- ఆర్.కృష్ణయ్యపై బీసీల ఆక్రోశం
- ఆయన చరిష్మా ముందు పదవులు జుజుబి
- ఉద్యమాన్ని బలహీనపరచే కుట్రగా వ్యాఖ్య
- చరిత్ర సృష్టించే అవకాశం ఉందని పిలుపు
సహనం వందే, హైదరాబాద్:
బీసీల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఉద్యమ దిక్సూచి ఆర్. కృష్ణయ్య ప్రస్తుత రాజకీయ ప్రస్థానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ అనే ఉద్యమకారుడు కృష్ణయ్యకు రాసిన ఒక బహిరంగ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో అగ్గి రాజేస్తోంది. గత చరిత్రను నెమరువేస్తూనే అపారమైన బీసీ నాయకుడి ఇమేజ్‌కు ఎమ్మెల్యే, ఎంపీ వంటి పదవులు ఏమాత్రం సరితూగవని ఆ లేఖ నిలదీసింది. రాజకీయ పక్షాలు బీసీ ఉద్యమాన్ని నీరుగార్చే వ్యూహంలో భాగంగానే కృష్ణయ్యను వాడుకుంటున్నాయనే ఆరోపణలు బీసీ వర్గాల ఆలోచనలకు పదును పెడుతున్నాయి.
బీసీ అంటే కృష్ణయ్యే బ్రాండ్
ఎనిమిదో దశకంలో బీసీల హక్కులకై ఆర్. కృష్ణయ్య నడిపిన ఉద్యమాన్ని దేశమంతా చూసిందని ప్రవీణ్ కుమార్ లేఖలో గుర్తు చేశారు. విద్యార్థి దశ నుంచి అసెంబ్లీ ముట్టడి వరకు ఆయన దూకుడు వైఖరి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమై ఉంది. 44 శాతం రిజర్వేషన్ల ప్రతిపాదన సమయంలో ఎన్టీఆర్ హయాంలో ఆయన చూపిన నాయకత్వ పటిమ బీసీ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చిందని కొనియాడారు. బీసీ అనే మాటకు కృష్ణయ్యే అసలు సిసలు బ్రాండ్ అని స్పష్టం చేస్తూ, అటువంటి నాయకుడికి ప్రస్తుత పదవులు తగవని మండిపడ్డారు.
ఉద్యమాన్ని బలహీనపరచే కుట్ర…
ఎమ్మెల్యే, ఎంపీ వంటి పదవులు కృష్ణయ్య బీసీ ఇమేజ్‌కు ఏ మాత్రం సరిపోవని… ఆయన కేవలం సూచిస్తే చాలు ఏ రాజకీయ పార్టీ అయినా టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందని లేఖ స్పష్టం చేసింది. అయినా పార్టీలు ఆయన్ని తమ వైపు ఎందుకు లాక్కుంటున్నాయి? బీసీ ఉద్యమాన్ని బలహీనపరచి తమ పబ్బం గడుపుకోవడానికే కృష్ణయ్యను పావుగా వాడుకుంటున్నాయనేది పచ్చి నిజమని ఆరోపించారు. ఈ రాజకీయ వ్యూహాలు కృష్ణయ్యకు తెలియనివి కావని గుర్తు చేస్తూ వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
చరిత్ర సృష్టించే అవకాశం మెండు…
తన జీవితంలో చరిత్ర సృష్టించుకునే అరుదైన అవకాశం కృష్ణయ్య ముందు ఉందని… పదవుల పట్ల ఆశను విసిరికొట్టి ఉద్యమ నాయకుడిగా నిలబడాలని ప్రవీణ్ కుమార్ లేఖ ద్వారా కోరారు. దాదాపు 2 కోట్ల బీసీ సమాజమే కృష్ణయ్యకు కొండంత బలం. ఆయన ఒక్కసారి కదిలితే ప్రధాన రాజకీయ పార్టీల కేంద్రాలుగా ఉన్న గాంధీ భవన్, సంఘ్ భవన్, గులాబీ భవన్‌లు సైతం కృష్ణయ్య ఇంటి ముందు వాలిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు కేవలం అంటుకునే మరకలు మాత్రమేనని వాటిని క్షణాల్లో పోగొట్టుకోవచ్చని సూచించారు. ఇది కేవలం ఒక లేఖ కాదు… ఒక ఉద్యమ నాయకుడి అంతరాత్మను తాకుతున్న నిశిత ప్రశ్న.