- ఎంఐఎం వ్యూహం… ఎన్డీఏకు లాభం
- మహాకూటమి గుండెల్లో ఓటు చీలిక ప్రమాదం
- 64 స్థానాల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం కూటమి
- త్రిముఖ పోరుతో మహాకూటమికి పెద్ద సవాలు
- తేజస్వీని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్న ఓవైసీ
సహనం వందే, పాట్నా:
బిహార్ ఎన్నికల రాజకీయాలు అసదుద్దీన్ ఓవైసీ వ్యూహంతో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలోని మహాకూటమి ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని ఎంఐఎం పోటీ పడడం పరోక్షంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి లాభం చేకూర్చే అవకాశం కలిగించింది. మహాకూటమి ప్రధానంగా ఆధారపడిన ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారానే ఈ ప్రమాదం ఏర్పడుతోంది. 2020 ఎన్నికల్లో ఎంఐఎం పోటీ వల్ల ఐదు సీట్లు కోల్పోయిన మహాకూటమి… ఇప్పుడు 64 సీట్లకు విస్తరించిన ఈ పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఓటు చీలిక వ్యూహం సీమాంచల్, మిథిలాంచల్ వంటి కీలక ప్రాంతాలలో 10 నుంచి 15 సీట్ల వరకు మహాకూటమిని నష్టపరచి బిహార్‌లో బీజేపీ ఆధిపత్యాన్ని బలోపేతం చేస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మూడో కూటమి ఎత్తుగడ
పెద్ద లౌకిక పార్టీలైన మహాకూటమితో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమైన ఎంఐఎం ఇప్పుడు గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ పేరుతో మూడో కూటమిగా రంగంలోకి దిగింది. ఆరు సీట్లు కేటాయించాలని ఆర్జేడీకి లేఖ రాసినా స్పందన లభించకపోవడంతో ఒంటరిగా 64 అసెంబ్లీ సీట్లలో పోటీ పడేందుకు సిద్ధమైంది. ఈ కూటమిలో ఎంఐఎంకు 35 సీట్లు, ఆజాద్ సమాజ్ పార్టీకి 25 సీట్లు కేటాయించారు. కిషన్‌గంజ్, పూర్ణియా, కటిహార్, అరరియా వంటి ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలలో బలమైన పట్టు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ మూడో కూటమి… కేవలం తమ ఉనికిని నిరూపించుకోవడమే కాకుండా మహాకూటమి విజయావకాశాలను దెబ్బతీసే నిర్ణయాత్మక శక్తిగా మారడానికి ప్రయత్నిస్తోంది.
త్రిముఖ పోరుతో మహాకూటమికి పెద్ద సవాలు
గ్రాండ్ డెమోక్రటిక్ అలయన్స్ రూపంలో ఎంఐఎం పోటీ, అలాగే మొత్తం 243 సీట్లకు పోటీ పడుతున్న ప్రశాంత్ కిషోర్ జన సూరజ్ పార్టీ పోటీతో కలిసి బిహార్ ఎన్నికలను త్రిముఖ పోరుగా మారుస్తోంది. 2020లో ఐదు సీట్లు గెలిచి తర్వాత ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరిన చేదు అనుభవం ఉన్నప్పటికీ ఎంఐఎం మరోసారి బలపడాలని చూస్తోంది. బిహార్‌లోని అధిక ముస్లిం జనాభా ప్రాంతాలలో ఓటు చీలిక అనివార్యం కావడం, యువతలో ఉద్యోగాల హామీపై ఉన్న సందేహాలను ఓవైసీ రాజకీయం చేయడం వల్ల ఈ ఎన్నికల్లో మహాకూటమికి ఎదురయ్యే సవాళ్లు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. ఇది ఎన్డీఏకు అనుకూలంగా మారితే ఆ రాజకీయ వ్యూహంలో అతి పెద్ద లబ్దిదారు బీజేపీ అవుతుందనడంలో సందేహం లేదు.
తేజస్వీ హామీపై ఓవైసీ గుస్సా…
ఓవైసీ కేవలం ఓట్లను చీల్చడం మాత్రమే కాదు ప్రత్యర్థి కూటమి నాయకుడు తేజస్వీ యాదవ్ యువతకు ఇచ్చిన భారీ ప్రభుత్వ ఉద్యోగాల వాగ్దానాన్ని తీవ్రంగా విమర్శించడం ద్వారా రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. డబ్బు చెట్లకు కాయదు అంటూ ఈ హామీని ఎలా అమలు చేస్తారో తేజస్వీ స్పష్టం చేయాలని ఓవైసీ ప్రశ్నించారు. ఉద్యోగాల కొరతతో అల్లాడుతున్న బిహార్ యువతను లక్ష్యంగా చేసుకుని ఇచ్చిన ఈ ప్రకటన వాస్తవికతపై సందేహం వ్యక్తం చేయడం ద్వారా మహాకూటమి విశ్వసనీయతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. పెద్ద పార్టీలు ముస్లిం సమాజానికి తగిన స్థానం ఇవ్వకపోవడం వల్లే ఈ ఓట్ల చీలిక అని వాదించడం ద్వారా ముస్లిం యువతలో పేరుకుపోయిన కోపాన్ని తమ ఓటు బ్యాంకుగా మలచుకోవాలని ఓవైసీ ప్రయత్నిస్తున్నారు.