డెలివరీ బాయే వాట్సాప్ బాస్ – వాట్సాప్ గ్లోబల్ హెడ్ కునాల్ షా ప్రస్థానం

Whats App Global Head Kunasha
  • కష్టాల్లో పుట్టిన కీర్తి… ప్రపంచ స్థాయి సారథ్యం
  • ఫిలాసఫీ చదివాక ఎంబీఏకు మధ్యలోనే బ్రేక్
  • చదువుకు సంబంధం లేని వ్యాపారాల్లో సక్సెస్

సహనం వందే, ముంబై:

ముంబై వీధుల్లో కొరియర్ డెలివరీ బాయ్‌గా జీవితాన్ని మొదలుపెట్టిన ఒక సామాన్యుడు నేడు ప్రపంచ టెక్ రంగాన్ని శాసించే స్థాయికి చేరుకున్నాడు. కుటుంబం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు చేస్తూ బతికిన కునాల్ షా ప్రస్థానం ఒక అద్భుతం. తన మేధస్సుతో అసాధారణమైన విజయాలను అందుకున్న ఆయన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మందికి పైగా వాడుతున్న వాట్సాప్ సంస్థకు గ్లోబల్ హెడ్‌గా ఎంపికై చరిత్ర సృష్టించారు.

కష్టాల పునాది
1983 మే 20న ముంబైలో జన్మించిన కునాల్ షా జీవితంలో కష్టం చిన్నప్పుడే మొదలైంది. తండ్రికి ఉన్న ఫార్మాస్యూటికల్ వ్యాపారం కునాల్‌కు 14 ఏళ్ల వయసులో కుప్పకూలింది. ఆర్థిక సంక్షోభంతో ఇళ్లు కోల్పోయే పరిస్థితి వచ్చింది. 15 ఏళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతను భుజానికెత్తుకున్న కునాల్… కొరియర్ సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేశారు. ఆఫీసుల్లో డేటా ఎంట్రీ, సైబర్ కేఫ్ మేనేజర్ వంటి పనులు చేస్తూనే సమాజంపై లోతైన అవగాహన పెంచుకున్నారు.

ఫిలాసఫీ పాఠాలు
ముంబైలోని విల్సన్ కాలేజీలో ఫిలాసఫీ డిగ్రీ చదివిన కునాల్… ఆ చదువును కేవలం సమయం కోసం మాత్రమే ఎంచుకున్నారు. ఇతర పనులు చేసుకోవడానికి వీలుగా ఉదయం 8 నుండి 10 వరకు మాత్రమే క్లాసులు ఉండే ఫిలాసఫీని తీసుకున్నారు. నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంబీఏలో చేరినప్పటికీ పుస్తకాల్లో ఉండే పాఠాల కంటే బయట ప్రపంచం నేర్పే పాఠాలే గొప్పవని భావించి చదువును మధ్యలోనే వదిలేశారు.

ఫ్రీచార్జ్ నుండి క్రెడ్ వరకు…
కునాల్ ఏ పని చేసినా లోతుగా ఆలోచిస్తారు. 2010లో సందీప్ టాండన్‌తో కలిసి ఫ్రీచార్జ్ సంస్థను ప్రారంభించారు. మొబైల్ రీఛార్జ్, డీటీహెచ్ రీఛార్జ్, డేటా కార్డ్ రీఛార్జ్ వంటి సేవలను ఆన్‌లైన్ ద్వారా సులభతరం చేసింది. దీనితో పాటు ఎలక్ట్రిసిటీ బిల్లులు, గ్యాస్ బిల్లులు, ల్యాండ్‌లైన్ బిల్లులను చెల్లించే సౌకర్యాన్ని కల్పించింది. ఇది 2015లో 2,800 కోట్ల రూపాయలకు స్నాప్‌డీల్‌కు అమ్ముడైంది. అనంతరం 2018లో క్రెడ్ అనే వినూత్న సంస్థను స్థాపించారు. వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్ బిల్లులను ఒకే చోట చూసుకోవడానికి, చెల్లించడానికి క్రెడ్ సులభమైన ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది. బిల్లు సకాలంలో చెల్లించేలా ఇది రిమైండర్లను కూడా పంపుతుంది. ఇలా వినియోగదారుల ప్రవర్తనను అర్థం చేసుకోవడంలో ఆయనకు సాటి ఎవరూ లేరు. క్రెడ్ ద్వారా 1.7 కోట్ల మంది యాక్టివ్ యూజర్ల నమ్మకాన్ని గెలిచి తన సత్తా చాటారు.

వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా
మెటా సంస్థ క్రెడ్‌లో 8,550 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. దీంతోపాటు కునాల్ షాను వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా నియమించింది. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న విల్ క్యాట్‌కార్ట్ ఏఐ ప్రాజెక్టులకు మారనున్నారు. ఇప్పుడు కునాల్ వాట్సాప్ అభివృద్ధి, అడ్వర్టైజింగ్, ఏఐ ఆధారిత సేవలపై దృష్టి పెట్టనున్నారు. గ్లోబల్ హెడ్ హోదాలో ప్రపంచవ్యాప్త కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాకు మకాం మార్చాల్సి ఉంటుంది.

ఏఐ… భవిష్యత్తు వ్యూహం
కునాల్ బాధ్యత కేవలం ఒక పదవి మాత్రమే కాదు. ఇది భారతీయ స్టార్టప్ వ్యవస్థకు దక్కిన గౌరవం. వాట్సాప్ తదుపరి దశలో ప్రకటనలు, సబ్‌స్క్రిప్షన్లు, కృత్రిమ మేధస్సును ఏకీకృతం చేయడంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. క్రెడ్‌ను లాభాల బాట పట్టించిన తన వ్యూహాలతో 300 కోట్ల మంది వినియోగదారులున్న వాట్సాప్‌ను ఆయన కొత్త పుంతలు తొక్కించనున్నారు.

అనుభవమే అసలైన విద్య
కునాల్ షా ప్రయాణం చదువుకు వృత్తికి సంబంధం ఉండాలనే నిబంధనలను చెరిపేసింది. డిగ్రీలు కేవలం అర్హతలు మాత్రమేనని… నిజమైన నైపుణ్యం అనుభవంతోనే వస్తుందని ఆయన నిరూపించారు. ఫిలాసఫీ, ఫిన్‌టెక్ దాటి ఇప్పుడు ఏఐ, గ్లోబల్ మెసేజింగ్ రంగంలో ఆయన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. కష్టం, క్రమశిక్షణ ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని ఆయన జీవితం నిరూపించే ఒక పాఠం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *