విదేశీ గడ్డపై ఫుడ్డు కోసం గడ్డి – స్విట్జర్లాండ్ లో భారతీయ పర్యాటకుడి కక్కుర్తి

  • బఫెట్ ఫుడ్డు తిని బాక్సుల్లో తీసుకెళ్లిన తీరు
  • విదేశాల్లో కొందరు ఇండియన్ల వెకిలి చేష్టలు
  • అక్కడి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహారం
  • లక్షలు ఖర్చు పెట్టి… చవకబారు పనులు

సహనం వందే, స్విట్జర్లాండ్:
స్విట్జర్లాండ్‌ హోటళ్ల వద్ద కొందరు భారతీయ పర్యాటకులు ప్రదర్శిస్తున్న చవకబారు బుద్ధి యావత్ దేశాన్ని తలదించుకునేలా చేస్తోంది. జ్యూరిచ్‌లోని ఓ హోటల్ బ్రేక్‌ఫాస్ట్ బఫేలో ఢిల్లీకి చెందిన ఒక కుటుంబం చేసిన పనిని అక్కడే ఉన్న ఓ భారతీయ వ్యక్తి కళ్లారా చూసి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబం హోటల్‌కి ఖాళీ బాక్సులు తీసుకువచ్చి అందులో పండ్లు, ఉడికించిన గుడ్లు, పెరుగు వంటి వాటిని నింపుకొని వెళ్లిపోయింది. హోటల్ ప్రవేశ ద్వారం వద్ద నో టేక్ అవే అనే బోర్డు స్పష్టంగా ఉన్నా లెక్కచేయకుండా ఈ పనికి పాల్పడడం ఎంతటి అవమానం? స్విట్జర్లాండ్ పర్యటన కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఇలాంటి దొంగ బుద్ధి చూపించడం మన దేశ ప్రతిష్ఠను ప్రపంచ పర్యాటకుల ముందు దిగజారుస్తోంది.

టేస్టింగ్ టేబుల్స్‌ వద్ద జేబుల్లోకి చాక్లెట్స్…
ఇది కేవలం ఒక హోటల్‌కే పరిమితం కాలేదు. ఇదే జ్యూరిచ్‌ నగరంలో ఉన్న ప్రముఖ లిండ్ట్ చాక్లెట్ మ్యూజియం వద్ద కూడా భారతీయ టూర్ గ్రూపులు ఇదే తరహా చవకబారుతనం ప్రదర్శించాయి. మ్యూజియంలో ఏర్పాటు చేసిన టేస్టింగ్ టేబుల్స్‌ వద్ద గుంపులుగా చేరి ఇతరులకు కనీసం అవకాశం ఇవ్వకుండా చాక్లెట్లు తీసుకోవడమే కాక జేబులు, సంచుల్లో కుక్కుకున్నారు. సిబ్బంది ఒకటో రెండో తీసుకెళ్లవచ్చని చెప్పినా లెక్కచేయకుండా పిల్లలు ఐదు నుంచి పది చొప్పున లాగేసుకుంటున్నా తల్లిదండ్రులు నవ్వుతూ నిలబడడం విస్మయానికి గురిచేసింది. ముఖ్యంగా పర్యాటకులలోనే ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది.

విదేశీ అతిథ్య నియమాలు చాలా కఠినం…
విదేశీ అతిథ్య నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. మన దేశంలో చేసినట్లుగా విదేశాల్లో ప్రదర్శించడం దేశ ప్రతిష్ఠను పూర్తిగా దిగజారుస్తుంది. ఇలాంటి చవకబారు ఆలోచనలు, దొంగతనం చేసే ప్రవర్తన వల్ల ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ద్వేషానికి, చులకన భావానికి గురవుతున్నారని సామాజిక మాధ్యమాల్లో కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *