- హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
- ఎమ్మెల్యే పదవి కోల్పోయిన దానం నాగేందర్
- ఖైరతాబాద్ ఉపఎన్నికలకు మార్గం సుగమం
సహనం వందే, హైదరాబాద్:
ఒకవైపు ఎమ్మెల్యే పదవి భద్రంగా ఉంచుకుంటూనే, ఇంకోవైపు ఎంపీగా పోటీ చేసి జెండా పాతేద్దామని ఆశపడితే ఏమవుతుంది? ‘ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే’ అనే సామెతలా మారుతుంది పరిస్థితి! ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లి, ఆపై లోక్‌సభకు పోటీ చేసిన ఆయన కథ చివరకు ఎక్కడిదాకా వచ్చింది? అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆయనకు ఎలాంటి క్లాస్ పీకింది? ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఏంటో ఇప్పుడు క్లియర్‌గా విశ్లేషిద్దాం.
ఒక పార్టీ ఎమ్మెల్యే… మరో పార్టీకి ఎంపీ అభ్యర్థి
రాజకీయాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే మారిన రాజకీయ సమీకరణలతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అంతటితో ఆగకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎమ్మెల్యేగా ఒక పార్టీలో ఉంటూ, మరొక పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడం అంటే చట్టపరంగా ఎలాంటి చిక్కులు తెచ్చిపెడుతుందో ఆయన సరిగ్గా అంచనా వేయలేకపోయారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు…
ఈ వ్యవహారంపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాత్రం దానం నాగేందర్‌పై దాఖలైన పిటిషన్లను తిరస్కరించడంతో ఈ రచ్చ తెలంగాణ హైకోర్టు వరకు వెళ్ళింది. ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ స్పీకర్ నిర్ణయాన్ని పక్కనబెడుతూ సంచలన తీర్పునిచ్చింది. 2024 ఏప్రిల్ 23న సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాటి నుంచే దానం నాగేందర్ అనర్హత అమల్లోకి వస్తుందని తేల్చిచెప్పింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లేనని, అక్కడ ఉపఎన్నికలకు మార్గం సుగమమైందని స్పష్టం చేసింది. తీర్పును నిలిపివేయాలని దానం తరఫు లాయర్లు కోరినప్పటికీ హైకోర్టు అసలు ఒప్పుకోలేదు.
పరువు తీసిన సుప్రీం జడ్జి…
హైకోర్టు షాక్‌తో దానం నాగేందర్ వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ కూడా ఆయనకు తీవ్ర నిరాశే ఎదురైంది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్తూ ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. ఇదే సమయంలో జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ వేసిన కొన్ని వ్యాఖ్యలు కోర్టులో ఆసక్తికరంగా మారాయి. “మీకు ఎమ్మెల్యేగా ఒక సెక్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. కానీ మీరు ఎంపీగా షేర్ మార్కెట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నించి, చివరికి ఆ ఫిక్స్డ్ డిపాజిట్‌ను కూడా కోల్పోయారు” అని చమత్కరించారు. అంతేకాకుండా “మీ కేసు ఏమైనా ‘ఆయా రామ్, గయా రామ్, ఫిర్ ఆయా రామ్’ లాంటిదా?” అని వ్యాఖ్యానించడంతో కోర్టు హాలులో నవ్వులు పూసాయి.
మాజీ ఎమ్మెల్యేగా మారిన దానం…
మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పుతో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ మిగిలిపోయారు. ఒకే సమయంలో రెండు పడవల మీద కాళ్ళు పెట్టడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పడానికి ఈ ఘటన ఒక స్పష్టమైన ఉదాహరణ. అంతేకాకుండా రాజ్యాంగ నియమాలను తేలికగా తీసుకుంటూ పార్టీలు మారే నాయకులకు ఈ తీర్పు ఒక గట్టి హెచ్చరికలా నిలిచింది. ఇక ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నికల నగారా మోగడం దాదాపు ఖాయమైంది. చట్టం పవర్ ముందు ఏ రాజకీయ సమీకరణాలైనా తలవంచాల్సిందే అని ఈ కేసు మరోసారి ప్రూవ్ చేసింది. ఒక పదవి చేతిలో ఉంచుకుని మరో పదవి కోసం ఆశపడి చివరికి రెండూ కోల్పోవడం అంటే ఇదే.