- పెర్ప్లెక్సిటీ ఫైనాన్స్ ప్లాట్‌ఫాం ద్వారా ట్రాక్
- త్వరలో భారత్ లో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు
- ఎవరెవరు ఎంత సంపాదించారో వెలికితీత
- ఆస్తులు… స్టాక్ లో పెట్టుబడులు బహిర్గతం
- వార్షిక ఆస్తి ప్రకటనలు, లోక్‌పాల్ తో వివరాలు
సహనం వందే, హైదరాబాద్:
దేశ రాజకీయాల్లో త్వరలో ఒక పెను సంచలనం చోటు చేసుకోనుంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సెర్చ్ ఇంజిన్ పెర్ప్లెక్సిటీ ఏఐ తీసుకొస్తున్న నూతన ఫీచర్ భారతీయ రాజకీయ నాయకుల స్టాక్ హోల్డింగ్స్ గుట్టు రట్టు చేయనుంది. ఇప్పటివరకు ఎన్నికల అఫిడవిట్లు, ఆస్తి డిక్లరేషన్లలో అస్పష్టంగా ఉన్న నేతల ఆర్థిక కార్యకలాపాలు, షేర్ల పెట్టుబడులు ప్రజల కళ్ల ముందు పారదర్శకంగా ఆవిష్కృతం కాబోతున్నాయి. పెర్ప్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. కొద్ది వారాల్లోనే ఈ సదుపాయం భారత్‌లో అందుబాటులోకి రానుందని ఆయన ప్రకటించారు.

టెక్నాలజీతో రాజకీయ నేతలకు పరీక్ష…
ప్రస్తుతం అమెరికాలో అగ్రరాజ్య నేతల ట్రేడింగ్ వ్యవహారాలను ట్రాక్ చేస్తున్న పెర్ప్లెక్సిటీ ఫైనాన్స్ ప్లాట్‌ఫాం ఇప్పుడు భారత మార్కెట్‌లోకి విస్తరించనుంది. అమెరికన్ రాజకీయ నాయకులు ఏ కంపెనీల్లో షేర్లు కలిగి ఉన్నారు? ఏ ట్రేడింగ్‌లు జరిపారనే సమాచారాన్ని ఆ దేశ ప్రభుత్వ ఆర్థిక డిస్‌క్లోజర్ల నుంచి సేకరించి ప్రజలకు అందిస్తున్న తరహాలోనే భారత్‌లోనూ ఈ వ్యవస్థ పనిచేయనుంది. ఎన్నికల కమిషన్ కు సమర్పించే అఫిడవిట్‌లు, వార్షిక ఆస్తి ప్రకటనలు, లోక్‌పాల్ చట్టం కింద దాఖలు చేసే ఆర్థిక వివరాలు వంటి ప్రభుత్వ పత్రాలు దీనికి ప్రధాన డేటా వనరులుగా మారతాయి. ఈ ఫీచర్ ప్రారంభమయితే ఏ నాయకుడు ఏ కంపెనీ షేర్లు కలిగి ఉన్నారో లేదా ఏ కంపెనీ షేర్లను ఏ నాయకులు కొన్నారో తెలుసుకునే అద్భుత అవకాశం ప్రజలకు లభిస్తుంది.
జనం చేతికి కొత్త ఆయుధం
ఈ నూతన టెక్నాలజీ ఫీచర్‌తో బినామీ ఆస్తులు, అస్పష్టమైన ఆర్థిక ప్రకటనల వెనుక దాగి ఉన్న అపర కుబేరుల బండారం త్వరలో బయటపడనుంది. సాధారణంగా ప్రజాప్రతినిధులు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు ఆర్జించినట్లు తరచుగా ఆరోపణలు వస్తుంటాయి. ఇప్పుడు పెర్ప్లెక్సిటీ ద్వారా ప్రజలు తమ ప్రతినిధుల ఆర్థిక కార్యకలాపాలను నేరుగా పర్యవేక్షించే అవకాశం వస్తుంది. ఇది రాజకీయ బాధ్యతను, నైతికతను గణనీయంగా పెంచే పారదర్శకతకు కొత్త ఆయుధంగా మారనుంది. నేతలు తమ ఆర్థిక నిర్ణయాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండక తప్పదు.
పెర్ప్లెక్సిటీకి సవాళ్లు…
అయితే ఈ విప్లవాత్మక ఫీచర్‌పై మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. కొందరు యూజర్లు రాజకీయ నేతల నిజమైన ఆర్థిక పారదర్శకతను చూడాలని ఉత్సాహం వ్యక్తం చేయగా… మరికొందరు దీనిపై తీవ్ర సందేహాలు, ఆందోళనలు వెలిబుచ్చారు. ‘భారతీయ రాజకీయ నాయకులు తమ పేరుతో పెట్టుబడులు పెట్టరు. అంతా బినామీలు, బంధువుల పేర్ల మీదనే ఉంటుంద’ని ఒకరు వ్యాఖ్యానించారు. మరొకరు… ‘ఈ మురికి నీటిలో అడుగుపెట్టకు’ అని సీఈవో అరవింద్‌కు సలహా ఇచ్చారు. కొంతమంది ఏకంగా భారత్‌లో పెర్ప్లెక్సిటీని నిషేధించవచ్చనే భయాన్ని కూడా వ్యక్తం చేశారు. దేశంలో బినామీ ఆస్తుల చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ వ్యవస్థలోని లోపాలు, అస్పష్టమైన డిక్లరేషన్‌లు ఈ ఫీచర్ సమర్థతను సవాలు చేయవచ్చు. ఏదేమైనా ప్రజా ప్రతినిధులను ఒక ఆట ఆడుకునే విధంగా ఈ ఫీచర్ ఉంటుందన్నది మాత్రం నిర్వివాదాంశం. ఈ చొరవ విజయం సాధిస్తే దేశంలో పారదర్శకత కొత్త శిఖరాలకు చేరుకుంటుంది.