క్రికెట్ బాల్… క్యాబినెట్ ‘గోల్’ – నేడు స్టార్ క్రికెటర్ అజహర్ ప్రమాణ స్వీకారం

  • అంతర్జాతీయ క్రీడా కుటుంబం నుంచి మంత్రి
  • సానియా మీర్జాతో అజహరుద్దీన్ బంధుత్వం
  • తన కుమారుడికి సానియా చెల్లితో వివాహం
  • తెలంగాణ క్యాబినెట్ కు స్పోర్ట్స్ గ్లామర్ టచ్

సహనం వందే, హైదరాబాద్:
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత గ్రేస్‌ఫుల్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించనున్నారు. శుక్రవారం (నేడు) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైంది. క్రికెట్ పిచ్‌లపై మాయ చేసిన ఈ సెలబ్రిటీ ఇప్పుడు పరిపాలనలోకి అడుగు పెట్టడం రాష్ట్ర రాజకీయాలకు గ్లామర్ టచ్ ఇస్తోంది. ముస్లిం మైనారిటీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలనే కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టే ప్రక్రియ చేపట్టారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలే లక్ష్యంగా…
అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలనే కాంగ్రెస్ నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ముందు ఈ చర్య మైనారిటీ ఓటర్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ వేసిన ఎత్తుగడగా విశ్లేషకులు చెబుతున్నారు. అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లు అధిక సంఖ్యలో ఉండడంతో ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా ఆ వర్గం మద్దతును కూడగట్టాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయాన్ని బీజేపీ, బీఆర్‌ఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పేర్కొంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను పెంచింది.

అజారుద్దీన్ విజయాలు… వివాదాలు
1984లో టెస్టుల్లో అరంగేట్రం చేసి వరుసగా మూడు సెంచరీలు నమోదు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన అజారుద్దీన్… తన కెరీర్‌లో 99 టెస్టులు, 334 వన్డేలు ఆడారు. కెప్టెన్‌గా భారత క్రికెట్‌కు సుదీర్ఘకాలం సేవలందించారు. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ వివాదాలు ఆయన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపినా 2012లో కోర్టు తీర్పుతో జీవితకాల నిషేధం ఎత్తివేశారు. ఈ వివాదాలన్నిటినీ దాటి 2009లో ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా గెలిచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2018లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టనుండడం కీలక మలుపు.

కుటుంబ బంధాల్లో గ్లామర్…
అజారుద్దీన్ వ్యక్తిగత జీవితం కూడా గ్లామర్‌తో నిండి ఉంది. ఆయన కుమారుడు అసదుద్దీన్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి అనుమీర్ మీర్జాను 2019లో వివాహం చేసుకున్నారు. ఈ కుటుంబ బంధం క్రికెట్, టెన్నిస్ రంగాలకు మధ్య బలంగా ఉండి సెలబ్రిటీ హోదాను మరింత పెంచింది. సానియాకు ఉన్న క్రేజ్ కూడా అజారుద్దీన్‌కు రాజకీయంగా కలిసి వచ్చే అంశం. మరోవైపు ఆయన వ్యక్తిగత జీవితంలో అప్పటి బాలీవుడ్ నటి సంగీత బిజిలానీ కూడా ప్రవేశించారు. ఆమెని పెళ్లి చేసుకొని తర్వాత విడాకులు ఇచ్చారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *