ట్రంప్ కొడుకుతో అదానీ రహస్య భేటీ – వెలుగులోకి లంచాల కేసు సంచలనాలు

Adani Met S/o Trump
  • కేసు కీలక సమయంలో సీక్రెట్ మంతనాలు
  • అదానీ వ్యూహం… పెట్టుబడుల ఆశల పందెం

సహనం వందే, హైదరాబాద్:

అమెరికాలో లంచాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ భారత బిలియనీర్ గౌతమ్ అదానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్‌తో భేటీ వ్యవహారం వెలుగు చూడటం అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికాలో అదానీపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న సమయంలోనే ట్రంప్ జూనియర్ ఇండియాలో పర్యటించారు. అహ్మదాబాద్‌లో జరిగిన వీరిద్దరి రహస్య సమావేశం, కేసు రద్దుకు దారితీసిన పరిణామాల పట్ల అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భేటీ వెనుక అసలు కథ
అమెరికా దర్యాప్తు సంస్థలు అదానీపై నిప్పులు చెరుగుతున్న క్లిష్ట సమయంలో ట్రంప్ ఆర్గనైజేషన్ కీలక బాధ్యుడైన ట్రంప్ కుమారుడు ఇండియాకు వచ్చారు. ఈ పర్యటనలో అహ్మదాబాద్‌లో జరిగిన భేటీ కేవలం వ్యాపార సంబంధిత చర్చలకు మాత్రమే పరిమితం కాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో తనపై ఉన్న కేసుల నుండి బయటపడటానికి అదానీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ భేటీ జరిగిందని, ఇది అదానీ గ్రూప్ భవిష్యత్తును కాపాడే ఒక వ్యూహాత్మక అడుగుగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

లంచాల భారీ కుంభకోణం
గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై అమెరికా దర్యాప్తు సంస్థలు దాదాపు 2,217 కోట్ల రూపాయల లంచాల కుంభకోణానికి పాల్పడ్డారని అభియోగాలు మోపాయి. అధికారులకు భారీగా లంచాలిచ్చి సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులను దక్కించుకున్నారని, ఈ విషయాన్ని అమెరికా ఇన్వెస్టర్లకు తెలియకుండా దాచిపెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 20 ఏళ్లలో 1.67 లక్షల కోట్ల రూపాయల లాభాలు గడించాలని అదానీ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుందని దర్యాప్తులో తేలింది.

రంగంలోకి ట్రంప్ లాయర్…
కేసు తీవ్రత పెరుగుతుండటంతో అదానీ గ్రూప్ అత్యంత వ్యూహాత్మక అడుగు వేసింది. డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత లాయర్ రాబర్ట్ గిఫ్రాను తన లీగల్ టీమ్‌కు నాయకత్వం వహించేలా రంగంలోకి దించింది. అమెరికా న్యాయ వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యక్తిని నియమించుకోవడం ద్వారా కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రంప్ కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో జరిగిన ఈ మార్పు కేసులో ఊహించని మలుపులకు దారితీసింది.

పెట్టుబడుల ఆఫర్ల పందేరం
కేసు నుంచి బయటపడటానికి అదానీ గ్రూప్ అమెరికా ఆర్థిక వ్యవస్థలో 83,500 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని, 15,000 మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన వెంటనే గౌతమ్ అదానీ ఈ భారీ వాగ్దానం చేశారు. ఇలాంటి భారీ పెట్టుబడుల ఎర చూపడం ద్వారా అమెరికా న్యాయ శాఖపై ఒత్తిడి పెంచి కేసును పక్కకు తప్పించే ప్రయత్నం చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ వారసుడితో భేటీ జరిగిన కొద్ది కాలానికే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

సెటిల్మెంట్ల పర్వం
చివరికి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌తో జరిగిన ఒప్పందంలో భాగంగా గౌతమ్ అదానీ 50 కోట్ల రూపాయలు, సాగర్ అదానీ 100 కోట్ల రూపాయలు చెల్లించడానికి అంగీకరించారు. అమెరికా న్యాయ శాఖ అదానీపై ఉన్న క్రిమినల్ కేసులను నిలిపివేస్తున్నట్లు గత మే నెలలో ప్రకటించింది. ఈ నిర్ణయం అదానీ గ్రూప్‌కు ఉపశమనం కలిగించినప్పటికీ… న్యాయవ్యవస్థ నిష్పాక్షికతపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ట్రంప్ వారసుడితో భేటీనే కీలకం
అదానీపై ఉన్న ఆరోపణలు తొలగించడం వెనుక ట్రంప్ సన్నిహితులతో ఉన్న సంబంధాలు, ముఖ్యంగా ట్రంప్ వారసుడితో భేటీ కీలకంగా మారాయని అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కేవలం భారీ పెట్టుబడుల హామీ ఇవ్వడం ద్వారా చట్టపరమైన ఇబ్బందుల నుంచి బయటపడటం, వ్యాపార ప్రయోజనాల కోసం అమెరికా న్యాయ వ్యవస్థను ప్రభావితం చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమని చెప్పే దేశం, ఈ కేసులో తీసుకున్న నిర్ణయం వ్యాపార శక్తుల ముందు చట్టం వెలవెలబోయిందనే సంకేతాన్ని పంపిందనే విమర్శలు వస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *