‘ఐఐటీ’యన్ కోసం కదిలొచ్చిన గూగుల్ – గంటలో పాస్ పోర్ట్.. ప్రైవేట్ జెట్లో అమెరికాకు

  • అందుకోసం రంగంలోకి అమెరికా ప్రభుత్వం
  • బగ్ గుర్తించి గూగుల్‌నే షేక్ చేసిన కుర్రాడు
  • కొద్దిసేపు స్తంభించిపోయిన సెర్చ్ ఇంజిన్
  • తలలు పట్టుకున్న సంస్థ పెద్ద తలకాయలు
  • సాల్వ్ చేసి బగ్ గురించి చెప్పిన ‘ఐఐటీ’యన్
  • దీంతో బిత్తర పోయిన ప్రపంచ సాఫ్ట్ వేర్ లోకం
  • 3.66 కోట్ల ప్యాకేజీతో రీతురాజ్ చౌదరికి జాబ్
  • మణిపూర్ క్యాంపస్‌లో మెరిసిన బీహార్ తేజం

సహనం వందే, పాట్నా:
సాధారణంగా విద్యార్థులు ఇంటర్నెట్‌లో కాలక్షేపం చేస్తారు. కానీ బీహార్‌కు చెందిన రీతురాజ్ చౌదరి ఇందుకు భిన్నం. ఐఐటీ మణిపూర్‌లో చదువుతున్న ఈ యువకుడు… ఏకంగా ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ పైనే దృష్టి పెట్టాడు. అవును మీరు విన్నది నిజమే! తన అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా 53 సెకన్ల పాటు గూగుల్‌ను స్తంభింపజేసి… ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఎక్కడికక్కడ కూర్చున్న గూగుల్ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు ఎంత ప్రయత్నించినా ఈ అనూహ్యమైన హ్యాక్‌కు కారణం ఏంటో, దాన్ని ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకున్నారు. కానీ భారతీయ ప్రతిభ ముందు సాంకేతిక చిక్కుముడులు సైతం లొంగిపోవాల్సి వచ్చింది.

గూగుల్‌కు షాకిచ్చిన మెయిల్…
గూగుల్ సిబ్బంది గందరగోళంలో ఉండగా రీతురాజ్ చౌదరి స్వయంగా రంగంలోకి దిగాడు. హ్యాక్ చేసిన సైట్‌ను అతడే రీస్టార్ట్ చేశాడు. ఆ వెంటనే గూగుల్ కంపెనీకి ఒక మెయిల్ పంపించాడు. ఆ మెయిల్‌లో… ‘మీ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ఈ లోపం (బగ్) వల్లే నేను దాన్ని హ్యాక్ చేయగలిగాను’ అని సూటిగా చెప్పాడు. ఈ మెయిల్ గూగుల్ ఉన్నతాధికారులను ఉలిక్కిపాటుకు గురిచేసింది. వెంటనే రంగంలోకి దిగిన గూగుల్ నిపుణులు..‌‌. రీతురాజ్ చెప్పినట్టుగానే సాఫ్ట్‌వేర్‌లో ఒక పెద్ద లోపాన్ని గుర్తించారు. ఒక చిన్న లోపం ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్‌ను కొన్ని సెకన్ల పాటు ఆపేసిందంటే రీతురాజ్ మేధస్సు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

12 గంటల సమావేశం… 3.66 కోట్ల జీతం!
అమెరికాలో గూగుల్ ప్రధాన కార్యాలయంలో ఈ విషయంపై సుమారు 12 గంటల పాటు ఆకస్మిక సమావేశం జరిగింది. రీతురాజ్ చౌదరి ప్రతిభకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. అతడి సామర్థ్యాన్ని మెచ్చుకుంటూ వెంటనే గూగుల్‌లో చేరాల్సిందిగా ఆహ్వానిస్తూ ఒక ఈ-మెయిల్ వచ్చింది. అంతేకాదు ఏకంగా 3.66 కోట్ల రూపాయల వార్షిక జీతంతో కూడిన అపాయింట్‌మెంట్ లెటర్ కూడా పంపించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థల్లో ఒకటైన గూగుల్‌లో అదీ ఇంత భారీ ప్యాకేజీతో ఉద్యోగం అంటే మాటలు కాదు! ఆ యువకుడి నైపుణ్యం ముందు డబ్బుకు, హోదాకు విలువ లేకుండా పోయింది.

2 గంటల్లో పాస్ పోర్ట్…
రీతురాజ్ ప్రతిభకు గూగుల్ మెస్మరైజ్ అయింది. అతడిని అమెరికాకు తీసుకురావడానికి ఉన్న అడ్డంకులను తొలగించడానికి ఏకంగా కంపెనీ అధికారులు రంగంలోకి దిగారు. రీతురాజ్‌ను తీసుకెళ్లడానికి భారత్‌కు వస్తామని చెప్పారు. అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య తలెత్తింది. రీతురాజ్ దగ్గర పాస్‌పోర్ట్ కూడా లేదు. వెంటనే అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వంతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన ఎమర్జెన్సీ పాస్‌పోర్ట్‌ను రెండు గంటల్లో సిద్ధం చేయించింది. అంతేకాదు దాన్ని నేరుగా రీతురాజ్ ఇంటికే డెలివరీ చేయించింది.

ప్రైవేట్ జెట్లో పయనం…
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెక్ కంపెనీ ఒక యువ భారతీయుడి కోసం ఏకంగా రెండు దేశాల ప్రభుత్వాలతో మాట్లాడటం, అత్యవసరంగా పాస్‌పోర్టును అందించడం చూస్తుంటే రీతురాజ్ ప్రతిభ విలువ ఎంతో తెలుస్తోంది. అద్భుతమైన ఈ ప్రయాణంలో రీతురాజ్ ప్రైవేట్ జెట్‌లో అమెరికాకు బయలుదేరనున్నారు. నిస్సందేహంగా ఈ యువకుడు దేశంలోని లక్షలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకం. చదువుకు, నైపుణ్యానికి సరిహద్దులు లేవని, సరైన ప్రతిభ ఉంటే ప్రపంచం మన కాళ్ళ వద్ద ఉంటుందని రీతురాజ్ నిరూపించాడు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *