భర్త ట్రాప్… ఫ్రెండ్స్ రేప్ – భార్యపై 51 మంది స్నేహితుల అత్యాచారం

  • ఆహారంలో మత్తు మందు కలిపిన భర్త
  • పెలికాట్ కేసు… వ్యవస్థనే కుదిపేసిన దారుణం
  • దీనిపై ఫ్రెంచ్ మహిళల వీరోచిత పోరాటం
  • అత్యాచార నిర్వచనాన్ని మార్చిన ఉద్యమం
  • అంగీకారం లేకుంటే అత్యాచారమేనని చట్టం
  • ఫ్రాన్స్‌ మహిళల పోరాటానికి విజయం

సహనం వందే, ఫ్రాన్స్:
ఒక మారుమూల గ్రామంలో బాహ్య ప్రపంచానికి ఆదర్శవంతమైన కుటుంబంగా కనిపించిన ఓ ఇంటిలో దాగిన దారుణ రహస్యం ఫ్రాన్స్‌లోని వ్యవస్థనే కుదిపేసింది. గిసెలె పెలికాట్ అనే 72 ఏళ్ల సాధారణ మహిళ..‌. తొమ్మిది సంవత్సరాల పాటు తన భర్త డొమినిక్ పెలికాట్ చేసిన అమానుషానికి బాధితురాలైంది. తన భోజనంలో, కాఫీలో తీవ్రమైన మత్తు మందులు కలిపి అపస్మారక స్థితిలోకి నెట్టి… ఆమె అనుమతి లేకుండా 51 మంది దుర్మార్గులతో అత్యాచారం చేయించిన ఆ ద్రోహం యావత్ దేశాన్ని ఆలోచింపజేసింది. అత్యాచారాలను వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో షేర్ చేయడం డొమినిక్ పశుత్వానికి పరాకాష్ట. 2024లో ముగిసిన చారిత్రక ట్రయల్‌లో ఈ 51 మంది నిందితులకు శిక్ష పడటం న్యాయవ్యవస్థపై కొంత నమ్మకాన్ని నిలబెట్టినా… ఈ కేసు లైంగిక హింస భయంకరమైన విస్తృతిని, మత్తు మందుల ద్వారా లైంగిక దోపిడీ (కెమికల్ సబ్‌మిషన్) అనే దారుణ పద్ధతిని ప్రపంచానికి ఎత్తిచూపింది.

సమ్మతికి చట్టబద్ధత: పోరాటానికి ఫలితం
లైంగిక దాడులకు గురైన మహిళల పక్షాన దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటం చివరకు గురువారం ఫలించింది. ఫ్రాన్స్ పార్లమెంటు, అత్యాచార చట్టపరమైన నిర్వచనంలో సమ్మతి (కన్సెంట్) అనే పదాన్ని చేర్చింది. పాత చట్టం కేవలం హింస, బెదిరింపు, బలవంతం ద్వారా జరిగే లైంగిక చర్యను మాత్రమే అత్యాచారంగా పరిగణించేది. ఇకపై ఆ దృక్పథం పూర్తిగా మారుతుంది. స్పష్టమైన, స్వేచ్ఛాయుతమైన, అనుమతి లేకుండా ఏ లైంగిక చర్య జరిగినా అది చట్టం దృష్టిలో అత్యాచారమే. బాధితురాలు మౌనంగా ఉండటం లేదా స్పందించకపోవడం అనుమతిగా పరిగణించరు. ఈ చట్ట సవరణ బాధితులకు మరింత బలాన్నిస్తుంది, లైంగిక హింసపై న్యాయవ్యవస్థ అవగాహనను మరింత బలోపేతం చేస్తుంది.

గిసెలె పోరాటం… ప్రతి మహిళకు ఒక ఆదర్శం
గిసెలె పెలికాట్ తనపై జరిగిన అమానుషాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి, ఇతర బాధితులకు స్ఫూర్తిని ఇవ్వడానికి తన పేరును బహిర్గతం చేయాలని కోరిన ధైర్యవంతురాలు. ఆమె చేసిన ఈ పోరాటం ఫ్రాన్స్‌లో ఈ చారిత్రక చట్ట మార్పుకు బలమైన కారణమైంది. ఆమె కేసు కేవలం నేర కథనం మాత్రమే కాదు. ఇది భయం, సిగ్గు అనే తెరలను తొలగించి న్యాయం కోసం పోరాడటానికి సిద్ధపడిన ఒక మహిళ ఆత్మవిశ్వాసానికి చిహ్నం. ఫ్రాన్స్ చరిత్రలో సమ్మతి ఇప్పుడు కీలకంగా మారింది. ఇకపై ప్రతి మహిళకు వారి శరీరంపై, వారి నిర్ణయాలపై పూర్తి అధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *