లైక్ చేస్తే లూటీ – 30,000 మంది… రూ. 1,500 కోట్లు లూటీ

  • క్లోన్ వెబ్‌సైట్‌లు… చాట్‌బాట్‌లతో ఆర్థిక నేరం
  • నకిలీ ఖాతాలో కోట్లు చూపించి ఆశపెట్టారు
  • వాటిని విత్ డ్రా చేసేందుకు ప్రయత్నిస్తే బ్లాక్
  • ఏఐ మాయ… డీప్ ఫేక్ తో నకిలీ గొంతులు
  • నకిలీ వెబ్‌సైట్లపై ప్రభుత్వ నకిలీ సెబీ ముద్ర
  • లైక్‌తో మొదలై… క్లోన్‌తో చిక్కుకునే ప్రమాదం

సహనం వందే, హైదరాబాద్:
డిజిటల్‌ ప్రపంచంలో చిన్న లైక్‌ కూడా ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందో సుమిత్ కుమార్ ఉదంతం నిరూపిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని చెఫ్ సుమిత్… ఒక ఆర్థిక సలహాదారు వీడియోకు లైక్ కొట్టగానే పది నిమిషాల్లోనే వాట్సాప్ సందేశం వచ్చింది. పెట్టుబడి కోసం ఎర వేయడానికి సైబర్ నేరగాళ్లు ఎంత వేగంగా పకడ్బందీగా పనిచేస్తున్నారో చెప్పడానికి ఇదే ఉదాహరణ. వాట్సాప్ గ్రూపుల ద్వారా నకిలీ సభ్యులతో లాభాల ఊసేత్తుతూ తమ వలలో చిక్కుకున్న వ్యక్తికి ఆశ రేకెత్తించడం వారి మొదటి వ్యూహం. పెట్టుబడులు పెట్టడానికి ముందు నిజానిజాలు పరిశీలించుకునే సమయం కూడా లేకుండా క్షణాల్లోనే వ్యక్తిగత వివరాలను గుంజుతున్నారు.

నకిలీ వెబ్‌సైట్లపై నకిలీ సెబీ ముద్ర…
నేరగాళ్లు సృష్టించిన సాంకేతిక మాయాజాలం ఎంత పకడ్బందీగా ఉందంటే… అసలు-నకిలీ మధ్య తేడాను గుర్తించడం సామాన్యులకు అసాధ్యంగా మారింది. సుమిత్‌ను ట్రాప్‌ చేయడానికి ఉపయోగించిన 361 డబ్ల్యూఏఎం వెబ్‌సైట్‌ను అచ్చం నిజమైన దానిలా క్లోనింగ్ చేశారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రిజిస్ట్రేషన్ నంబర్‌ను సైతం ఆ నకిలీ సైట్‌లో పొందుపరచడం నేరగాళ్ల తెగింపునకు నిదర్శనం. ఆధార్, పాన్ వంటి సున్నితమైన వ్యక్తిగత వివరాలను సేకరించి వారిని ఒక నకిలీ వాట్సాప్ గ్రూపులో చేర్చారు. ఆ గ్రూపులో ఉన్న అంజలి, భగత్ వంటి నకిలీ పెట్టుబడిదారుల చాటింగ్‌లతో భారీ లాభాలు వస్తున్నట్లుగా భ్రమ కల్పించి పెట్టుబడి పెట్టడానికి ఉసిగొల్పారు.

మ్యూల్ ఖాతాలు… రికవరీకి వీల్లేని దందా
బాధితుల నుంచి కొల్లగొట్టిన డబ్బును మ్యూల్ (అద్దె) ఖాతాల ద్వారా క్షణాల్లో చెల్లాచెదురు చేయడం సైబర్ మాఫియా తెలివైన ఎత్తుగడ. సుమిత్ మొత్తం రూ. 38 లక్షలు మోసగాళ్లకు చెల్లించగా… జులై 10 నాటికి అతని నకిలీ ఖాతాలో రూ. 3.4 కోట్లు ఉన్నట్లు చూపించి ఆశ పెంచారు. విత్‌డ్రా చేసుకోబోతే ఏకంగా రూ. 51 లక్షల సర్వీసు ఛార్జీ అడగడంతో మోసం బయటపడింది. ఆ డబ్బు కేవలం 15 ఖాతాల నుంచి 250 ఖాతాలకు, ఆపై 20,000 చిన్న ఖాతాలకు బదిలీ అయింది. వీటిలో అత్యధిక ఖాతాలు ఆన్‌లైన్ గేమింగ్, జూదం సైట్లతో అనుసంధానం కావడం ద్వారా డబ్బు రికవరీకి వీలు లేకుండా పోతోంది. ఇండోర్‌ డాక్టర్‌తో సహా అనేక మంది బాధితుల కథ ఇదే. సాంకేతికతను వాడుకుని వేల ఖాతాల్లోకి డబ్బు మళ్లించడం వల్ల దర్యాప్తు సంస్థలు వెనకబడిపోతున్నాయి.

ఏఐ డీప్‌ఫేక్… ఊహకందని కొత్త బెడద
పెట్టుబడి మోసాలు ఇప్పుడు మరింత శక్తివంతమైన అస్త్రాలను ఉపయోగిస్తున్నాయి. నేటి సైబర్ నేరగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డీప్‌ఫేక్ వీడియోలు సృష్టిస్తూ సెలబ్రిటీల గొంతు, రూపాలను నకిలీ చేస్తున్నారు. ప్రముఖ ఆర్థిక సలహాదారుల ముఖాలను, స్వరాలను వాడుకుని బాధితులను నమ్మించడం ద్వారా మోసాల తీవ్రతను కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నారు. అంతేకాక క్లోన్ వెబ్‌సైట్‌లు, చాట్‌బాట్‌లు ఆర్థిక పదజాలాన్ని అనుకరిస్తూ మరింత విశ్వసనీయతను పెంచుతున్నాయి. గత ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా దాదాపు 30,000 మంది రూ. 1,500 కోట్లు కోల్పోయారంటే ఈ సైబర్ విషవలయం ఎంత భయంకరంగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.

బ్లాక్ చేయడంలో జాప్యం…
సైబర్ నేరాల కేసుల్లో ఫిర్యాదులు చేసినా నకిలీ వెబ్‌సైట్లను బ్లాక్ చేయడానికి నెలల తరబడి సమయం పడుతుండటం వ్యవస్థ లోపాలను ఎత్తి చూపుతోంది. సుమిత్ జులై 15న పోలీసులను ఆశ్రయించినా ఫిర్యాదు నమోదుకు నెల రోజులు, నకిలీ సైట్‌ను బ్లాక్ చేయడానికి మరో నెల పట్టింది. మూడు నెలల పాటు ఆ సైట్ బహిరంగంగా ఉండి లక్షల మందిని మోసం చేసే అవకాశం ఇచ్చింది. సైబర్ పోలీసులకు తగిన సాంకేతిక శిక్షణ లేకపోవడం, కేసుల దర్యాప్తులో ఒక ఏకరీతి విధానం లేకపోవడం బాధితులను వివిధ స్టేషన్ల మధ్య తిప్పేలా చేస్తోంది. సాంకేతికంగా నేరగాళ్లు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటున్న ఈ తరుణంలో పోలీసు యంత్రాంగం సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *