- బాధ్యత లేని నేటి యువతరం
- పాశ్చాత్య పోకడల్లో అమ్మాయిలు
- సోషల్ మీడియా మోజు… చదువు క్లోజ్
- తల్లిదండ్రుల కష్టార్జితంతో విలాసాలు
- బాలీవుడ్ నటి జనరేషన్ గట్టర్ వివాదం
- సోషల్ మీడియాలో కంగనా ప్రకంపనలు
సహనం వందే, న్యూఢిల్లీ:
స్వేచ్ఛ పేరుతో బాధ్యత మరిచిపోయి విలాసవంతంగా తిరుగుతూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్న నేటి తరం యువతను ఉద్దేశించి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక వర్గాలలో పెను దుమారాన్ని రేపుతున్నాయి.
కంగనా సంచలన వ్యాఖ్యల నేపథ్యం
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కొద్ది రోజులుగా జరుగుతున్న నిరసనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరిగాయి. అయితే ఈ నిరసనల్లో పాల్గొన్న యువతుల తీరు తెన్నులు, వారు మాట్లాడిన తీరు పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీరు చేసిన రీల్స్ చూసిన ప్రముఖ నటి కంగనా రనౌత్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ నిరసనల్లో పాల్గొన్న యువతులను పాశ్చాత్య పోకడలు పోయే భారతీయ యువతులు అంటూ ఆమె అభివర్ణించారు. చదువుల్లో రాణించలేక, అలాగని సంప్రదాయబద్ధంగా ఉండలేక, కేవలం సోషల్ మీడియా మోజులో పడిపోయారని ఆమె ఆరోపించారు. తాము ఏదో పెద్ద ఉద్యమాలు చేస్తున్నామని బిల్డప్ ఇస్తూ అసలు వాస్తవాలకు దూరంగా బతుకుతున్నారని కంగనా విమర్శించారు.
జనరేషన్ గట్టర్ అంటూ తీవ్ర పదజాలం
ఈ తరానికి చెందిన కొందరు అమ్మాయిల ప్రవర్తన చూస్తుంటే కడుపులో వికారం పుడుతోందని కంగనా సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. కంగనా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ అంశంపై సుదీర్ఘంగా స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారు ఆశించే స్వేచ్ఛకు, చేసే పనులకు ఎక్కడా పొంతన ఉండటం లేదని ఆమె మండిపడ్డారు. తల్లిదండ్రుల కష్టార్జితంతో విలాసవంతమైన జీవితం గడుపుతూ ఎలాంటి బాధ్యత లేకుండా బతకడమే నేటి యువత ఫ్యాషన్ అయిపోయిందని ఆమె విమర్శించారు. డ్రగ్స్ వాడటం, ఆల్కహాల్ సేవించడం, తమ వ్యక్తిగత జీవితాల గురించి గొప్పలు చెప్పుకోవడం వంటి వాటినే ఆధునికత అనుకుంటున్నారని ఆమె దుయ్యబట్టారు. ఇతరుల డబ్బులతో విలాసవంతంగా జీవిస్తూ బాధ్యతారహితంగా ప్రవర్తించే వారిని ఉద్దేశించే కంగనా జనరేషన్ గట్టర్ అనే పదాన్ని ఉపయోగించారు.
నిజమైన స్వతంత్ర భావాలు… బాధ్యతలు
నిజమైన స్వతంత్ర భావాలు కలిగిన మహిళలు తమ కాళ్లపై తాము నిలబడతారని, సమాజంలో ఒక బాధ్యతాయుతమైన మార్గాన్ని ఎంచుకుంటారని కంగనా చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుత జెన్-జీ యువతులు మాత్రం ఎలాంటి కష్టం లేకుండా కేవలం సోషల్ మీడియాలో పేరు కోసం మాత్రమే ఇలాంటి నిరసనల్లో భాగమవుతున్నారని ఆమె ఆరోపించారు. తమ కుటుంబాలకు ఏమాత్రం బాధ్యత వహించకుండా కేవలం ఆడంబరాల కోసం బతికేవాళ్లను స్వతంత్రులు అనలేమని ఆమె స్పష్టం చేశారు. ఒక మహిళా ప్రజాప్రతినిధి అయి ఉండి తోటి యువతపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కొందరు వాదిస్తుంటే ఆమె చెప్పిన దాంట్లోనూ కొంత వాస్తవం ఉందని మరికొందరు సమర్థిస్తున్నారు. ఈ పదం ప్రస్తుతం రాజకీయంగా, సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది.