ఇప్పుడు కేంద్ర మంత్రులు సైతం సోషల్ మీడియా బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ స్టాగ్రామ్ లో ప్రత్యక్షమై యువతతో నేరుగా ముచ్చటించడం ప్రభుత్వం ఏం చేస్తోందో వివరించడం ఇప్పుడు అనివార్యమైంది. ఎందుకంటే నిరసనల రూపంలో రోడ్డెక్కడం ఒక్కటే కాకుండా అధికార ప్రతిపక్షాలు ఏ పార్టీ కూడా ఈ యువ శక్తిని విస్మరించలేవనే బలమైన రాజకీయ వాస్తవాన్ని ఇది రుజువు చేసింది. రాబోయే కాలంలో ఏ పార్టీ గెలవాలన్నా ఈ డిజిటల్ కుర్రకారు నాడి పట్టుకోవడం తప్పనిసరి అయిపోయింది.
యువత రాజకీయ ప్రవేశం
గతంలో మన దేశంలో యువత రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదనే విమర్శలు బలంగా ఉండేవి. కేవలం సోషల్ మీడియాలో సెల్ఫీలు తీసుకోవడం, తమ ప్రపంచంలో తాము బతకడమే వీళ్ల పని అని చాలా మంది పెదవి విరిచారు. కానీ ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని కీలక పరిణామాలు ఈ అంచనాలన్నింటినీ తలకిందులు చేశాయి. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపే స్థాయి నుంచి దేశ రాజకీయ వ్యవస్థలోకి ఈ జెన్ జెడ్ దూసుకెళ్లింది. కేవలం వీధులకే పరిమితం కాకుండా ప్రభుత్వ విధానాలనే ప్రశ్నించే శక్తిగా ఎదిగారు.
ఉపాధి విద్యపైనే అందరి చూపు
మరి ఈ భారీ జనాభా ఏయే అంశాలకు పెద్దపీట వేస్తుంది అనే ప్రశ్న వస్తే అక్కడే అసలు కథ ఉంది. ఉపాధి అవకాశాలు, నాణ్యమైన విద్య, నివాస యోగ్యత, వాతావరణ మార్పులు, మెరుగైన పాలన వంటివే వీరికి అత్యంత కీలకం కానున్నాయి. అప్పట్లో కేవలం స్థానిక అంశాల చుట్టూ తిరిగిన రాజకీయాలు ఇప్పుడు ఈ యువత డిమాండ్ల కారణంగా గ్లోబల్, మోడరన్ ఇష్యూస్ వైపు మళ్లక తప్పదు. రేపటి పాలకులను శాసించే ప్రధాన శక్తిగా ఈ అంశాలే మారుతాయి. జెన్ జెడ్ తర్వాత జనరేషన్ ఆల్ఫా రంగప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉంది. 2029 ఎన్నికల్లో వీరు ఓటు వేయకపోయినా ఆ తర్వాత టర్న్ వీళ్లదే అవుతుంది. అందుకే రాబోయే రోజుల్లో యువజన సమస్యలు అనేవి కేవలం ఎన్నికల మేనిఫెస్టోలోని కాగితపు మాటలుగా కాకుండా దేశ రాజకీయాలను నడిపే అసలు సిసలు అజెండాగా మారబోతున్నాయి.
డిజిటల్ నైపుణ్యంతో మారుతున్న పాలిటిక్స్
ఈ తగ్గుదల ఒకెత్తైతే జెన్ జెడ్ కి ఉన్న అసలు సిసలైన బలం వారి డిజిటల్ నైపుణ్యమే. వీరికి సోషల్ మీడియానే ప్రపంచం కాబట్టి ఏ చిన్న సమాచారమైనా క్షణాల్లో కోట్లాది మందికి చేరువవుతుంది. ఒక సరైన ఆలోచన లేదా ఒక చిన్న మీమ్ పేజ్ సైతం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అతిపెద్ద ప్రజా ఉద్యమంగా మారడాన్ని మనం ప్రత్యక్షంగా చూశాము. డిజిటల్ మాధ్యమాల ద్వారా వీరు సృష్టించే నరేటివ్స్ రాజకీయ నాయకుల తలరాతలను మార్చేయగలవు. ప్రస్తుతానికి జెన్ జెడ్ వెనుక ఉన్న ఈ డిజిటల్ పవర్ ఏంటో రాజకీయ పార్టీలకు అర్థమైపోయింది.