- మొబైల్ నెట్‌వర్క్ కంపెనీల డొల్లతనం
- మోసపోతున్న మొబైల్ వినియోగదారులు
- శాస్త్రీయ పరీక్షల్లో వెలుగు చూసిన మోసం
- 40 శాతం మోసం జరుగుతుందని నిర్ధారణ
సహనం వందే, న్యూఢిల్లీ:
మొబైల్ స్క్రీన్ పై 5జీ గుర్తు కనిపించిందంటే రాకెట్ వేగంతో నెట్‌వర్క్ వచ్చేసినట్టేనని భ్రమ పడతాం. కానీ నెట్‌వర్క్ కంపెనీలు ఇచ్చిన హామీలన్నీ నీటి మీద రాతలయ్యాయి. ఒక నిమిషంలో 18 హై డెఫినిషన్ సినిమాలు డౌన్ లోడ్ అవుతుందని ఊరించారు. కానీ తాజాగా జరిగిన పరిశోధనలో దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. 5జీ నెట్‌వర్క్ 40 శాతం 4జీ నెట్‌వర్క్‌నే చూపిస్తోందని తేలింది. ఈ మోసాన్ని ఇకనైనా ప్రశ్నించాలి.
5జీ 25 రెట్ల వేగం ఏమైంది?
నెట్‌వర్క్ సగటు డౌన్‌లోడ్ వేగం 4జీతో పోలిస్తే ఏకంగా 15 నుంచి 25 రెట్లు ఎక్కువగా ఉండాలని నెట్‌వర్క్ విశ్లేషణ సంస్థల నివేదికలు వెల్లడిస్తున్నాయి. 4జీలో సగటు డౌన్‌లోడ్ వేగం 10-20 ఎంబీపీఎస్ (మెగాబిట్స్ పర్ సెకండ్) వరకు ఉండగా… 5జీ నెట్‌వర్క్ ద్వారా ఏకంగా 250 నుంచి 350 ఎంబీపీఎస్ వరకు వేగాన్ని అందుకోవాలి. ప్రముఖ సంస్థ ఊక్లా విడుదల చేసిన నివేదికల ప్రకారం… సగటున 4జీ వేగం 13 ఎంబీపీఎస్ ఉంటే… 5జీ వేగం ఏకంగా 338 ఎంబీపీఎస్ వరకు ఉండాలి. అంటే దాదాపు 25 రెట్లు ఎక్కువ. ఈ లెక్కన 5జీ నెట్‌వర్క్ ద్వారా అతిపెద్ద ఫైళ్లను కూడా క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం వినియోగదారులకు ఉండాలి.
పరీక్షల్లో బయటపడ్డ డొల్లతనం…
పాలసీ ట్రాకర్ సంస్థ ఏకంగా 11 వేల సార్లు నెట్‌వర్క్‌ల వేగాన్ని కొలిచి వాటి డొల్లతనాన్ని నిరూపించింది. నాలుగు భిన్నమైన ఫోన్లతో నాలుగు ప్రధాన నెట్‌వర్క్‌లపై లండన్, బర్మింగ్‌హామ్, లింకన్‌షైర్ వంటి వివిధ ప్రాంతాల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఫోన్‌లో 5జీ గుర్తు చూపిస్తున్నప్పటికీ… డేటా మాత్రం 4జీ మాస్ట్‌ల ద్వారానే ప్రవహిస్తోంది. దీని వల్ల వేగం నత్తనడకలా ఉంటోంది.
మాస్ట్‌ల కొరత… బలహీన సిగ్నల్ వ్యవస్థ
నిజమైన 5జీ సేవలు అందించాలంటే దానికి మాస్ట్‌లు ఎక్కువ కావాలి. వాటి మధ్య దూరం తక్కువగా ఉండాలి. ప్రభుత్వం, ఆపరేటర్లు కోట్లు ఖర్చు పెట్టినా కవరేజ్ మాత్రం అత్యంత దారుణంగా ఉంటుంది. నగరాల్లోనే సిగ్నల్ బలహీనంగా ఉంటే గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణం. ఇక స్టాండ్‌ఎలోన్ 5జీ పేరుతో కొత్త ప్లాన్లు తీసుకొచ్చారు. వాటి ధర ఎక్కువ. రైల్వే స్టేషన్లలో మాత్రమే కొంచెం మెరుగ్గా ఉంటుందట. మిగతా చోట్ల 4జీకి పడిపోతుంది.
గుట్టుగా మారుతున్న సేవలు
5జీ చిహ్నం కేవలం ఆ ప్రాంతంలో సిగ్నల్ ఉనికిని మాత్రమే సూచిస్తుందని… రియల్ టైమ్ పరిస్థితులను బట్టి నెట్‌వర్క్ మారుతుందని మొబైల్ యూకే సంస్థ చెబుతోంది. అంటే వినియోగదారులకు తెలియకుండానే సిగ్నల్ బలం ఆధారంగా ఆటోమాటిక్ గా 4జీకే దారి మళ్లిస్తున్నారన్నమాట. ఇదొక గుట్టుగా జరుగుతున్న మోసం. వినియోగదారులకు స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా మెరుగైన సేవలు అందిస్తున్నామని భ్రమింపజేయడం కేవలం లాభాపేక్ష తప్ప మరోటి కాదు.
స్పీడ్ టెస్ట్ చేయండి…
మొబైల్ నెట్‌వర్క్‌ల ఈ మోసాన్ని వినియోగదారులు ఇకనైనా ప్రశ్నించాలి. ముందుగా స్పీడ్ టెస్ట్ చేయండి. ఆన్‌లైన్ టూల్స్ ద్వారా డౌన్‌లోడ్, అప్‌లోడ్ రేట్లను కొలవండి. ఆఫ్‌కామ్ మొబైల్ కవరేజ్ చెకర్‌లో మీ పోస్ట్‌కోడ్ వేసి సిగ్నల్ బలాన్ని చూడండి. సరైన సేవలు లేకపోతే వెంటనే ప్రొవైడర్‌కు ఫిర్యాదు చేయండి. సమస్య పరిష్కారం కాకపోతే కాంట్రాక్ట్ నిబంధనలు ఉన్నప్పటికీ మరో నెట్‌వర్క్‌కు మారడానికి వెనుకాడకండి. ఒకటి చూపి మరొకటి ఇస్తే అది మోసమేనని రిజాల్వర్ నిపుణుడు జాస్పర్ గ్రీగ్‌సన్ హెచ్చరిస్తున్నారు. వినియోగదారుల హక్కు చట్టం ఇతర రంగాల్లో కఠినంగా అమలవుతున్నప్పుడు… మొబైల్ నెట్‌వర్క్‌లకు మినహాయింపు ఎందుకని నిలదీయాలి.
నామమాత్రంగా ప్రభుత్వ పాత్ర
5జీ కోసం ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టింది. మాస్ట్‌ల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. కానీ కవరేజ్ సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. ఆపరేటర్లు కేవలం లాభాల కోసం 5జీ పేరుతో 4జీ సేవలను అమ్ముతున్నారు. ఇదంతా ప్రభుత్వ నియంత్రణ లోపం వల్లే జరుగుతోంది. వినియోగదారులు మేలుకోకపోతే వారి డబ్బు గాలికి పోవడం ఖాయం. ప్రభుత్వమూ, నియంత్రణ సంస్థలూ ఈ విషయంలో తక్షణమే కలుగజేసుకోవాలి. లేకపోతే ఈ 5జీ మాయగానే మిగిలిపోతుంది, మోసం రాజ్యమేలుతుంది.