- ఓటరు జాబితా కోత… మోడీకి సీట్ల ఘనత
- తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన అమెరికా పత్రిక
- బీహార్ లో 40 లక్షల పేర్లు గల్లంతు అయ్యాయి
- ప్రక్షాళన వ్యూహం: మరో 9 రాష్ట్రాల్లో కోత
- ఓట్ల చోరీ అంశంపై హాట్ హాట్ కామెంట్స్
సహనం వందే, అమెరికా:
బీహార్ ఫలితాలపై ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అమెరికన్ న్యూస్ పేపర్ ‘న్యూయార్క్ టైమ్స్‘ శుక్రవారం సంచలన కథనం ప్రచురించింది. ఎన్నికల ఫలితాల్లో ప్రధాని మోడీకి… ఎన్డీఏ కూటమికి అత్యధిక సీట్లు రావడంపై ‘న్యూయార్క్ టైమ్స్’ విమర్శనాత్మకంగా విశ్లేషించింది. ఆ కథనం సారాంశ ఏమిటో పరిశీలిద్దాం. (న్యూయార్క్ టైమ్స్ రాసిన స్టోరీ ఇక్కడున్న లింకులో https://nyti.ms/4r7fC5J చూడొచ్చు)
భారతదేశంలో అత్యంత పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని పాలక కూటమి భారీ విజయం సాధించింది. ఈ ఫలితాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో జరిగిన తొలగింపు ప్రక్రియపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.13 కోట్ల మందికి పైగా జనాభా ఉన్న బీహార్‌లో మోడీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టమైంది. 243 సీట్లు ఉన్న అసెంబ్లీలో కూటమి 200 సీట్లకు పైగా సాధించే పరిస్థితి కనిపిస్తుంది.
40 లక్షల పేర్లు గల్లంతు…
ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో జరిపిన తొలగింపుపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర నిరసన తెలిపాయి. ఈ గందరగోళ పరిస్థితిలో 40 లక్షలకు పైగా పేర్లను జాబితా నుంచి తొలగించారు. ఇలాంటి తొలగింపు ప్రక్రియలు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా జరగాల్సి ఉండటంతో ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. చనిపోయిన, నకిలీ, ఒకే వ్యక్తి పేరుతో పలుచోట్ల ఉన్న ఓటర్లను తొలగించడమే తమ ఉద్దేశమని ఎన్నికల సంఘం, బీజేపీ చెప్తున్నాయి. తక్కువ మెజారిటీతో సీట్లు గెలిచిన రాష్ట్రంలో అంత పెద్ద ఎత్తున జాబితాను సవరించడం అనుమానాలకు తావిస్తోంది.

మహిళలకు 10 వేల నగదు పంపిణీ…
ప్రధాన మంత్రి మోడీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న స్థానిక పార్టీకి చెందిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇద్దరూ మహిళా ఓటర్లలో బలమైన మద్దతు కలిగి ఉన్నారు. నితీశ్ కుమార్ మహిళల కోసం స్కాలర్‌షిప్‌లు, ఇతర పథకాలు ప్రారంభించారు. రాష్ట్రంలో మద్య నిషేధం మహిళల్లో జనాదరణ పొందింది. ఎన్నికల సంఘం ప్రకారం… మహిళా ఓటింగ్ 71 శాతం దాటింది. పురుషుల ఓటింగ్ కంటే ఇది దాదాపు 10 శాతం ఎక్కువ కావడం విశేషం. ఎన్నికలకు కొద్ది వారాల ముందు కూటమి ప్రభుత్వం లక్షలాది మంది మహిళలకు 10 వేల రూపాయల నగదు సాయాన్ని అందించింది. ఇది ఆ రాష్ట్ర సగటు తలసరి నెలవారీ ఆదాయం కంటే ఎక్కువ. ప్రభుత్వ నిధులను ఉపయోగించి అన్యాయంగా లాభం పొందారని ప్రతిపక్షం ఆరోపించింది.
ఓట్ల చోరీ: బ్రెజిలియన్ మోడల్ ఫోటో వివాదం
మోడీ తమకు అనుకూలంగా ఎన్నికల వాతావరణాన్ని మార్చుకుంటున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. ఎన్నికల సంఘం పాలకపక్షానికి సాయం చేస్తోందని విమర్శలు ఎక్కుపెట్టింది. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ… ఎన్నికల్లో జరిగిన భారీ అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. హర్యానాలో వివాదాస్పదమైన ఓటింగ్ గుర్తింపు విషయంలో ఒక యువతి ఫోటోను స్క్రీన్‌పై చూపిస్తూ… అదే చిత్రం 10 బూత్‌లలో 22 ఓటింగ్ ఐడీలలో ఉందని… ప్రతి సారి వేరే పేరుతో ఉందని తెలిపారు. ఆమె బ్రెజిలియన్ మోడల్ అని ఆయన ప్రకటించారు. రాహుల్ గాంధీకి ఎన్నికల అధికారి లేఖ రాస్తూ… ఓటర్ల జాబితాలు పారదర్శకంగా తయారు చేశామని, ఫిర్యాదులను అధికారికంగా దాఖలు చేయాలని సూచించారు.
ప్రక్షాళన వ్యూహం: మరో 9 రాష్ట్రాల్లో కోత
బీహార్‌లో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అని పిలిచే ప్రక్షాళన ప్రక్రియ… ఓటర్ల జాబితాలలోని లోపాలను సరిచేయడానికి ఉద్దేశించినది. ఇది ఇప్పుడు కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి బీజేపీ పాగా వేయాలని చూస్తున్న రాష్ట్రాలతో సహా మరో తొమ్మిది రాష్ట్రాల్లో జరుగుతోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో బీహార్ రాష్ట్రం మోడీ కూటమికి అత్యధిక సంఖ్యలో సీట్లను అందించింది. ఓటర్ల జాబితాను ఇంత తీవ్రంగా, ఇంత అకస్మాత్తుగా సవరించడం రెండు విషయాలను సూచిస్తుందని ప్రతిపక్షం వాదించింది: ఒకటి: మోడీ వివాదాస్పద ఎన్నికల జాబితా ఆధారంగా ఆ సీట్లను గెలిచారు. రెండు: ఆయన పార్టీ భారీ ఓటర్ల తొలగింపు ద్వారా ఫలితాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఎన్నికల సంఘం మొదట 65 లక్షల మందిని తొలగించినా… ప్రతిపక్షం కోర్టుకు వెళ్లి చనిపోయారని ప్రకటించిన కొంతమంది బతికే ఉన్నారని నిరూపించడంతో లక్షలాది మందిని తిరిగి ఓటర్ల జాబితాలోకి చేర్చారు.