‘బొమ్మ’కు బ్రేక్… హీరోల ఖుష్ – ఐ బొమ్మ మూసివేతతో పైరసీ ముగిసినట్టేనా?

  • ఇమ్మడి రవి గ్యాంగ్ మళ్లీ మొదలుపెట్టదా?
  • సినిమా వర్గాలను వణికిస్తున్న హ్యాకింగ్ దడ
  • ఆధునిక టెక్నాలజీతో ముంచుకొచ్చిన ముప్పు
  • రవితోనే పైరసీ వ్యవస్థకు బ్రేక్ వేయగలమా?

సహనం వందే, హైదరాబాద్:
సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఉన్నత చదువులు చదివి రెండు కంపెనీలకు సీఈఓ స్థాయికి ఎదిగిన ఓ యువ మేధావి… చీకటి ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆయనే ఐ బొమ్మ, బప్పం వంటి పైరసీ సైట్లకు సూత్రధారి ఇమ్మడి రవి. తన కంప్యూటర్ టెక్నాలజీ నైపుణ్యాన్ని సరైన మార్గంలో కాకుండా సినిమా పరిశ్రమను నాశనం చేసే పైరసీ దారికి మళ్లించాడు. రవి టెక్నాలజీ నైపుణ్యం చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. అతనిని జైలుకు పంపించడంతో ఐ బొమ్మ నిర్వాహకులు దాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఐ బొమ్మ మూసివేతతో పైరసీ కథ కంచికే అనుకోవచ్చా? బయటకు వచ్చిన తర్వాత ఇమ్మడి రవి గ్యాంగ్ మళ్లీ ఫైరసీ మొదలు పెట్టదన్న గ్యారెంటీ ఏమిటి? ఇవన్నీ సినీ పరిశ్రమ వర్గాలను వేధిస్తున్న ప్రశ్నలు. ఇది కేవలం ఇమ్మడి రవి ఐ బొమ్మతోనే ముడిపడి లేదు. ఆధునిక టెక్నాలజీతోనే అసలు ముప్పు ముంచుకొస్తుంది.

ఓటీటీ సర్వర్‌లనే ఊడ్చేశాడు…
సాధారణ పైరసీ ముఠాలు సినిమా థియేటర్‌లలో కెమెరాతో తక్కువ నాణ్యత వీడియోలు తీసి నష్టాన్ని కలిగిస్తే… రవిది అత్యంత అధునాతనమైన పద్ధతి. రవి నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల అత్యంత భద్రత కలిగిన సర్వర్‌లనే ఛేదించే హ్యాకింగ్ టెక్నిక్‌లలో నైపుణ్యం సాధించాడు. ఓటీటీ సంస్థలు సినిమాలను భద్రంగా ఉంచే పటిష్టమైన ఎన్‌క్రిప్ట్ ఫార్మాట్‌ను బద్దలు కొట్టి వాటి సర్వర్లలోకి చొరబడేవాడు. ఆ ఎన్‌క్రిప్టెడ్ డేటా నుంచి హెచ్‌డీ క్వాలిటీ సినిమా ఫైల్‌లను ఏకంగా ఎక్స్‌ట్రాక్ట్ చేసేవాడు. అంటే ఒరిజినల్ క్వాలిటీ ఫైల్‌నే దొంగిలించేవాడు. ఈ మాస్టర్ హ్యాకింగ్ ప్లాన్‌తోనే రవి వేలాది కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను దొంగిలించి తన హార్డ్‌డిస్క్‌లలో నిల్వ చేసుకునేవాడు.

వంద డొమైన్లు… గ్లోబల్ దందా!
రవి సృష్టించిన ఈ సామ్రాజ్యం కేవలం లోకల్ కాదు… గ్లోబల్ స్థాయిది. వందకు పైగా డొమైన్‌లను కొనుగోలు చేసి ఐబొమ్మ, బప్పం వంటి సైట్లను రూపొందించాడు. ఒక సైట్‌ను బ్లాక్ చేస్తే వెంటనే కొత్త సైట్‌తో నిమిషాల్లో ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి తెచ్చేవాడు. అంతేకాదు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల సాయంతో తన స్థానాన్ని మార్చుకుంటూ ప్రపంచవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సైతం చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు.

పోలీసులకే సవాల్ విసరడంతో…
‘మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరు’ అంటూ పోలీసులకు సవాలు విసిరిన ఈ పైరసీ కింగ్‌ను పట్టుకోవడం పోలీసులకు పెద్ద టాస్క్ అయ్యింది. విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న రవిని సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా వల పన్ని అరెస్ట్ చేశారు. ఇన్నాళ్లూ తన పైరసీతో సినీ పరిశ్రమను వణికించిన నిందితుడితోనే ఆ వెబ్‌సైట్లను క్లోజ్ చేయించి పోలీసులు తమ సత్తా ఏంటో నిరూపించారు. రవి అరెస్టుతో ఒక పెద్ద హ్యాకింగ్ ఆధారిత పైరసీ నెట్‌వర్క్‌కు తెరపడింది. ప్రస్తుతం అతడికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఆయన గ్యాంగ్ ను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *