అణచివేస్తే అగ్నిగుండమే – ఉద్యమాలకు అండగా కాంగ్రెస్ ‘సత్యాగ్రహం’

`Rahul Gandhi's Satyagrah Digital platform
  • ప్రజా పోరాటాలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్
  • అగ్రనేత రాహుల్ గాంధీ వినూత్న ఆలోచన
  • ప్రతి చిన్న పోరాటానికి అన్ని విధాలా మద్దతు
  • తొమ్మిది గంటల్లో 10 వేల మంది రిజిస్ట్రేషన్

సహనం వందే, న్యూఢిల్లీ:

దేశంలో ప్రతిఒక్కరూ తమ హక్కుల కోసం వీధిపోరాటాలు చేస్తున్న ఈ రోజుల్లో ఏకాకిగా మిగిలిపోతున్న కోట్లాది గొంతులకు తోడుగా ఎవరు నిలబడతారు? విద్యార్థులు, రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు పడుతున్న వేదనను వెలికితీసే నాథుడేడీ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక కొత్త సత్యాగ్రహ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న స్థానిక ప్రజా పోరాటాలను ఒకే వేదికపైకి, ఒకే మ్యాప్‌ మీదికి తీసుకొచ్చి వాటికి ప్రాణం పోయడమే ఈ వినూత్న ఆలోచన వెనుక ఉన్న అసలు ఉద్దేశం.

ఒంటరి పోరుకు కాంగ్రెస్ దండయాత్ర మనదేశంలో జెన్ జీ యూత్, విద్యార్థులు, రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు తమ హక్కుల కోసం నిత్యం పోరాడుతున్నారు. కానీ ఆ గొంతులు చాలాసార్లు అధికారుల అణచివేతకు గురై నలిగిపోతున్నాయి. ఒంటరిగా అరిచే ఆక్రోశం మూగబోతోంది. గాంధీజీ నేర్పిన సత్యం అనే ఆయుధానికి ఐక్యత అనే శక్తిని తోడు చేసి ఈ అన్యాయాలను ఎండగట్టాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లోనూ, రోడ్లపైకి వచ్చి పోరాటాల్లోనూ, అధికారులకు ఉత్తరాలు రాస్తూ బాధిత ప్రజల తరఫున తాను నిలబడతానని స్పష్టం చేశారు.

Rahuk Gandhi's Digital Platform

ఆన్‌‌లైన్ ఫారమ్‌లో అన్యాయాల కథనాలు…

ఎవరైనా వ్యక్తిగతంగా గానీ, ఒక సమూహంగా గానీ ఈ సత్యాగ్రహ పోర్టల్‌లో తమ ఆవేదనను సమర్పించవచ్చు. సైట్‌లోకి వెళ్లి వాయిస్ పెంచే బటన్ నొక్కి పేరు, రాష్ట్రం, జిల్లా, ఫోన్ నంబర్ నమోదు చేయాలి. భూ హక్కులు, ఆరోగ్య సంరక్షణ, కుల వివక్ష, కార్మిక హక్కులు, పర్యావరణ పరిరక్షణ, మహిళల రక్షణ, రైతుల సమస్యలు, విద్యా సదుపాయాలు వంటి విభాగాలను ఎంచుకుని సమస్యను వివరించవచ్చు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా జత చేసే వెసులుబాటు కల్పించారు.

తొమ్మిది గంటల్లో 10 వేల మంది స్పందన
ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన కేవలం 9 గంటల్లోనే 10 వేల మందికి పైగా తమ ఫిర్యాదులు, సమస్యలను సమర్పించారు. విద్యా వ్యవస్థలోని లోపాలు, అవినీతి, సామాజిక అన్యాయాలు, పర్యావరణ సమస్యలపై వేలాది మంది తమ బాధలను పంచుకున్నారు. ప్రతి కథనాన్ని ఒక బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఆ సమస్యను భారతదేశపు డిజిటల్ మ్యాప్‌లో ఆయా ప్రాంతాల పరిధిలో పిన్ చేసి ప్రదర్శిస్తారు.

బాధితులకు కొండంత అభయం…
ఈ డిజిటల్ సత్యాగ్రహం ఏదో ఒక రోజుతో ముగిసిపోయే ప్రచారం కాదు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఉద్యమానికి మద్దతుగా నిలవడానికి ఇది సంవత్సరాల పాటు నిరంతరం కొనసాగుతుంది. ఎక్కడైతే ప్రజా సమస్య తీవ్రంగా ఉందో దానిని పరిష్కరించడానికి సోషల్ మీడియా, పత్రికా సమావేశాలు, చివరకు చట్టసభల వేదికగా గళమెత్తుతామని రాహుల్ గాంధీ ఘంటాపథంగా చెప్పారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *