- బంగారు మైనింగ్.. ఫారెస్ట్ కిల్లింగ్
- బ్రెజిల్ వాతావరణ సదస్సు రసాభాస
- మిన్నంటిన ఆదివాసీల ఆగ్రహ జ్వాలలు
- అటవీ భూములపై హక్కులకు డిమాండ్
సహనం వందే, బ్రెజిల్:
బ్రెజిల్‌లోని బెలెమ్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్30) ఈసారి ఆదివాసీల ఆందోళనలతో వేడెక్కింది. గతంలో ఎన్నడూ లేనంత భారీ సంఖ్యలో వేలాది మంది ఆదివాసీలు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఆండిస్, అమెజాన్ అడవి ప్రాంతాల నుంచి నెల రోజుల పాటు యకు మామా (నీటి తల్లి) పేరుతో సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చిన ఈ అడవి బిడ్డలు తమ అరణ్యాలు బంగారు మైనింగ్, చమురు తవ్వకాలతో నాశనం అవుతున్నా ప్రపంచ దేశాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని మండిపడ్డారు. మూడు దశాబ్దాలుగా కేవలం జాతీయ ప్రభుత్వాలే అడవులు, ఇంధనంపై నిర్ణయాలు తీసుకుని తమను పక్కన పెట్టాయని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
చట్టాలు ఎక్కడ? చర్చలు ఎందుకు?
కేవలం ప్యానెల్ చర్చల కోసం, సాంస్కృతిక ప్రదర్శనల కోసం మాత్రమే తమను సదస్సుకు అనుమతిస్తున్నారని ఆదివాసీ నాయకులు విమర్శిస్తున్నారు. వాతావరణ మార్పులను నివారించాలంటే తమ భూములపై పూర్తి హక్కులు (డెమార్కేషన్) ఇవ్వడమే ఏకైక మార్గమని వారు స్పష్టం చేస్తున్నారు. శాస్త్రీయ అధ్యయనాలు సైతం ఈ విషయాన్ని నిరూపించినా ఏ దేశమూ తమ జాతీయ లక్ష్యాలలో భూ హక్కుల అంశాన్ని చేర్చకపోవడం శోచనీయం. తమ డిమాండ్‌ను సూచించేలా సమావేశ ప్రాంగణంలో భారీ గాలితో నింపిన నాగుపాము (కోబ్రా) ఆకృతిని ప్రదర్శించడం నిరసనకు నిలువెత్తు నిదర్శనం.
దొంగల మాటే దైవ వాక్కు
బ్రెజిల్ అధ్యక్షులు లూలా డిసిల్వా ఆదివాసీల భూ హక్కులు ముఖ్యమని పైకి చెబుతున్నా ఆచరణలో మాత్రం ఆలస్యం చేస్తున్నారని నాయకులు మండిపడుతున్నారు. ప్రస్తుతం 107 ఆదివాసీ భూముల గుర్తింపు (డెమార్కేషన్) ప్రక్రియలు ప్రభుత్వ తుది నిర్ణయం కోసం పెండింగ్‌లో ఉన్నా లూలా ప్రభుత్వం వాటిని తాత్సారం చేస్తోందని ఆరోపించారు. ఒకవైపు తమకు హక్కులు కల్పించమని కోరుతూనే, మరోవైపు అమెజాన్ నదీ సమీపంలో చమురు అన్వేషణకు లూలా అనుమతి ఇవ్వడం ఏంటని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భూమిని కాపాడుకోవడానికి, అక్రమ ఆక్రమణలు జరగకుండా నిఘా పెట్టడానికి నిధులు కావాలన్నా పట్టించుకోవడం లేదని, ఈ సదస్సు కూడా కేవలం మాటలకే పరిమితం అవుతోందని వారు విమర్శించారు.