ఆరు వేల కోట్ల గణేషుడు – హైదరాబాద్‌లో మైండ్ బ్లోయింగ్ బిజినెస్

6000 Crs business with Ganesh Idols in Hyderabad
  • ఉత్సవాల వెనుక 6 వేల కోట్ల వ్యాపారం
  • గణేష్ ‘ఆగమనం’ కార్యక్రమం గ్రాండ్ గేమ్
  • కన్సర్ట్‌లకు ఏమాత్రం తగ్గని హడావుడి
  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వి’నాయకుల’ హవా

సహనం వందే, హైదరాబాద్:

సాధారణంగా ఏదైనా పాప్ సింగర్ మ్యూజిక్ కన్సర్ట్ ఉందంటే వేలకు వేలు పెట్టి టికెట్లు కొంటారు. కలర్‌ఫుల్ బ్యాండ్లు వేసుకుని డ్యాన్స్‌లు చేస్తారు. కానీ రూపాయి టికెట్ లేకుండా, ఎలాంటి డీజేలు లేకుండా మన హైదరాబాద్ రోడ్ల మీద అంతకు మించిన జోష్‌తో జనాలు పూనకాలతో ఊగిపోతున్నారు! ఏంటి కథ అనుకుంటున్నారా? అంతా మన లంబోదరుడి రాక కోసమే.

పెద్ద పండగలా ‘ఆగమనం’
ఒకప్పుడు గణేష్ చతుర్థి వస్తుందంటే కేవలం వీధి చివర పందిరి వేసి పాటలు పెట్టేవారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. పండగ కంటే ముందే విగ్రహాలను మంటపాలకు తీసుకువచ్చే ‘ఆగమనం’ ఒక పెద్ద పండగలా మారిపోయింది. మహారాష్ట్ర నుండి ప్రత్యేకంగా డోల్ తాషా బృందాలను రప్పించడం, రోడ్లన్నీ కన్సర్ట్ స్టేజీలను తలపించేలా విద్యుత్ దీపాలు, బాణసంచాతో మెరిసిపోవడం ఇప్పుడు కొత్త మేనియాగా మారింది. శివరాంపల్లిలో రాజా గణేష్ ఆగమనాన్ని ఏకంగా ఒక స్టేడియంలో నిర్వహించారంటే దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. లాల్ దర్వాజా, నాంపల్లి కా రాజా, రాంనగర్ కా రాజా ఆగమన ఊరేగింపులకు వేలాదిగా జనాలు పోటెత్తారు.

Ganesh idol business in Hyderabad

ఆరు వేల కోట్ల రూపాయల వ్యాపారం…
ఈ హంగామా వెనుక ఎంత పెద్ద బిజినెస్ జరుగుతుందో వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రకారం, హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాల ఆర్థిక వ్యవస్థ ఏకంగా 6 వేల కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఒక అధ్యయనం ప్రకారం… ఈ పండుగ సీజన్ ప్రత్యక్షంగా రెండు లక్షల కుటుంబాలకు జీవనోపాధిని అందిస్తోంది. అలాగే పరోక్షంగా మరో నాలుగు లక్షల మందికి ఉపాధిని కలిగిస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. గత సంవత్సరం ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఏకంగా లక్షా నలభై వేల గణేష్ పండల్స్ ఏర్పాటు చేశారు.

సోషల్ మీడియాలో గణేషుడు…
ఈ వేడుకలకు సోషల్ మీడియా తోడవడంతో క్రేజ్ ఐదు రెట్లు పెరిగింది. ప్రతీ గణేష్ కమిటీ ఇప్పుడు ఒక ప్రత్యేక ఇన్స్టాగ్రామ్ పేజీని రన్ చేస్తోంది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో కొలాబరేట్ అవుతూ విగ్రహాల తయారీ నుండి ఆగమనం వరకు ప్రతీ ఘట్టాన్ని రీల్స్ రూపంలో వైరల్ చేస్తున్నారు. నెట్‌లో ఇప్పుడు ‘తప్పక చూడాల్సిన గణేష్ పండల్స్’ అని పెద్ద లిస్టే తిరుగుతోంది. ఖైరతాబాద్, బాలాపూర్, బేగం బజార్ పెహల్వాన్ గణేష్, రాంనగర్ కా రాజా వంటి పండల్స్ ఈ జాబితాలో టాప్‌లో ఉన్నాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికల లక్ష్యంగా నాయకులు…
ఈసారి గణపతి నవరాత్రులకు మరో ప్రత్యేకత కూడా తోడైంది. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతుండటంతో మన రాజకీయ నాయకులు ఈ గణేష్ కమిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సాధారణ రాజకీయ సభలు పెడితే రాని జనం, ఇప్పుడు కాలనీల్లో చాలా ఈజీగా దొరుకుతారు. అందుకే ప్రతీ డివిజన్ నాయకుడు ఏదో ఒక గణేష్ కమిటీకి స్పాన్సర్ చేయడం లేదా ప్రమోట్ చేయడంలో బిజీ అయిపోయారు. దీనివల్ల కమిటీలకు ఫండింగ్ పెరిగి వేడుకలు మరింత గ్రాండ్‌గా జరుగుతున్నాయి.

నగర ప్రజల ఐక్యతకు నిదర్శనం…
భక్తి, ఉత్సాహం, సాంప్రదాయం… వీటన్నింటికీ సోషల్ మీడియా, ఈవెంట్ మేనేజ్‌మెంట్ తోడైతే ఎలా ఉంటుందో ఇప్పుడు హైదరాబాద్ గణేష్ ఆగమనాలు నిరూపిస్తున్నాయి. పండుగ జరుపుకునే విధానం మారుతున్నప్పటికీ, ఆ వినాయకుడిపై ఉన్న నమ్మకం, నగర ప్రజల ఐక్యత మాత్రం ఎప్పటికీ మారవు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *