రెండేళ్ల ప్రేమ ఐదేళ్ల నరకం – ఒక యువతి కన్నీటి గాధ

  • మూడు ఉద్యోగాల్లో మునిగిన జీవితం
  • అనారోగ్యమైనా పట్టించుకోని భర్త
  • ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు పశ్చాతాపం
  • విడాకుల భయం… నెటిజెన్ల ప్రోత్సాహం

సహనం వందే, ముంబై:
29 ఏళ్ల ముంబై యువతి గుండెలు బద్దలు చేసిన ఒక విషాద కథ ఇది. రెండేళ్ల పాటు ఇద్దరూ కలిసి మెలిసి డేటింగ్ చేసి ఒకరికొకరు ప్రపంచంగా బతికిన ప్రేమ కథ. పెళ్లైన ఐదేళ్ల తర్వాత పచ్చి నరకంగా మారింది. మొదట్లో ఆమెకు తన భర్తంటే పిచ్చి ఆరాధన. అర్థవంతమైన మాటలు, ఆదరణ, సొంతంగా ఎదిగిన వ్యక్తిత్వం చూసి తల్లిదండ్రుల హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పుడు ఆమె కళ్లల్లో కన్నీళ్లు తప్ప ఇంకేమీ మిగలలేదు. తన గుండె నిండా ఉన్న బాధను ఐదేళ్ల వైవాహిక జీవితంలో పడిన నరకాన్ని ఆమె రెడ్డిట్‌లో పంచుకోగా వేలాది మంది నెటిజన్లు కన్నీటితో స్పందించారు.

మూడు ఉద్యోగాలు… పనిలో కరిగిన జీవితం
ఆ యువతి దైనందిన జీవితం మాటల్లో చెప్పలేనిది. ఆమె రోజుకు 12 గంటలకు పైగా మూడు ఉద్యోగాలు చేస్తోంది. ఆర్థికంగా స్థిరంగా ఉండడానికి ఆమె ఒక్కతే అహర్నిశలు శ్రమిస్తోంది. ఇంట్లో వంట మనిషి, పనిమనిషి ఉన్నా భోజనం మెనూ ప్లాన్ చేయడం… సరుకులు (గ్రాసరీ) ఆర్డర్ చేయడం వంటి ఇంటి బాధ్యతలన్నీ ఆమె భుజాల మీదనే. ఒక్కరోజు తలనొప్పి వచ్చి పడుకుంటే..‌‌. ‘నువ్వు ఒక్కరోజు నా లాగా పని చేయలేవు’ అంటూ భర్త ఎద్దేవా చేయడం ఆమె గుండెను బద్దలు చేసింది. ఆమె ఆరోగ్యాన్ని, భావాలను ఏమాత్రం లెక్కచేయడు. పైగా థెరపీ తీసుకుంటున్నందుకు నవ్వడం, ఇంటి పనులు చేయడం లేదని, అత్తగారితో గడపడం లేదని తిట్టడం ఆమెను కుంగదీసింది. ఆమెకు బతుకు బరువైపోయింది.

డబ్బు కోసమేనా ఈ ప్రేమ?
భర్త కుటుంబం గతంలో చేసిన తప్పుల వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. లీగల్ ఫీజులు భరిస్తున్నా భార్య పట్ల మాత్రం అతనికి కనీస సానుభూతి కూడా లేదు. బయటివారు మెచ్చుకుంటేనో, ఇతరులు ఆమెపై ఆసక్తి చూపితేనో మాత్రమే భర్త ఆమెను పట్టించుకుంటాడు. దీంతో డబ్బు కోసమే తనతో ఉన్నాడేమో అన్న భయం ఆమె గుండెల్లో పుట్టింది. ఐదేళ్లుగా అతడు మారుతాడని, ఈ నరకం నుంచి బయటపడతామని ఎదురుచూసింది. కానీ భర్తలో ఏ మార్పూ రాలేదు. ఆమె ఆశలన్నీ ఆరిపోయాయి. ఈ పరిస్థితి చూసి మొదట్లో హెచ్చరించిన తల్లిదండ్రుల కన్నీళ్లకు ఇప్పుడు అర్థం కనిపిస్తోంది.

విడాకుల భయం… నెటిజెన్ల ప్రోత్సాహం
ఆ యువతి ఆర్థికంగా స్వతంత్రురాలు. ఆమె తల్లిదండ్రులు పూర్తి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ విడాకులు అనే ఆలోచన గుండెను గట్టిగా కొట్టుకునేలా చేస్తోంది. విడిపోతే సమాజం తనను నిందిస్తుందేమో, అందరూ మెచ్చుకునే తన భర్త బాధితుడిలా నటిస్తాడేమో అన్న ఆందోళన ఆమెను వెంటాడుతోంది. ‘నువ్వు మారవు… నేను మారను… ఇక విడిపోవడమే మార్గం’ అని చెప్పడానికి ధైర్యం కోసం ఆమె కన్నీళ్లు కారుస్తోంది. ఐదేళ్లు చాలు… అతను మారడు… నమ్మకం ఎలా ఉంచావని నెటిజన్లు ఆమెను ప్రశ్నించారు. మూడు ఉద్యోగాలు చేస్తూ ఇంటి బాధ్యతలు మోయడం అసాధ్యం అని హెచ్చరించి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి మనసు శాంతింపజేసుకోమని సలహా ఇచ్చారు. భర్తది కేవలం మానిప్యులేటివ్ ప్రవర్తన అని ఆమె గుర్తించింది. ధైర్యం చేసి ఆ నరకం నుంచి బయటపడాలని ఆమెకు నెటిజెన్లు సంఘీభావం చెప్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *